• facebook
  • whatsapp
  • telegram

న్యాయసంస్కరణలు ఎండమావేనా?

దేశ ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయ పరికల్పనకు రాజ్యాంగమే పూచీపడి ఏడు దశాబ్దాలు గడిచినా- ఎండమావి న్యాయాన్ని అందుకోలేక జనావళి గుండెలవిసి పోతున్నాయి. వ్యాజ్యాలు నిజం- న్యాయం మిథ్యగా పరిస్థితులు విషమించడానికి- కర్ణుడి చావుకంటే ఎక్కువ కారణాలు పోగుపడ్డాయి. సుప్రీం న్యాయపాలిక సహా దేశవ్యాప్తంగా పాతిక హైకోర్టుల్లో న్యాయపీఠాలు పూర్తిస్థాయిలో భర్తీ కాకపోవడం వాటిలో కీలకమైనది. ఈ నెల ఒకటో తేదీ నాటికి సుప్రీంకోర్టులో నాలుగు, హైకోర్టుల్లో 1074 జడ్జి పోస్టులకు గాను 414 ఖాళీలు భర్తీకాకుండా ఉన్నాయి. జిల్లా సబార్డినేట్‌ కోర్టుల్లో 24,225 మందికిగాను, 19,345 మందే విధుల్లో ఉన్నట్లు గణాంకాలు చాటుతున్నాయి. ప్రతి హైకోర్టు న్యాయమూర్తి సగటున తలసరి నాలుగున్నర వేలు; సబార్డినేట్‌ కోర్టులో ప్రతి జడ్జి సగటున 1300 పెండింగ్‌ వ్యాజ్యాలతో కుస్తీ పట్టాల్సి వస్తోందని కేంద్ర న్యాయశాఖ చెబుతోంది. ఈ ఏడాది తొలి నాటికి తెలంగాణ హైకోర్టులో అపరిష్కృత పిటిషన్ల సంఖ్య రెండు లక్షల ఆరువేలు; నవంబరు నాటికవి మరో పద్నాలుగు వేలు పెరిగాయంటూ ఎకాయెకి 11 న్యాయ పీఠాలు ఖాళీగా ఉండటంతో సత్వర న్యాయం మరీచికని తలపిస్తోందని ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రాజ్యాంగంలోని 224-ఎ అధికరణ అనుసారం ప్రధాన న్యాయమూర్తులు- రాష్ట్రపతి ఆమోదంతో విశ్రాంత న్యాయమూర్తుల సేవల్ని వినియోగించుకోగల వీలుందని, ఆ దిశగా ఆదేశాలివ్వాలని పిటిషనర్‌ కోరుతున్నారు. నిశితంగా చూస్తే, ఇది కేవలం తెలంగాణ సమస్య కాదు. దేశవ్యాప్తంగా మూడు కోట్ల పైచిలుకు కేసులు పెండింగ్‌లో ఉండగా, ఏటా కొత్తగా మరో రెండు కోట్లు దాఖలు అవుతుంటాయని, పెండింగ్‌ కొండల్ని కరిగించడానికి 320 ఏళ్లు పడుతుందని జస్టిస్‌ వీవీరావు స్పష్టీకరించి పదేళ్లయింది. న్యాయసంక్షోభం ఇంతగా ముదిరినా తీరైన కార్యాచరణే కొరవడింది!

న్యాయస్థానాలపై మోయలేని భారం పడుతోందని 2016 నాటి ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో దుఃఖవిచలితులైన నాటి భారత ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ ఠాకూర్‌ పెండింగ్‌ కేసుల భారాన్ని వదిలించాలంటే 70 వేల మంది జడ్జీల అవసరం ఉందని ప్రకటించారు. పది లక్షల మంది జనావళికి 50 మంది న్యాయమూర్తులన్న ఆదర్శప్రాయ నిష్పత్తిని న్యాయసంఘం ప్రస్తావించిన నేపథ్యంలో ప్రస్తుతం అది 17గా ఉన్న వాస్తవాన్ని విస్మరించే వీల్లేదు. అందులోనూ మంజూరైన పోస్టుల్లో మూడింట రెండొంతుల కన్నా తక్కువ మంది న్యాయమూర్తులతోనే 12 హైకోర్టులు పని చేస్తున్నాయని వాటిలోనూ పట్నా, రాజస్థాన్‌, కోల్‌కతా హైకోర్టుల్లో ఖాళీలు 50 శాతంపైగానే ఉన్నాయని అధ్యయనాలు చాటుతున్నాయి. హైకోర్టుల్లో ఖాళీల భర్తీలో జరుగుతున్న జాప్యానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత లేదని నిర్దిష్ట కాలావధిలోగా హైకోర్టు కొలీజియాల నుంచి ప్రతిపాదనలు అందడం లేదని ఇటీవల అటార్నీ జనరల్‌ సుప్రీంకోర్టుకే నివేదించారు. మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన న్యాయ నియామకాల జాతీయ సంఘం చట్టాన్ని, సంబంధిత రాజ్యాంగ సవరణను సుప్రీం ధర్మాసనం 2015 అక్టోబరులో కొట్టేసిన దరిమిలా- ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. కాలానుగుణ సంస్కరణలకు, అందివచ్చిన సాంకేతికతను అనుసంధానించి దర్యాప్తు, విచారణల్లో వేగాన్ని పెంచి కక్షిదారుల కన్నీళ్లు సత్వరం తుడిచే న్యాయప్రక్రియ- పాశ్చాత్య దేశాల ప్రగతికి తన వంతు చేయూతనిస్తోంది. అదే ఇక్కడ జోడెడ్ల బండి కాలంనాటి వ్యవస్థ, న్యాయ నియామకాలకూ పెండింగ్‌ జాడ్యం సోకిన దురవస్థ నడుమ దశాబ్దాలుగా నలిగిపోతున్న సగటు పౌరుడి సూటి ప్రశ్న- న్యాయసంస్కరణలు ఎండమావేనా?

- ఈనాడు ఎడిటోరియ‌ల్‌
 

Posted Date: 26-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం