• facebook
  • whatsapp
  • telegram

దారి తప్పుతున్న యువత

బాధ్యతాయుత పెంపకం అవసరం

యునెస్కో ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో సినిమాల్లో దూకుడు పాత్రల్లో నటించే హీరోలను ఇష్టపడే యువకుల్లో ఎక్కువశాతం నేరస్వభావం కలిగినవారే ఉంటారు. అలాంటివారిని మొగ్గదశలోనే గుర్తించి మార్గదర్శనం చేసేవారు ఉంటే సమాజంలో నేరాలు, నిబంధనల ఉల్లంఘనలు గణనీయంగా తగ్గుతాయి.

ఆధునిక కాలంలో యువత అనేక రకాల అవాంఛిత కార్యకలాపాలతో, వింత పోకడలను అనుసరిస్తోంది. విద్యార్థులుగా ఉన్న యువకులెందరో పెడదారిలో ప్రయాణిస్తూ విలువైన జీవితాలను కోల్పోతున్నారు. నగరాల్లో అర్ధరాత్రి రోడ్లపై కార్లు-మోటార్‌బైక్‌ల పందేలు, మద్యం సేవించి వాహనాలు విపరీతమైన వేగంతో నడపటం, ఆన్‌లైన్‌ జూదం, మాదకద్రవ్యాల వినియోగంవంటివి తరచూ వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి ధోరణులను గుర్తించి వారిని దారిలో పెట్టాల్సిన బాధ్యత ఎక్కువగా తల్లిదండ్రులమీదే ఉంటుంది. కొంతమంది పిల్లల డిమాండ్లను రెండో ఆలోచన లేకుండా అంగీకరిస్తున్నారు. గతంలో ఇద్దరు యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు అతివేగంగా కారు నడుపుతూ ఫ్లైఓవర్‌ నుంచి కారుతో సహా కింద పడి అసువులు బాశారు. పోలీసులు ఆ కారులో గంజాయిని కనుక్కున్నారు. పందెంలో వందరూపాయలు గెలవడానికి బైక్‌పై కొన్ని సెకెన్లలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ దాటే ప్రమాదకరమైన క్రీడ ఇటీవల వెలుగుచూసింది. ఇలాంటి పందేల్లో కాస్త అటూఇటు అయితే ప్రాణాలకే ప్రమాదం. అలాంటప్పుడు వారి జీవితాల విలువ కేవలం వంద రూపాయలేనా, జీవితం అంత సులభంగా ముగిసిపోతుందా అనే అనుమానాలు తలెత్తడం సహజం. తల్లిదండ్రులు తమ ప్రియమైనవారిని కోల్పోతే విలపించడం తప్ప ఏమీ చేయలేరు. ఈ పోకడలు సంపన్న కుటుంబాలలోనే కాదు, మధ్య, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లోనూ కనిపిస్తాయి. జరుగుతున్న నేరాల్లో 40శాతం 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసున్న యువతే కారణమని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

బాల్యంలో సరిగ్గా లేని పరిసరాల వాతావరణం, కుటుంబ బంధాలు అంతంతమాత్రంగా ఉండటం, చెడు స్నేహాలు ఎక్కువగా యువత పెడ దారుల్లో ప్రయాణించేందుకు కారణాలవుతాయని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆధునిక యుగంలో కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లకు బానిసలవుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. పుస్తక పఠనం, క్రీడలకు బదులు సెల్‌ఫోన్లతో కాలం గడపటం ఎక్కువయింది. బాల్యంలోనే పిల్లల ప్రవర్తనను గుర్తించగలిగి, వారికి సరైన సూచనలిస్తూ నడిపిస్తే మంచి పౌరులుగా తయారవుతారు. బాల్యంలో తల్లిదండ్రుల నిర్లక్ష్య ధోరణి, పేలవమైన పర్యవేక్షణ యుక్తవయసులో పెడదారి పట్టడానికి కారణం కావచ్చు. హాడ్జిన్స్‌ అనే శాస్త్రవేత్త ప్రకారం జూదం, ఇతర వీరోచిత కార్యకలాపాల వెనుక ప్రేరకాలు ఆర్థిక, సామాజిక లాభాలే. విలాసవంతమైన జీవితానికి లేదా చెడువ్యసనాలకు డబ్బు అవసరం ఉన్నప్పుడు దొంగతనాలకు సైతం మొగ్గు చూపే అవకాశం ఉంది. సినిమాలు, సామాజిక మాధ్యమాలు సైతం యువత పెడదారి పట్టేందుకు కారణమవుతున్నాయి. మంచి విషయాల కంటే యువకులు ప్రతికూల విషయాలను సులభంగా స్వీకరిస్తారు.

ప్రమాదకర ప్రవర్తన వల్ల కలిగే పరిణామాల గురించి తల్లిదండ్రులు తమ పిల్లలతో చర్చిస్తూ ఉండాలి. తల్లిదండ్రుల బలహీనతను గుర్తించడంలో పిల్లలకు ప్రావీణ్యం ఎక్కువ. వారి అభ్యర్ధనలను అతి గారాబంతో అంగీకరిస్తే తరవాత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని గుర్తించాలి. తల్లిదండ్రులకు బలమైన క్రమశిక్షణా వ్యూహాలు అవసరం. కిశోర వయస్కులైన పిల్లలను క్రమశిక్షణలో పెంచే విషయంలో  తల్లిదండ్రులు ఇద్దరూ ఒకే మార్గంలో నడవాలి. ఈ విషయంలో వారి మధ్య విభేదాలు వస్తే పిల్లల పెంపుదల సజావుగా సాగకపోవచ్చు. పిల్లలతో అరుదుగా మాట్లాడటం, అతిగా మాట్లాడటం రెండూ సరికాదు. యువతకు సరైన క్రమశిక్షణ ప్రస్తుత అవసరం. ఎటువంటి ప్రతికూల, అవాంఛిత ఆలోచనలు లేకుండా వారు సరైన దిశలో సాగేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనది. దేశాభివృద్ధికి అవసరమైన మూల స్తంభాల్లో యువతరం కీలకమైంది. వారిని మంచి మార్గంలోకి మళ్లించడంలో ప్రభుత్వాల బాధ్యతా ఎంతో ఉంది. గ్రామీణ, పట్టణ యువతకు ఉపాధి కల్పించడం ద్వారా సమాజంలో శాంతిభద్రతలనూ పరిరక్షించవచ్చని పాలకులు గుర్తించాలి.

- డాక్టర్‌ బి.లవకుమార్‌
 

Posted Date: 30-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం