• facebook
  • whatsapp
  • telegram

మనోవర్తి... గౌరవ జీవన హక్కు!

విడాకుల ఉదంతాలు పెరుగుతున్న కొద్దీ మనోవర్తి చర్చనీయాంశమవుతోంది. అది మరీ తక్కువగా ఉంటే భార్య కనీస అవసరాలూ తీరవు. మరీ ఎక్కువైతే- దాన్ని చెల్లించే ఆర్థిక స్థోమత భర్తకు ఉండకపోవచ్చు. ఈ రెండింటినీ సమతుల్యపరచుకొని మనోవర్తిని నిర్ణయించాలని సుప్రీంకోర్టు గతంలో నిర్దేశించింది.

అనేక దేశాలకన్నా భారత్‌లో ఇప్పటికీ విడాకుల రేటు తక్కువే కానీ, క్రమంగా అవి పెరుగుతున్నాయనేది వాస్తవం. విద్య, ఉద్యోగాల్లో పెద్దయెత్తున రాణిస్తున్న స్త్రీలలో స్వేచ్ఛానురక్తి, ఆర్థిక స్వాతంత్య్రం సహజంగానే ఇనుమడిస్తున్నాయి. ఫలి తంగా వారిపై పురుషుల నియంత్రణ తగ్గుతోంది. గతంలో మాదిరిగా ఎన్ని కష్టనష్టాలనైనా భరించి సంసారంలో సర్దుకొనిపోవాలనే ధోరణిని ఆధునిక వనిత అంగీకరించడం లేదు. స్వయంగా సంపాదనపరురాలు కావడం లేదా చట్టపరంగా రక్షణలు లభించడంవల్ల- కేవలం ఆర్థిక కారణాలతోనే భర్తకు లొంగి ఉండాల్సిన అగత్యం ఇప్పుడామెకు లేదు. విడాకులు తీసుకునేవారి సంఖ్య పెరుగుతున్న కొద్దీ దేశీయంగా మనోవర్తి సంబంధిత సమస్యలు ఎదురవుతున్నాయి.

ఆర్థిక స్థితిగతుల ఆధారంగా...

వివాహ సమయంలో భార్య జీవనశైలి, తనకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు- విడాకుల తరవాతా కొనసాగేలా చూడాలన్నది మనోవర్తి సూత్రం. ఇండియాలో విడాకుల అనంతరం భార్యకు భర్త నిర్దిష్ట మొత్తంలో మనోవర్తి చెల్లించాలనే నియమమేమీ లేదు. దాన్ని నెలవారీగా ఇవ్వాలా, ఏకమొత్తంగా చెల్లించాలా అన్నది కుటుంబ కోర్టు విచక్షణపై ఆధారపడి ఉంటుంది. మనోవర్తిని నిర్ణయించేటప్పుడు విడిపోయిన భార్యాభర్తల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రత్యేక వివాహ చట్టం, హిందూ వివాహ చట్టం, నేరన్యాయ స్మృతి (సీపీసీ) వంటివి మనోవర్తికి సంబంధించిన వివిధ అంశాలను నిర్వచిస్తున్నాయి. మనోవర్తి అనేది రాజ్యాంగపరమైన హక్కే కాదు, మానవ హక్కుల్లో అది అంతర్భాగమని కుసుమ్‌ శర్మ వెర్సెస్‌ మహీందర్‌ కుమార్‌ శర్మ కేసులో సుప్రీంకోర్టు స్పష్టీకరించింది. మనోవర్తి కేసుల పరిష్కారంలో కుటుంబ న్యాయస్థానాలు ఆలస్యం చేస్తే- అది మానవ హక్కులకు, వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగిస్తుందని వ్యాఖ్యానించింది. విడిపోయిన భార్యకు ఆహారం, ఆశ్రయం, ఇతర కనీస అవసరాలను అందించి; ఆమె అనాథ కాకుండా కాపాడటానికి మనోవర్తి చెల్లింపు వేగంగా జరగడం అత్యావశ్యకం.

సుప్రీంకోర్టు నిర్దేశానుసారం... విడాకుల కేసుల్లో దేశమంతటా కుటుంబ, మేజిస్ట్రేటు, జిల్లా కోర్టులు ఒకే మార్గదర్శక సూత్రాలను పాటించాలి. శాశ్వత భరణాన్ని నిర్ణయించేటప్పుడు వైవాహిక జీవితం ఎన్ని సంవత్సరాలు నడిచిందో గమనించాలి. విడిపోయిన భార్యాభర్తల ఆర్థిక హోదా, వారి ఉద్యోగ అర్హత, వైవాహిక జీవితంలో భార్య జీవనశైలి, ఆమె విద్యార్హతలు, గౌరవప్రదంగా జీవించడానికి అయ్యే వ్యయం వంటి అంశాల ఆధారంగా మనోవర్తిని నిర్ణయించాలని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసింది. భర్త ఆదాయం, అతడిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల సంఖ్య, అతడికయ్యే ఖర్చులనూ పరిగణనలోకి తీసుకుని భార్యకు మనోవర్తిని నిర్ణయించాలి. సంసారం కోసం భార్య తన ఉద్యోగాన్ని వదిలిపెట్టే సందర్భాలూ ఉంటాయి. ఆమె మళ్ళీ ఉద్యోగం సంపాదించగలదా అన్న అంశాన్ని విడాకుల కేసుల్లో పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. భార్యకు ఉద్యోగం ఉన్నంత మాత్రాన భర్త ఆమెకు మనోవర్తి చెల్లించాల్సిన అవసరమే లేదనడమూ సరికాదని సర్వోన్నత న్యాయస్థానం ఉద్ఘాటించింది. భార్యకు మనోవర్తి చెల్లించలేని పరిస్థితిలో ఉన్నట్లు భర్త కోర్టు ముందు నిరూపించగలిగితే పరిస్థితి వేరుగా ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో భర్త కూడా మనోవర్తికి అర్హుడనే నిబంధనలున్నాయి. విడిపోయే సమయానికి ఆ దంపతులకు సంతానం ఉంటే వారి చదువుసంధ్యలు, ఆలనాపాలన కోసం చెల్లించాల్సిన మనోవర్తిని కోర్టు నిర్ణయిస్తుంది.

పరిస్థితి కట్టుతప్పితే...

స్వాతంత్య్రం వచ్చినప్పుడు దేశ ఆర్థిక స్థితిగతులు బలహీనంగా ఉన్నాయి. ఆ వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుని 1955 హిందూ వివాహ చట్టాన్ని రూపొందించారు. వైవాహిక సమస్యలపై తీర్పులు ఇచ్చేటప్పుడు హక్కులు, బాధ్యతలు, సమకాలీన ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని న్యాయపాలకులు గుర్తించారు. ఆధునిక జంటలు తమ సంసారం- మానసిక, శారీరక, ఆర్థిక స్వస్థతకు భంగకరమైన మలుపు తిరుగుతున్నదనుకుంటే వెంటనే విడిపోవాలని నిశ్చయించుకొంటున్నాయి. కాపురాల్లో కలతలు వచ్చినప్పుడు గతంలో పెద్దలు సర్దిచెప్పేవారు. ఇప్పుడు తమ కుమారుడు లేదా కుమార్తె వివాహ బంధంలోంచి విడిపోవాలనుకుంటే- వాళ్ల నిర్ణయాన్ని సమర్థించేవారు పెరుగుతున్నారు. ప్రేమానురాగాలు ఉన్న చోట పరస్పర త్యాగాలు, సర్దుకుపోవడం మామూలే. అయితే, దానివల్ల వ్యక్తుల మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతినకూడదు. అటువంటి పరిస్థితే వస్తే- విడిపోయి ఎవరి బతుకు వాళ్లు బతకడమే ఉభయులకూ శ్రేయస్కరం!

- పీవీఎస్‌ శైలజ

(సహాయ ఆచార్యులు, మహాత్మాగాంధీ న్యాయ కళాశాల, హైదరాబాద్‌)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ వ్యర్థాల దహనం... అనర్థదాయకం!

‣ మరణశిక్షే పరిష్కారమా?

‣ భారత దౌత్యనీతికి పరీక్ష

‣ అవరోధాల సుడిలో మానవాభివృద్ధి

Posted Date: 23-09-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం