• facebook
  • whatsapp
  • telegram

మాదకద్రవ్యాల మహాముప్పు

చాప కింద నీరులా విస్తరణ జోరు

మాదక ద్రవ్యాల వినియోగానికి సంబంధించి కొందరు తెలుగు సినీ ప్రముఖులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఇప్పుడు విచారిస్తోంది. దేశంలో మాదక ద్రవ్యాల వినియోగం నానాటికీ పెచ్చరిల్లుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారానికి భారత్‌ ప్రధాన కేంద్రమని మూడేళ్ల కిందట అంతర్జాతీయ మాదకద్రవ్య నియంత్రణ మండలి (ఐఎన్‌సీబీ) వార్షిక నివేదిక కుండ బద్దలుకొట్టింది. 2016లో ప్రపంచవ్యాప్తంగా పట్టుబడిన గంజాయిలో ఆరు శాతం (దాదాపు 300 టన్నులు) ఒక్క ఇండియా నుంచే ఉండగా, 2017 నాటికి అది 20 శాతం పెరిగి 353 టన్నులకు ఎగసినట్లు ఆ నివేదిక వెల్లడించింది. హెరాయిన్‌ సరఫరాకు హైదరాబాద్‌ కీలకంగా మారింది. ఇటీవల నెల రోజుల వ్యవధిలో హైదరాబాదు విమానాశ్రయంలో రూ.121 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టుబడింది. ఈ ఏడాది జులై మొదటి వారంలో ముంబయి పోర్టులో రూ.1,800 కోట్ల విలువైన 300 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల అస్సాంలో రూ.163కోట్ల విలువైన మాదకద్రవ్యాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం ధ్వంసం చేసింది.

యువతపై పంజా

కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల చేపట్టిన ఓ అధ్యయనంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. దేశవ్యాప్తంగా 186 జిల్లాల్లో నాలుగు లక్షల మందికి పైగా మత్తుమందుల వినియోగదారులపై సర్వే జరిపారు. ఎక్కువ మంది అలవాటుపడిన మాదక ద్రవ్యాల్లో గంజాయి, నల్లమందు (ఓపియం), కొకైన్‌, ఏటీఎస్‌ వంటివి ఉన్నాయి. వీటిలోనూ నల్లమందు వినియోగం ఆందోళనకర స్థాయిలో ఉంది. దేశ జనాభాలో 3.1 కోట్ల మంది దీని కబంధ హస్తాల్లో బందీ అయ్యారు. అరుణాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌, మిజోరం రాష్ట్రాల్లో పదిశాతం జనాభా నల్లమందు గుప్పిట్లో చిక్కుకొంది. గంజాయికి సైతం చాలామంది అలవాటు పడుతున్నారు. ఆయుర్వేద మందు ముసుగులో దీన్ని వినియోగంలోకి తీసుకొస్తున్నారు. గంజాయిని పొడిగా, ద్రవంగా మార్చి మరీ విక్రయాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో గంజాయి సేవిస్తున్న వారి సంఖ్య 2.2 కోట్లు ఉంటుందని అంచనా. మరో కోటి మంది అదనంగా దీన్ని వినియోగిస్తూ ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌, సిక్కిం, ఛత్తీస్‌గఢ్‌, దిల్లీలలో గంజాయి వినియోగం అధికంగా ఉంది. నల్లమందును హుక్కా రూపంలో వాడుతుంటారు. దీన్నే దోడా, పుక్కీ అనీ పిలుస్తారు. హెరాయిన్‌(బ్రౌన్‌షుగర్‌) వినియోగమూ భారత్‌లో అధికమే. మత్తుకు అలవాటుపడిన వారిలో ఫార్మా పరిశ్రమల నుంచి వచ్చే మందులను 0.96శాతం వినియోగిస్తుండగా, హెరాయిన్‌ తీసుకుంటున్న వారు 1.14శాతం. మాదక ద్రవ్యాలను వివిధ రూపాల్లో అత్యధికంగా వినియోగిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లు తొలి అయిదు స్థానాల్లో నిలుస్తున్నాయి. పూర్తిగా వైద్యపరమైన అవసరాలకే వాడాల్సిన మత్తుమందులు విపణిలో యథేచ్ఛగా లభ్యమవుతూ యువత ఆరోగ్యానికి చేటు చేస్తున్నాయి.

హైదరాబాద్‌ వంటి నగరాల్లో ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు అందరికీ మాదక ద్రవ్యాలు సులభంగా దొరుకుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఇంజినీరింగ్‌ కళాశాలలు, విశ్వవిద్యాలయాల ఆవరణల్లో మత్తు మందు వినియోగం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. ఇందుకు అనేక కారణాలున్నాయి. ఔషధ పరిశ్రమలు విస్తరించడం వల్ల మత్తుపదార్థాల ముడిసరకు బహిరంగ విపణిలో విరివిగా దొరుకుతోంది. వాటిని పర్యవేక్షించాల్సిన సంస్థల మధ్య సమన్వయం లేకపోవడంతో సమస్య ముమ్మరిస్తోందని గతంలో డ్రగ్స్‌ కేసులో సినిమా ప్రముఖులను విచారించిన ప్రత్యక్ష దర్యాప్తు బృందం (సిట్‌) అధికారి శ్రీనివాసరావు వెల్లడించారు. సిగరెట్‌తో మొదలవుతున్న యువత వ్యసనాలు మద్యం, ఆ తరవాత మాదక ద్రవ్యాల వరకు వెళ్తోంది. గతంలో అంత సులభంగా దొరకని కొకైన్‌, హెరాయిన్‌ వంటివి అక్రమ రవాణా పెరగడంతో దేశీయంగా విరివిగా లభ్యమవుతున్నాయి. ఈ-కామర్స్‌, కొరియర్‌ వ్యవస్థ పెరగడంతో మత్తు మందులు నేరుగా వినియోగదారులకు చేరిపోతున్నాయి. మాదక ద్రవ్యాల విక్రయాలు ఈ స్థాయికి చేరుకోవడం కలవరపాటుకు గురిచేస్తోంది.

ఆరోగ్యానికి ప్రమాదం

ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి రవాణా నిరాటంకంగా సాగుతోంది. ఒడిశా వంటి సరిహద్దు రాష్ట్రాల నుంచి ద్రవ రూపంలో, ఆయుర్వేద మందుల తరహా ప్యాకింగ్‌ చేసి గంజాయిని తరలిస్తున్నారు. ఇటువంటి ముఠాలు కొన్ని ఇటీవల పోలీసులకు పట్టుబడ్డాయి. విశాఖ మన్యం ప్రాంతాల్లో ఇప్పటికీ గంజాయి సాగవుతోంది. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారం పోలీసులకు సవాలుగా మారుతోంది. వివిధ దశల్లో చేతులు మారుతున్న గంజాయి... యువతకు సులువుగా దొరుకుతోంది. మరోవైపు మనోవ్యాధి సంబంధ ఔషధాలు, మత్తు మందుల తయారీ ముడిపదార్థాల మళ్ళింపు పెద్ద సమస్యగా మారింది. హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, విశాఖ వంటి నగరాల్లో మత్తు మందులు చాలా సులువుగా లభ్యమవుతున్నాయి. భారత్‌లో 10 నుంచి 75 సంవత్సరాల లోపు వారిలో 16కోట్ల మంది మద్యం సేవిస్తున్నారు. దీనికి తోడు మాదక ద్రవ్యాల వినియోగం అంతకంతకూ పెరగడం ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా మారుతోంది. సూది ద్వారా మాదకద్రవ్యాలు తీసుకుంటున్న వారిలో సగం మంది హెపటైటిస్‌-సి బారిన పడుతున్నారు. నల్లమందు బాధితులూ ఎక్కువగా వ్యాధుల కోరల్లో చిక్కుతున్నారు. మాదక ద్రవ్యాల కట్టడిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి. క్షేత్రస్థాయిలో తనిఖీలను ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాల గురించి విద్యాలయాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ప్రజలు, ప్రభుత్వాలు సమష్టిగా కృషి చేస్తేనే మాదకద్రవ్యాల పీడను అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది.

గతంలోకన్నా ఎక్కువగా...

ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది 20.75 కోట్ల మంది మాదకద్రవ్యాలు తీసుకొన్నట్లు మాదకద్రవ్యాలు, నేరాలపై ఐక్యరాజ్యసమితి కార్యాలయం (యూఎన్‌ఓడీసీ) లెక్కకట్టింది. వీరిలో 3.60 కోట్ల మంది డ్రగ్‌ సంబంధిత వ్యాధుల బారిన పడినట్లు తెలిపింది. కరోనా వ్యాప్తి తరవాత విశ్వవ్యాప్తంగా చాలా దేశాల్లో గంజాయి వినియోగం బాగా పెరిగింది. అదే సమయంలో ఔషధ పరిశ్రమల నుంచి మత్తు మందులు విపరీతంగా విపణిలోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 15 నుంచి 64 సంవత్సరాలలోపు జనాభాలో 5.5శాతం సంవత్సరానికి ఒకసారి అయినా మత్తు మందులు వినియోగిస్తున్నట్లు అంచనా. కరోనా తొలిదశలో కాస్త దెబ్బతిన్న మాదక ద్రవ్యాల అక్రమ విపణి అనతి కాలంలోనే విస్తరించింది. పైగా గతంలో కంటే ఎక్కువ మోతాదులో మత్తుమందుల సరఫరా పెరిగిందని యూఎన్‌ఓడీసీ చెబుతోంది. మాదక ద్రవ్యాల సరఫరాకు అంతర్జాతీయ ముఠాలు ప్రత్యేక విమానాలనూ వినియోగిస్తున్నాయి.

- నాదెళ్ల తిరుపతయ్య
 

Posted Date: 02-09-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం