• facebook
  • whatsapp
  • telegram

స్వస్థభారత్‌కు కరదీపిక

అత్యంత ప్రమాదకరమైన ఎబోలా, ఎల్లోఫీవర్‌, ఎవియన్‌ ఇన్‌ఫ్లుయంజా వంటి పది వైరస్‌ ఇన్‌ఫెక్షన్లు ప్రజారోగ్యానికి ఎంత చెరుపు చెయ్యగలవో ప్రస్తావిస్తూ వాటిని కాచుకునే ముందస్తు సన్నద్ధత అవసరాన్ని నిరుడు జులైలోనే భారతీయ వైద్య పరిశోధన మండలి ఎలుగెత్తి చాటింది. వాటిని తలదన్నే స్థాయిలో విరుచుకుపడిన కరోనా వైరస్‌ ధాటికి ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలన్నీ కకావికలమైపోగా దాదాపు 18లక్షల మందిని బలిగొన్న కొవిడ్‌- ఆర్థిక వ్యవస్థల్నీ అతలాకుతలం చేసేసింది. ప్రపంచ ఆరోగ్యాన్ని 2020 సంవత్సరం ఛిన్నాభిన్నం చేసేసిందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ- అచిరకాలంలోనే సకల దేశాల్నీ చుట్టబెట్టిన మహమ్మారి ఆరోగ్య వ్యవస్థల్లోని లొసుగుల్ని బయట పెట్టిందని, రెండు దశాబ్దాల అవిరళ శ్రమతో ఆయా విభాగాల్లో సాధించిన ప్రగతినీ అది దిగలాగేస్తోందని ఆందోళన వ్యక్తీకరిస్తోంది. కొవిడ్‌పై పోరాటానికి కొత్త సాధన సంపత్తి అందుబాటులోకి వస్తున్న దశలో- వచ్చే ఏడాది దేశదేశాల కార్యాచరణకు ప్రాతిపదిక కాగల పది సూత్రాల అజెండానూ ప్రకటించింది. ‘ప్రతి ఒక్కరూ సురక్షితం కానిదే ఏ ఒక్కరికీ భద్రత లే’దన్న వాస్తవాన్ని నొక్కి వక్కాణిస్తూ ప్రపంచవ్యాప్త ఆరోగ్య భద్రతకు అందరూ సంఘీభావంతో కూడి రావాలన్న డబ్ల్యూహెచ్‌ఓ- మున్ముందు అవసరపడే వ్యాక్సిన్ల సత్వర తయారీకి వీలుగా ‘బయో బ్యాంక్‌’ ఏర్పాటును ప్రస్తావించింది. జబ్బు పడినవారు చికిత్సా వ్యయం భరించలేక పేదరికంలోకి జారిపోరాదనీ అభిలషిస్తోంది. వైద్య ఖర్చులు భరించలేక ఏటా ఆరు కోట్ల మంది దారిద్య్రరేఖ దిగువకు పడిపోతున్న ఇండియా తప్పక చెవిన పెట్టాల్సిన సూచనలూ అజెండాలో ఉన్నాయి. అర్ధాంతర మరణాలకు ప్రధాన కారణాలుగా గుర్తించిన పదిలో ఏడు అసాంక్రామిక వ్యాధులే ఉన్నాయన్న సంస్థ- మానసిక ఆరోగ్యం, పొగాకు ముప్పుల పైనా దృష్టి సారించాలంటోంది. స్వస్థ భారత్‌కు కరదీపిక కాగల అజెండా ఇది!

ఆరోగ్యాన్ని దేశప్రజల ప్రాథమిక హక్కుగా నిర్ధారించి వచ్చే ఏడాది 75వ స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ప్రకటించాలని 15వ ఆర్థిక సంఘం నియమించిన నిపుణుల కమిటీ సూచించింది. ప్రపంచ జనాభాలో 17శాతానికి నెలవైన భారత్‌, జబ్బుల భారంలో 20శాతానికి కేంద్రంగా మారి, స్వస్థ సేవలపరంగా కొరతల కోమాలోకి జారి మానవ మహా విషాదాన్ని కళ్లకు కడుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలోనే 90శాతం జబ్బుల్ని నయంచేయగల వీలుందని ప్రపంచ బ్యాంక్‌ ఎప్పుడో విశ్లేషించినా, దశాబ్దాలుగా ఆ పునాది స్థాయి సేవలకు దాపురించిన నిత్య క్షామం లక్షలమంది అభాగ్యుల్ని బలిగొంటోంది. సాంక్రామిక వ్యాధుల్ని తలదన్నేలా విజృంభిస్తున్న అసాంక్రామిక రోగాలు (ఎన్‌సీడీ) మరింతగా భీతిల్లజేస్తున్నాయి. మధుమేహ రాజధానిగా దుష్కీర్తి మూటగట్టుకున్న ఇండియాలో రక్తపోటు, క్యాన్సర్‌, హృద్రోగాల ఉరవడి మరణ మృదంగం మోగిస్తోంది. అసాంక్రామిక వ్యాధుల్ని తొలిదశలోనే గుర్తించేందుకు వీలుగా జిల్లాస్థాయిలో పరీక్షలు నిర్వహించే జాతీయ కార్యక్రమం 2010లోనే మొదలైంది. జబ్బులతో ఆరోగ్య కేంద్రాలకు వచ్చేవారిని పరీక్షించడం తప్పించి తాముగా జనసమూహాన్ని జల్లెడ పట్టే చొరవ కొరవడటంతో- అసాంక్రామిక వ్యాధిగ్రస్తులెంతమంది అన్నది ఇదమిత్థంగా తెలియని దుస్థితి నెలకొంది. అసాంక్రామిక వ్యాధులున్నవారే అధికంగా కొవిడ్‌కు బలైపోతున్న నేపథ్యంలో సర్కారీ రికార్డులకెక్కిన 27 కోట్లమందికి తొలివిడతలోనే టీకానివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసాంక్రామిక కేసుల లెక్క పక్కాగా తేల్చేలా ఆరోగ్య సేవల విస్తరణ, రిజిస్టర్ల సక్రమ నిర్వహణ పద్ధతిగా జరగాలి. పొగతాగేవారికి న్యుమోనియా వచ్చే అవకాశం 14 రెట్లు అధికమని, అలాంటివారిపై కొవిడ్‌ కర్కశంగా కోర చాస్తోందని రుజువయ్యాక కూడా పొగాకును కొనసాగించడం- జనారోగ్యంతో మృత్యుక్రీడలాడటమే. కిందిస్థాయి నుంచి ఆరోగ్య వ్యవస్థల్ని పటిష్ఠంగా పునర్నిర్మించుకోవాలన్న డబ్ల్యూహెచ్‌ఓ సూచన- ఇండియాకు మరింతగా శిరోధార్యమే!

- ఈనాడు ఎడిటోరియ‌ల్‌
 

Posted Date: 30-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం