• facebook
  • whatsapp
  • telegram

యువతరం... భవితకు దారిదీపం!

‣ నేడు జాతీయ యువజన దినోత్సవం

సమకాలీనత కోల్పోయిన విధానాలకు విలువ లేదు. కష్టపడితే ఇష్టమైన ఉద్యోగాలు, వృత్తుల్లో కుదురుకోగలమన్న భరోసా ఈ దేశ యువతలో లేకపోవడానికి కాలదోషం పట్టిన విధానాలే కారణం. చదువుకు, ఉద్యోగానికి లంకె కుదరని ఉపాధి రహిత అభివృద్ధివైపు ఈ గమనం... తిరోగమన సంకేతం! గడచిన 45 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయికి నిరుద్యోగిత చేరడానికి కారణం- కొత్తగా కోరసాచిన కరోనా మాత్రమే కాదు... దశాబ్దాలుగా బూజుపట్టిన విధానాలు కూడా! జాతీయ యువజన విధానం 15-29 ఏళ్ల మధ్య వయస్కులను యువతగా తీర్మానించింది. స్థూల దేశీయోత్పత్తిలో వీరి వాటా 34శాతం కావడం గమనార్హం. మరో ఇరవయ్యేళ్లపాటు యువ జనాభాపరంగా భారత్‌ను మరే దేశమూ అందుకోలేదన్న అంచనాలు- సంతోషంతోపాటు, కొన్ని భయాలకూ అంటుకడుతున్నాయి. చేవగల యువతకు వారి సామర్థ్యాల మేరకు ఉపాధి కల్పిస్తేనే... దేశానికి వారు వరం! పని దొరకని, పని రాని యువత... దేశానికి ఒకరకంగా విపత్తు! యువతను దేశాభివృద్ధికి చోదకశక్తిగా మార్చడమే నినాదంగా ఈ ఏడాది జాతీయ యువజన దినోత్సవం నిర్వహిస్తున్న నేపథ్యంలో- ఉపాధి, నిరుద్యోగితల పరంగా తలెత్తుతున్న ప్రశ్నలకు జవాబులు వెదకడం అత్యవసరం.

‘భారతీయులే దేశ చరిత్రను రచించాలి’ అన్నారు వివేకానందులు. భారతీయ యువత సామర్థ్యాలు, తెలివితేటలు, సృజనశీలత... ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల అభివృద్ధికి పునాదిరాళ్లవుతున్నాయి. ప్రపంచానికి సమర్థ మానవ వనరులను అందించే కార్ఖానాగా తయారైన భారత్‌- నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో తీవ్ర స్థాయిలో వనరుల కొరతను ఎదుర్కొంటోంది.

నేల విడిచి సాము

చీకటిని వెలుతురుగా మార్చడం సాధ్యం కాదు. దీపాన్ని చీకటికి చేరువగా తీసుకువెళ్ళడం ద్వారా వీలైనంత మేర అంధకారాన్ని తొలగించవచ్చు. దేశ జనాభాలో మూడోవంతుకు మించిన యువ జనాభాను- కేవలం విద్యావంతులుగా తీర్చిదిద్దినంత మాత్రాన పరచుకున్న చీకటి మలిగిపోదు. వృత్తిగత నైపుణ్యాలనే వెలుగుల బాటలో నడిపించి, భవిష్యత్‌ సవాళ్లకు దీటైన సాంకేతిక నిపుణులుగా వారిని మలచినప్పుడే ఉపాధిరహిత అంధకారం తొలగుతుంది. డిగ్రీ పూర్తి చేసినవారిలో 35.2శాతం, పీజీ చదివిన వారిలో 36.2శాతం, సంప్రదాయ వృత్తి విద్యా కోర్సులు అభ్యసించినవారిలో 33శాతం ఇప్పటికీ నిరుద్యోగులుగా ఉన్నారు. మహిళా నిరుద్యోగిత ఆందోళనకరంగా పెరుగుతోంది. తొమ్మిదో దశకంలో దేశ శ్రామిక శక్తిలో సుమారు 30శాతంగా ఉన్న మహిళల వాటా- 2019నాటికి 20.7శాతానికి పడిపోయింది. దేశ జనాభాలో 48శాతం వాటా మహిళలదే అయినా- కార్మిక శక్తిలో వారి భాగస్వామ్యం 20శాతమే! విద్యార్హతలతోపాటు నిరుద్యోగిత సైతం మహిళల్లో ఏకకాలంలో పెరుగుతోంది. మహిళలకు అనువైన ఉద్యోగాల కల్పనలో వైఫల్యానికిది నిదర్శనం. మెరుగైన రవాణా సదుపాయాలు, ఉద్యోగానికి వెళితే పిల్లల బాధ్యత తీసుకునే ‘క్రెచ్‌’ల ఏర్పాటు వంటి ప్రాథమిక వసతుల లేమి మహిళలను ఉపాధికి దూరం చేస్తోంది. మహిళాశక్తికి సమానావకాశాలు కల్పించకుండా, వారి నైపుణ్యాలకు పదునుపెట్టకుండా, వారి తోడ్పాటు లేకుండా... దేశాభివృద్ధికి చురుకు పుట్టించాలనుకోవడం- నేల విడిచి సాము చెయ్యడం లాంటిదే! ఏటా దాదాపు కోటిమంది యువత దేశంలో ఉద్యోగాల వేటలో ప్రవేశిస్తోంది. ఉపాధి దొరకక అలమటిస్తోంది. మరోవంక దేశవ్యాప్తంగా పారిశ్రామిక, సేవా రంగాలు నిపుణులైన మానవ వనరులకోసం అడుగడుగునా జల్లెడపడుతున్నాయి. నైపుణ్య వనరులు అందుబాటులో లేక ఉసూరుమంటున్నాయి. ఈ అగాధాన్ని పూడ్చడమే ఇప్పుడు దేశం ముందున్న అతిపెద్ద సవాలు!

లెక్కకు మించిన ఉత్పత్తికి బదులు, లెక్కకు మించిన శ్రామికుల ద్వారా ఉత్పత్తినే గాంధీజీ కోరుకున్నారు. భారత్‌వంటి అనంతమైన శ్రామిక వనరులు ఉన్న దేశంలో కార్మిక శక్తిని నిర్మాణాత్మకంగా ఉపయోగించుకోవాలన్నారాయన. భారతీయ శ్రామిక విపణిలో 93శాతానికిపైగా అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తుండగా- కేవలం ఏడు శాతం మాత్రమే వ్యవస్థీకృత సంస్థల్లో సేవలందిస్తున్నారు. ఈ రెండు వ్యవస్థల అవసరాలు పూర్తిగా భిన్నమైనవి. ప్రత్యేక నైపుణ్యాల కొరత అవ్యవస్థీకృత రంగాన్ని కుంగదీస్తోంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో యువ జనాభా విస్తరణలోనూ అసమానతలున్నాయి. పశ్చిమ్‌ బంగ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో పనిచేయగల యువత సంఖ్య క్రమంగా తగ్గుతోంది. మరోవంక రాజస్థాన్‌, బిహార్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ వంటి వెనకబడిన రాష్ట్రాల్లో యువజనం అత్యధికం! నైపుణ్య శిక్షణ కేంద్రాలు, మౌలిక వసతులపరంగానూ దేశవ్యాప్తంగా వ్యత్యాసాలున్నాయి. దేశ పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలు అత్యధికంగా 67శాతం ఉండగా- ఈశాన్య, తూర్పు ప్రాంతాల్లో వీటి సంఖ్య మరీ తక్కువ. ఈ వ్యత్యాసంవల్ల శిక్షణ అవసరాలకోసం వెనకబడిన రాష్ట్రాల యువత- సుదూర ప్రాంతాలకు తరలి వెళ్ళాల్సి వస్తోంది. ఎంత త్వరగా ఈ లోపాన్ని సరిదిద్దితే అంత సత్వరం యువతను ఉపాధి అవసరాలకు సంసిద్ధపరచవచ్చు. కార్మిక ఉత్పాదకత ప్రాతిపదికన చూసినా ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్‌ అట్టడుగున ఉంది. దేశ వార్షిక జీడీపీ వృద్ధి రేటు 9-10శాతం మధ్య స్థిరంగా కొనసాగినప్పుడే- భారత్‌ను అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం సాధ్యమని తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇందుకోసం బ్యాంకింగ్‌, తయారీ, వ్యవసాయం, టెక్నాలజీ సహా అన్ని రంగాల్లోనూ శ్రామిక ఉత్పాదక శక్తి ఇబ్బడిముబ్బడిగా పెరగాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో అడుగడుగునా ఎదురుదెబ్బలే స్వాగతం పలుకుతున్నాయి! దేశవ్యాప్తంగా 2022నాటికి 40కోట్ల యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, భిన్న రంగాల్లో వారిని తిరుగులేని వనరులుగా మలచే లక్ష్యంతో 2015లో ప్రారంభమైన ‘నైపుణ్య భారత్‌’ కార్యక్రమం గురించి దేశంలో కనీసం 60శాతం జనాభాకు కనీస అవగాహన లేదని కొన్ని సర్వేల్లో వెల్లడైంది. యువతను ఉద్యోగాలు అర్థించే స్థాయినుంచి, కల్పించే దశకు తీసుకువెళ్ళే లక్ష్యంతో 2016లో ప్రారంభమైన ‘స్టార్టప్‌ ఇండియా’- అంతర్జాతీయంగా అత్యధిక సంఖ్యలో అంకుర సంస్థలున్న మూడో దేశంగా భారత్‌ను మార్చగలిగింది. కానీ, అంకురాలకు సంబంధించిన మౌలిక సౌకర్యాల కల్పన, నైపుణ్య వనరుల అందుబాటు ప్రాతిపదికన ప్రపంచ వ్యాప్తంగా వంద దేశాల జాబితాలో భారత్‌- 17వ స్థానం నుంచి తాజాగా 23వ స్థానానికి దిగజారింది. దాదాపు 94శాతానికిపైగా ‘అంకురాలు’ నిధుల కొరత కారణంగా ఆరంభమైన ఏడాదిలోపే మలిగిపోతున్నాయి. ప్రాథమిక వసతులు కొరవడటంతో- సొంత ఆవిష్కరణలతో ముందుకు రావాలనుకునే యువతలోని ప్రతిభ, సామర్థ్యాలు వట్టిపోతున్నాయి.

సవాళ్లకు దీటుగా...

సుమారు మూడు కోట్లమంది భారతీయులు ప్రపంచమంతటా విస్తరించారు. అరకొర వైద్య సదుపాయాలతో, దేశానికి మరో పది లక్షల మంది డాక్టర్లు అవసరమైన పరిస్థితుల్లో- గడచిన ఇరవయ్యేళ్లుగా భారత్‌నుంచి సుమారు లక్షమంది సుశిక్షితులైన వైద్యులు విదేశాలకు వలస వెళ్ళిపోయినట్లు అంచనా. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు విదేశాలకు వలసపోవడంవల్ల దేశం ఏటా 200కోట్ల డాలర్ల నష్టాన్ని చవిచూస్తోందని అధ్యయనాలున్నాయి. బహుముఖ రంగాలకు విస్తరించిన మేధా వలసలు దేశానికి ఏ స్థాయిలో ఆర్థిక నష్టం కలిగిస్తున్నాయో ఊహకందదు. ఆధునిక సవాళ్లకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ కేంద్రాలను పెంచి, మేలిమి పని వాతావరణాన్ని కల్పించడం ద్వారానే దేశ కార్మిక శక్తిలో యువత భాగస్వామ్యాన్ని విస్తరించడం సాధ్యమవుతుంది. యువజనం సంపూర్ణ సామర్థ్యాలతో వికసించినప్పుడే- దేశాభివృద్ధి కొత్తపుంతలు తొక్కుతుంది. సృజనశీల యువత పూనికతోనే మూసలు కరుగుతాయి... మార్పు మహాశక్తిగా ఆవిర్భవిస్తుంది. ఆ శక్తే నూతన మహోదయానికి ఆవాహన పలుకుతుంది!

- ఉల్చాల హరిప్రసాదరెడ్డి
 

Posted Date: 13-01-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం