• facebook
  • whatsapp
  • telegram

కార్మిక లోకంలో అలజడి

పెట్టుబడులకు విఘాతం కలిగే ప్రమాదం

భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని భారీగా పెంచుకునే లక్ష్యంతో సాగుతున్న వేళ- దేశంలో తాజాగా చోటుచేసుకున్న రెండు ఘటనలు ఆందోళనకరంగా  పరిణమిస్తున్నాయి. కర్ణాటక కోలార్‌లో విస్ట్రన్‌ కార్పొరేషన్‌లో చోటుచేసుకున్న విధ్వంసం, అమెజాన్‌ గిడ్డంగులపై ముంబయి, పుణెల్లో మహారాష్ట్ర నవ నిర్మాణ్‌ సేన (ఎంఎన్‌ఎస్‌) కార్యకర్తల దాడి వంటి ఘటనలు- భారత పెట్టుబడుల ఆకర్షణకు విఘాతంలా మారే ప్రమాదం లేకపోలేదు. తైవాన్‌కు చెందిన టెక్‌ దిగ్గజం విస్ట్రన్‌లో ప్రఖ్యాత యాపిల్‌ సంస్థకు చెందిన ఐఫోన్లు సహా పలు ఉత్పత్తులను తయారు చేస్తుంటారు. 1,300 మందికి పైగా శాశ్వత ప్రాతిపదికన ఉన్న ఉద్యోగులు, 8,400 మందికి పైగా ఒప్పంద కార్మికులు పనిచేస్తున్నారు. ఉద్యోగంలో చేరేటప్పుడు హామీ ఇచ్చిన మేర వేతనాలు ఇవ్వడం లేదని, నిర్దేశిత వేళలకంటే ఎక్కువ గంటలు పని చేయించుకుంటున్నారని ఆరోపిస్తూ డిసెంబరు 12న దాదాపు రెండు వేల మంది ఉద్యోగులు విస్ట్రన్‌ కర్మాగారంలో విధ్వంసానికి దిగారు. ఈ దాడితో రూ.400 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు విస్ట్రన్‌ తొలుత ప్రకటించినా, దాదాపు రూ.40-50 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు తరవాత పేర్కొంది.

విస్ట్రన్‌ కర్మాగారంలో విధ్వంసానికి శ్రమ దోపిడీయే ప్రధాన కారణం. నెలకు రూ.21వేల చొప్పున వేతనం చెల్లిస్తామంటూ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లను ఉద్యోగంలోకి తీసుకున్నారు. కొన్నాళ్ల తరవాత వారి వేతనాన్ని రూ.18 వేలకు తగ్గించారు. కరోనా సాకుతో కొంతకాలంగా రూ.12 వేలే ఇస్తూ వస్తున్నారు. ఇంజినీరింగేతర ఉద్యోగులకైతే రూ.8వేలకు మించి అందడం లేదు. కొంతమందికి నెలలో రూ.500లే ఖాతాల్లో వేసినట్లు తెలుస్తోంది. దీనికితోడు పని గంటల విషయంలోనూ ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొంది. రోజుకు 12 గంటలపాటు పని చేయించుకున్నారు. మధ్యలో కేవలం 50 నిమిషాలే విరామం కల్పించారు. షిఫ్టులను ఎంచుకునే ఐచ్ఛికాన్నీ కార్మికులకు కల్పించలేదు. మహిళలకు రాత్రి షిఫ్టులు వేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఆ పూటకు వేతనంలో కోత పడేది. యూనియన్లు కూడా అందుబాటులో లేవు. నెలలపాటు ఈ అరాచకాన్ని భరించిన ఉద్యోగులు చివరకు తాము పనిచేసే కర్మాగారంలోనే విధ్వంసానికి పాల్పడ్డారు. పని గంటల సంగతి ఎలా ఉన్నా- వేతనాల తగ్గుదలకు కొంతమంది గుత్తేదారుల చేతివాటమే కారణమని తెలుస్తోంది. విస్ట్రన్‌ కంపెనీ ఆరుగురు గుత్తేదారుల ద్వారా కార్మికులను పనిలోకి తీసుకుని, వారి ద్వారానే వేతనాలు అందిస్తోంది. జీతాల్లో సింహభాగాన్ని వారే జేబులో వేసుకొని కార్మికులకు మొండిచేయి చూపిన ఫలితంగానే పరిస్థితి విధ్వంసానికి దారితీసింది.

అమెజాన్‌ గిడ్డంగులపై రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని ఎంఎన్‌ఎస్‌ కార్యకర్తలు జరిపిన దాడిది మరో కోణం. అమెజాన్‌ యాప్‌లో మరాఠీ భాషనూ చేర్చాలని ఆ పార్టీ ప్రతినిధులు చాలాకాలం క్రితమే డిమాండ్‌ చేశారు. మరాఠీని చేర్చే దిశగా యోచిస్తున్నట్లు అమెజాన్‌ తెలిపింది. కాలం గడుస్తున్నా అడుగు ముందుకు పడకపోవడంతో ఎంఎన్‌ఎస్‌ ప్రతినిధులు అమెజాన్‌ను మళ్ళీ హెచ్చరించారు. దీంతో ఎంఎన్‌ఎస్‌ కార్యకర్తలు తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని అది ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణకు హాజరు కావాలంటూ న్యాయస్థానం రాజ్‌ ఠాక్రేకు తాఖీదు జారీ చేయడంతో, ఆయన పార్టీ కార్యకర్తలు అమెజాన్‌ గిడ్డంగులపై దాడి చేసి ఆస్తి నష్టం కలిగించారు.

విదేశీ పెట్టుబడులను అధికంగా ఆశిస్తున్న భారత్‌కు ఈ తరహా ఉదంతాలు ఇబ్బందికరమే. ఇలాంటి దాడుల వల్ల అంతర్జాతీయ సంస్థలు భారత్‌లో తమ కర్మాగారాలు, కార్యాలయాల ఏర్పాటుకు వెనకంజ వేసే ప్రమాదం ఉంది. ఫలితంగా ‘భారత్‌లో తయారీ’ వంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. వాణిజ్య యుద్ధం, కరోనా వ్యాప్తిపై ప్రపంచాన్ని ముందే అప్రమత్తం చేయకపోవడం వంటి కారణాలతో చైనాలోని తమ ప్రధాన కర్మాగారాలను బయటికి తరలించాలని పలు అమెరికా సంస్థలు యోచిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కర్మాగారాల్లో దాడులు మన ప్రతిష్ఠను మసకబారుస్తాయి. తయారీ రంగంలో చైనాకు దీటుగా ఎదగాలన్న లక్ష్యానికి ప్రతిబంధకంగా మారతాయి. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని చూరగొనడం ఎంత ముఖ్యమో, కార్మికుల ప్రయోజనాల పరిరక్షణా అంతేముఖ్యం. శ్రమ దోపిడిని మౌనంగా భరించిన కార్మికులు ప్రభుత్వ అధికారులకు మొర పెట్టుకున్నా వారు పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. ఉద్యోగుల్లో గూడుకట్టుకునే ఆవేదన, అసంతృప్తి వంటి అంశాలపై ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు దృష్టి సారించాలి. పరిశ్రమలు నిబంధనలు పాటించడంపైనా కన్నేసి ఉంచాలి. రాయితీల రూపంలో ఎకరాలకొద్దీ  భూముల్ని పొందే సంస్థలు ఉద్యోగుల సంక్షేమం, ఇతర సదుపాయాలపై తీసుకుంటున్న చర్యలనూ పరిశీలించాలి. గుత్తేదారుల కబంధ హస్తాల నుంచి కార్మికులకు విముక్తి కల్పించాలి.

- మండ నవీన్‌ కుమార్‌ గౌడ్‌
 

Posted Date: 30-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం