• facebook
  • whatsapp
  • telegram

విద్యకు విదేశీ సొబగులు

బోధన, పరిశోధనల్లో నాణ్యతే ఏ విద్యాసంస్థకైనా కీలకం. ఈ రెండు అంశాల్లో భారత్‌లోని ఉన్నత విద్యాసంస్థలు ప్రపంచ యవనికపై సత్తా చాటలేకపోతున్నాయి. ఫలితంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు తరలివెళ్తున్నారు. దీన్ని నివారించేందుకు విదేశీ విద్యాసంస్థలను భారత్‌కు తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది.

దేశవ్యాప్తంగా 1451 విశ్వవిద్యాలయాలున్నాయి. వాటిలో 445 ప్రైవేటు విభాగంలో కొనసాగుతున్నాయి. పేరుకు ఇన్ని విద్యాసంస్థలున్నా క్యూఎస్‌, టైమ్స్‌ వంటి సంస్థల ప్రపంచ స్థాయి ర్యాంకింగులు- భారత్‌లోని ఉన్నత విద్యాసంస్థల పేలవ పనితీరును కళ్లకు కడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మన విద్యార్థులు చదువు కోసం ఏటా పెద్ద సంఖ్యలో విదేశాల వైపు చూస్తున్నారు. విదేశీ విద్యాసంస్థలను భారత్‌ గడ్డపైకి తెస్తే, అవి అందించే నాణ్యమైన విద్యను మన విద్యార్థులు ఇక్కడే అందిపుచ్చుకోవచ్చని కేంద్రం భావిస్తోంది. విదేశీ వర్సిటీల ఏర్పాటుకు అనుమతిస్తామని గత బడ్జెట్లోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. అందుకు అవసరమైన నిబంధనలతో యూజీసీ ప్రత్యేక ముసాయిదాకు రూపకల్పన చేస్తోంది.

డ్యుయల్‌ డిగ్రీ కోర్సులు

గతంలో యూపీఏ ప్రభుత్వ హయాములోనే విదేశీ వర్సిటీలను భారత్‌కు రప్పించే ప్రయత్నాలు జరిగాయి. అప్పట్లో నిబంధనల రూపకల్పన, ఆచార్యుల నియామకం, ఫీజులు, పాఠ్యప్రణాళికలపై ఏకాభిప్రాయం కుదరక అడుగు ముందుకు పడలేదు. ప్రస్తుతం క్యూఎస్‌, టైమ్స్‌ వంటి సంస్థల ర్యాంకింగ్‌ల ఆధారంగా విదేశీ వర్సిటీలకు భారత్‌లోకి అనుమతి ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. ఫ్రెంచ్‌, ఇటలీకి చెందిన విద్యాసంస్థలు భారత్‌లో క్యాంపస్‌ల ఏర్పాటుకు సంసిద్ధతను వ్యక్తం చేశాయని గత బడ్జెట్‌ సమావేశాల్లో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. విదేశీ విశ్వవిద్యాలయాలకు సంబంధించి నిపుణుల కమిటీని సైతం కేంద్రం నియమించింది. ఆ కమిటీ నివేదిక ఆధారంగా ఫీజుల స్వరూపంపై నిర్ణయం తీసుకోనుంది.

ఇప్పటికే గుజరాత్‌లోని గిఫ్ట్‌(గుజరాత్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ టెక్‌)సిటీలో విదేశీ వర్సిటీల ఏర్పాటుకు కేంద్రం వేగంగా కసరత్తు చేస్తోంది. వాటికి పలు వెసులుబాట్లు కల్పించేందుకు సిద్ధమైంది. గిఫ్ట్‌ సిటీలో ఏర్పాటయ్యే వర్సిటీలకు విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) నిబంధనలు వర్తించకుండా చూస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక సేవాకేంద్రాల ప్రాధికార సంస్థ (ఐఎఫ్‌ఎస్‌సీఏ) గిఫ్ట్‌ సిటీ నియంత్రణ సంస్థగా పనిచేస్తుంది. క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో 500లోపు జాబితాలో నిలిచిన వర్సిటీలు గిఫ్ట్‌సిటీలో క్యాంపస్‌లు ఏర్పాటు చేసే అవకాశముంది. వాటిలో సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌తోపాటు ఫిన్‌టెక్‌, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ వంటి కోర్సులు అందించే వీలుంది. పాఠ్యప్రణాళికలు, ఆచార్యుల నియామకాలు వంటి వాటిలో విదేశీ వర్సిటీలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. విదేశీ వర్సిటీల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొనేందుకు దేశీయ విశ్వవిద్యాలయాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. ఈ విషయంలో కేంద్రం తగిన సహకారం అందిస్తోంది. విదేశీ వర్సిటీల భాగస్వామ్యంతో దేశీయ విశ్వవిద్యాలయాలు కోర్సులను నిర్వహించనున్నాయి. దీనికి సంబంధించి యూజీసీ ఈ ఏడాది మే నెలలో నిబంధనలను సవరించింది. తద్వారా భారత్‌లోని ఉన్నత విద్యాసంస్థలు విదేశీ వర్సిటీలతో కలిసి డ్యుయల్‌ డిగ్రీ కోర్సులు నిర్వహించవచ్చు. విద్యార్థులు తమ కోర్సులో కొంత భాగాన్ని విదేశాల్లో భాగస్వామ్యం ఉన్న వర్సిటీల్లో చదవవచ్చు. రెండు విశ్వవిద్యాలయాలు కలిపి డ్యుయల్‌ డిగ్రీని జారీ చేసే వీలుంది. ఈ విషయంలో 48 భారతీయ విశ్వవిద్యాలయాలు సుముఖత వ్యక్తం చేస్తున్నాయని యూజీసీ ప్రకటించింది. 60 దేశాలకు చెందిన 250 విదేశీ విద్యాసంస్థలు డ్యుయల్‌ డిగ్రీ కోర్సులు నిర్వహించేందుకు అవకాశం ఇచ్చింది. దేశంలోనే తొలిసారిగా టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి రెండు విదేశీ డ్యుయల్‌ డిగ్రీ కోర్సులను ప్రారంభించింది. ఐఐటీ దిల్లీ సైతం ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలతో ప్రత్యేకంగా పీహెచ్‌డీ కోర్సులు నిర్వహించేందుకు సిద్ధమైంది.

పర్యవేక్షణ ముఖ్యం

భారతీయుల మెదళ్లలో నాటుకుపోయిన బానిసత్వాన్ని పారదోలడమే లక్ష్యంగా జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చినట్లు ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించారు. ఒకవైపు దేశీయ విద్యకు పెద్దపీట వేస్తున్నామని చెబుతూనే, విదేశీ వర్సిటీలకు కేంద్రం అనుమతిస్తోంది. దేశంలో ప్రైవేటు వర్సిటీల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ఇప్పుడు విదేశీ వర్సిటీల రాకతో ప్రయోజనాలతోపాటు కొన్ని నష్టాలు సైతం ఉన్నాయి. ఇప్పటికే ప్రైవేటు విద్యాసంస్థలు, వర్సిటీలు చదువు పేరిట విద్యార్థులను లూటీ చేస్తున్నాయి. లాభాపేక్షే పరమావధిగా ఏర్పాటయ్యే విదేశీ వర్సిటీలు తక్కువ ఫీజులతోనే విద్యను అందిస్తాయనుకుంటే పొరపాటే! మరోవైపు దేశీయ విశ్వవిద్యాలయాలు ఇప్పటికే ఎన్నో సమస్యలతో కునారిల్లుతున్నాయి. వాటిని బలోపేతం చేయకుండా విదేశీ వర్సిటీలను అనుమతిస్తే మన విశ్వవిద్యాలయాలు మరింతగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ముందుగా వాటిని మేటిగా తీర్చిదిద్దడంపై కేంద్రం దృష్టి సారించాలి. విదేశీ వర్సిటీల్లో ఫీజులు, బోధన విధానాలు వంటి వాటిని పర్యవేక్షించేందుకు సరైన వ్యవస్థను కొలువుతీర్చడం తప్పనిసరి.

- యార్లగడ్డ అమరేంద్ర
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కేసుల కొండపరిష్కారాలకు గుదిబండ

‣ అడకత్తెరలో అమెరికా - సౌదీ సంబంధాలు

‣ ప్రపంచానికి సవాలు రువ్వుతున్న ద్రవ్యోల్బణం

‣ ఐరోపాను బెంబేలెత్తిస్తున్న జీవనవ్యయం

‣ ‘పునరుత్పాదక’ లక్ష్యాలు... సుదూరం!

‣ మాటల్లోనే... సమానత్వం

‣ సమితి ప్రక్షాళన... విశ్వశాంతికి ఆవాహన!

Posted Date: 31-10-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం