• facebook
  • whatsapp
  • telegram

సమాఖ్య విధానమే శ్రీరామరక్ష

సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన రెండు తీర్పులు, చేసిన ఒక వ్యాఖ్యానం- భారత రాజ్యాంగ మౌలిక సూత్రమైన సమాఖ్య విధానానికి రక్షణ వలయంగా నిలుస్తున్నాయి. సంపూర్ణ మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ- రాష్ట్రాల అధికారాలకు కత్తెర వేయడం ఆనవాయితీగా మారింది. ఈ ధోరణి దశాబ్దాల తరబడి కొనసాగుతోంది.

ఈ నెల 10న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన రెండు తీర్పులు సమాఖ్య విధానానికి రక్షణను కట్టుదిట్టం చేస్తాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది. వీటిలో మొదటిది- దిల్లీ జాతీయ రాజధాని ప్రాంత (ఎన్‌సీటీ) ప్రభుత్వం వెర్సస్‌ కేంద్ర ప్రభుత్వం కేసులో తీర్పు. రెండోది- మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వానికి సంబంధించినది. దిల్లీ ఎన్‌సీటీ వెర్సస్‌ కేంద్ర ప్రభుత్వం కేసులో తీర్పును దిల్లీ సర్వీసుల తీర్పుగా వ్యవహరిస్తున్నారు. దీని పూర్వాపరాల్లోకి వెళితే-2017 మే 21న కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్‌ దిల్లీ పబ్లిక్‌ సర్వీసులు, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విషయంలో పూర్తి అధికారాలు కేంద్ర ప్రభుత్వానికే ఉంటాయని ప్రకటించింది. దీనర్థం దిల్లీ పోలీసు విభాగం, అధికార యంత్రాంగం దిల్లీ ప్రభుత్వం చేతిలో కాకుండా- కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉంటాయి. దీనిపై సుప్రీంకోర్టు గతంలోనే విభేదించినా మరో సుప్రీం ధర్మాసనం అందుకు భిన్నమైన తీర్పును వెలువరించడంతో చిక్కు తలెత్తింది. తాజా తీర్పుతో సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం దాన్ని తొలగించింది. పబ్లిక్‌ సర్వీసులు, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌పై దిల్లీ  ఎన్‌సీటీ ప్రభుత్వానికే సర్వాధికారాలు ఉంటాయని తేల్చిచెప్పింది.

రాష్ట్రాల వ్యవహారాల్లో జోక్యం

రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన రెండో తీర్పు- మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం కూలిపోయిన ఉదంతంలో గవర్నర్‌ పాత్రకు సంబంధించినది. మహారాష్ట్ర వ్యవహారం బ్రిటిష్‌ కాలంలో గవర్నర్ల నిరంకుశ శైలిని తలపించింది. 1930లలో రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. భారత ప్రజల మేలు కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలు బ్రిటిష్‌ వలస పాలకులకు నచ్చకపోతే, వారు నియమించిన గవర్నర్లు వాటికి అడ్డుతగిలేవారు. ఆ చేదు అనుభవాల దృష్ట్యా గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలని స్వాతంత్య్రానికి పూర్వమే డిమాండ్‌ వచ్చింది. కానీ, పాత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని స్వతంత్ర భారతంలో గవర్నర్లు ప్రజా ప్రభుత్వాలకు సలహాదారు పాత్ర పోషిస్తారని రాజ్యాంగ నిర్మాణ సభ ఆశించింది. దేశ భద్రతకు ముప్పు ఏర్పడినప్పుడు మాత్రమే గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ సలహా సూచనల ప్రకారం నడచుకోవాలని భావించి, గవర్నర్‌ వ్యవస్థను కొనసాగనిచ్చింది.

ఇక మూడోది- తెలంగాణ గవర్నర్‌ పాత్రపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యానం. తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లులకు గవర్నర్‌ అనుమతి ఇవ్వకుండా బిగపట్టడం వెనక రాజకీయ కారణాలే తప్ప చట్టపరమైన, పాలనాపరమైన కారణాలేవీ లేవని విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో గవర్నర్‌ తనకు అభ్యంతరకరమైన బిల్లులను సాధ్యమైనంత త్వరగా తిప్పి పంపాలి తప్ప, వాటిని తొక్కిపట్టకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2014-19 మధ్య కాలంలోనూ ఆంధ్రప్రదేశ్‌లో అనేక బిల్లులకు గవర్నర్‌ ఇదేవిధంగా అనుమతి బిగపట్టారు. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన బిల్లులపై గవర్నర్లు ఆందోళన, అనుమానాలు లేవనెత్తడం సహజమే. అవి నివృత్తి కాకపోతే బిల్లులను తిప్పి పంపవచ్చు లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపవచ్చు.  మహారాష్ట్రలో ఉద్ధవ్‌ థాకరే ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందని ప్రత్యర్థులు చేసిన వాదన తప్ప గవర్నర్‌ ముందు మరే సాక్ష్యాధారాలు లేవని సుప్రీంకోర్టు పేర్కొంది. అయినా కూడా థాకరే మెజారిటీ కోల్పోయారని గవర్నర్‌ తీర్మానించడం సరికాదని సుప్రీం స్పష్టం చేసింది. కాబట్టి గవర్నర్లుగా నియమితులైనవారు కేంద్ర ప్రభుత్వ రాజకీయ ఏజెంట్లుగా వ్యవహరించకుండా సహేతుకంగా నిష్పాక్షిక నిర్ణయాలు తీసుకోవాలి. తగిన సాక్ష్యాధారాలు ఉంటేనే అసెంబ్లీలో బలపరీక్షకు ఆదేశించాలి.

తోసిపుచ్చిన సుప్రీం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ అంశాలపై వేర్వేరు అధికారాలు, ఉమ్మడి అధికారాలు ఉన్నాయి. దిల్లీ దేశ రాజధాని కాబట్టి అక్కడ కేంద్ర ప్రభుత్వానికి విశేషాధికారాలు ఉంటాయనే వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కేంద్రం పనిగట్టుకుని రాష్ట్రాల అధికారాలను హరిస్తోందనే వాదన నిరాధారం కాదు. అదే సమయంలో రాష్ట్రాల స్వయంకృతం వల్ల కేంద్రం అధికారాలను గుప్పిట పెట్టుకోగలుగుతోందన్న సంగతినీ గ్రహించాలి. రాష్ట్రాలు పన్నుల విధింపునకు సంబంధించిన అధికారాలన్నింటినీ జీఎస్టీ మండలికి ధారాదత్తం చేశాయి. ఆ మండలిలో కేంద్రానికి వీటో అధికారం ఉండటం రాష్ట్రాల ఆర్థిక ప్రయోజనాలకు భంగకరం. దీనికితోడు సాంకేతిక మార్పులు, రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోవడం- కేంద్ర అధికారాల పరిధిని పెంచుతున్నాయి. ఆధార్‌, మొబైల్‌, బ్యాంకు ఖాతా నంబర్ల అనుసంధానం వల్ల కేంద్రం రాష్ట్రాలతో పనిలేకుండా చాలా అంశాల్లో నేరుగా పన్ను చెల్లింపుదారులతో సంబంధాలు నెరపగలుగుతోంది. ఓటు బ్యాంకు రాజకీయాలు, జనాకర్షక పథకాల మీద రాష్ట్రాలు అతిగా ఆధారపడటం వాటి ఆర్థిక స్తోమతను దెబ్బతీసింది. ఖర్చులు పెరిగి ఆదాయం తరిగి నిధుల కోసం పదేపదే కేంద్రాన్ని అర్థించాల్సిన అగత్యం రాష్ట్రాలకు ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం లేకుండానే కేంద్రం నేరుగా స్థానిక సంస్థలకు నిధులు పంపిణీ చేయడమూ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోంది. విద్య, వైద్యం ఉమ్మడి జాబితాలో ఉన్నా కొన్ని సందర్భాల్లో ఈ అంశాలపై రాష్ట్రాల చట్టాలకన్నా కేంద్ర చట్టాలే ఆధిపత్యం వహిస్తాయి. ఫలితంగా కేంద్రం, రాష్ట్రాలు ఉమ్మడి జాబితాలోని అంశాలపై సమాన భాగస్వాములుగా వ్యవహరించాలనే సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటోంది. ఇక్కడ రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యుడు డాక్టర్‌ బ్రజేశ్వర్‌ ప్రసాద్‌ వాదనను ఒకసారి గుర్తుచేసుకోవాలి. కేంద్ర-రాష్ట్ర ఉమ్మడి జాబితాలంటూ ఏవీ ఉండకూడదని, అన్నీ కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించాలని, ఆ నిర్ణయాలను అమలుచేసే బాధ్యతను మాత్రమే రాష్ట్రాలకు ఇవ్వాలని ఆయన వాదించారు. రాజ్యాంగ నిర్మాతలు దాన్ని తోసిపుచ్చినా స్వతంత్ర భారతంలో కొందరు పాలకులు ఈ వాదనకు అనుకూలమైన పంథానే అనుసరించిన మాట నిజం. సుప్రీం తాజా తీర్పులు అలాంటి పరిస్థితుల్ని చక్కదిద్దుతాయని ఆశిద్దాం.

రాజ్యాంగ స్ఫూర్తి

కేంద్రం రాజకీయ విభేదాల కారణంగా రాష్ట్రాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం పరిపాటిగా మారింది. ఈ ధోరణిని సర్కారియా కమిషన్‌ (1983), రాజ్యాంగ పనితీరు సమీక్షకు నియమించిన జాతీయ కమిషన్‌ (2000), కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటైన పుంఛీ కమిషన్‌ (2007) తప్పుపట్టాయి. అయినా పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. ఇకనైనా రాజ్యాంగానికి వక్ర భాష్యాలు చెప్పడం మాని, నిజమైన రాజ్యాంగ స్ఫూర్తితో బాధ్యతలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ జీవ వైవిధ్యంతోనే సుస్థిర అభివృద్ధి

‣ డిజిటల్‌ సాగుతో లాభాల పంట

‣ జీఎస్టీ ఎగవేతకు కళ్ళెం

‣ ప్రపంచ సవాళ్లకు జీ7 పరిష్కారాలు

Posted Date: 24-05-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం