• facebook
  • whatsapp
  • telegram

భద్రతతోనే మహిళా సాధికారత

ఉన్నత విద్యాలయాల్లో నాణ్యమైన విద్యాభ్యాసం,పరిశోధనలకు సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణం అవసరం. ఇందుకోసం మహిళా సాధికారతే ప్రధాన లక్ష్యంగా యూజీసీ అడుగులు వేస్తోంది.

నాణ్యమైన విద్యను అందించేందుకు, పరిశోధనలు చేపట్టేందుకు ఉన్నత విద్యాసంస్థల్లో సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొనడం అత్యవసరం. ఇందుకోసం విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) పలు కార్యక్రమాలు, చర్యల ద్వారా ఈ దిశగా కృషి చేస్తోంది. విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫెలోషిప్‌లు అందించడంతోపాటు, సామర్థ్యం పెంచుకోవడం తదితర అంశాల్లో విద్యాసంస్థలకు అండగా నిలుస్తోంది. ఇలాంటి కార్యక్రమాలన్నింటికీ అదనంగా యూజీసీ ‘సాక్షమ్‌’ పోర్టల్‌ను అభివృద్ధి చేసింది. ఇది ఉన్నత విద్యాసంస్థల ప్రాంగణాల్లో విద్యార్థినులకు సంబంధించి భద్రత తదితర అంశాలపై అవగాహన పెంపొందించడం ద్వారా సాధికారతకు తోడ్పడుతుంది. దేశంలో ఉన్నత విద్యాసంస్థల్లోని విద్యార్థినులు, మహిళా బోధకులు, బోధనేతర సిబ్బందికి తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో దీన్ని రూపొందించారు. ఉన్నత విద్యాసంస్థల్లో మహిళల సామర్థ్యాల్ని ఇనుమడింపజేసేందుకు- వారికోసమే అమలు చేసే ఉపకార వేతనాలు, ఫెలోషిప్‌లు, అధ్యయన కేంద్రాలు, న్యాయపరమైన సౌకర్యాలు వంటి కార్యక్రమాలపై అవగాహన పెంచుతూ, వారి సాధికారతకు కృషి చేయాలనేది ఈ పోర్టల్‌ లక్ష్యం. హింస, వేధింపులు వంటి వాటిపై ఫిర్యాదులు చేసే సౌకర్యాన్ని కల్పించడం ద్వారా ఉన్నత విద్యాసంస్థల్లో సురక్షిత వాతావరణాన్ని, భద్రతను పెంపొందించే వేదికగానూ నిలుస్తుంది. ఇందుకోసం ప్రత్యేకించిన హెల్ప్‌లైన్‌ నంబర్లు, ఈ-మెయిల్‌ చిరునామాలు అందుబాటులో ఉంచుతారు. విద్యార్థినులకు సంబంధించిన సమాచారం, అంశాలన్నింటి మధ్యా ఇది అనుసంధానతను నెలకొల్పుతుంది.

‘సాక్షమ్‌’ నివేదిక ప్రకారం చాలా విద్యాసంస్థల్లో లైంగిక వేధింపుల నిరోధక వ్యవస్థలను ఏర్పాటు చేయలేదు. అన్నింటికీ ప్రభుత్వం మీదే ఆధారపడకుండా ప్రతి విద్యాలయం తన పరిధిలో ఫిర్యాదుల విభాగాలతోపాటు, విద్యార్థినుల సంరక్షణ కోసం ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. ఉన్నత విద్యాసంస్థల్లో గ్రామీణ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థినులపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. విద్యాలయంలో ప్రతి ఒక్కరూ గుర్తింపు కార్డు కలిగి ఉండాలి. ముఖద్వారం, ముఖ్యకూడళ్లు, ఫలహారశాలలతోపాటు అన్ని భవనాలకు సీసీటీవీ కెమెరాలు అమర్చాలి. కీలక ప్రాంతాలన్నింటా భద్రతా సిబ్బందిని నియమించాలి. మహిళల వసతి గృహాల దగ్గర విధిగా మహిళా భద్రతా సిబ్బందినే నియమించాలి. ముఖద్వారం వద్ద భద్రతా సిబ్బందిలో కనీసం ఒక్క మహిళయినా ఉండాలి. విద్యాలయాల్లో కులం, మతం, వర్ణం, జాతీయత, లింగం, సామాజిక స్థితిగతుల వంటి తేడాలు నిషేధం. 24 గంటలూ కుళాయినీరు, చెత్తకుండీలు, సబ్బులు, రుతురుమాళ్లు అందుబాటులో ఉంచాలి. వసతి గృహాల్లో భోజనశాల, ఫలహారశాలలు, అంతర్జాల సౌకర్యం, పఠనకేంద్రాలు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయడం అవసరం. అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఫోన్‌ నంబర్లు, ఈ-మెయిల్‌ చిరునామాలు వంటివి సంబంధిత విద్యాసంస్థ వెబ్‌సైట్లో ఉంటే ప్రయోజనకరం. విశ్వవిద్యాలయాలు నిబంధనలు రూపొందించి విద్యార్థినులకు తెలియజేయాలి. సామాజిక సేవల అధికారుల పర్యవేక్షణలో భద్రతా చర్యలు పటిష్ఠంగా అమలు చేయాలి.

ఐక్యరాజ్య సమితి ‘అనిశ్చిత సమయం, అస్థిరమైన జీవితాలు’ పేరుతో ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఉన్నత విద్యలో ప్రవేశాలు తగ్గినట్లు వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నాటికి దేశంలో లక్షల సంఖ్యలో పోక్సో కేసులు అపరిష్కృతంగా ఉండటం బాలల హక్కుల చట్టం అమలుతీరుకు అద్దం పడుతోంది. ఈ క్రమంలో ప్రాథమిక స్థాయి నుంచే పౌరులకు చట్టాలపై అవగాహన, నైతిక విలువలు నూరిపోయాల్సిన అవసరం ఉంది. ఆర్థిక, ఆరోగ్యపరమైన అంశాల ప్రాతిపదికన విడుదలచేసే మానవాభివృద్ధి సూచీలో మనదేశానిది చెప్పుకోదగిన స్థానమేమీ కాదు. ఇండియా అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ముందడుగు వేసినా, మానవాభివృద్ధిలో వెనకబాటుతనం మచ్చలాంటిదే. మహిళా విద్యలో కొంతమేర పురోగతి సాధించినా లింగ సమానత్వం, వేధింపులు, కుల మత దుర్విచక్షణ లాంటి జాడ్యాలు మనల్ని వీడిపోవడం లేదు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల మానసిక స్వస్థత కోసం ప్రవేశపెట్టిన ప్రయోగాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. దీన్ని సమర్థంగా వినియోగించుకునేలా కుంగుబాటుకు గురైన విద్యార్థినులను ప్రోత్సహించాలి. సాక్షమ్‌ పోర్టల్‌లోని ముఖ్య అంశాలను విద్యాసంస్థల్లోని విద్యార్థినులకు అందుబాటులో ఉంచాలి. విద్యార్థినుల భద్రత విషయంలో కేవలం ప్రభుత్వాలపైనే భారం మోపకుండా తల్లిదండ్రులు, పౌరసమాజం కూడా బాధ్యత వహించాలి.

- డాక్టర్‌ గుజ్జు చెన్నారెడ్డి

(నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆచార్యులు)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ వణికిస్తున్న ప్రకృతి విపత్తులు

‣ జీ20 నాయకత్వం బృహత్తర అవకాశం

‣ ద్వైపాక్షిక బంధానికి కొత్త చివుళ్లు

‣ నీరుగారుతున్న సహ చట్ట స్ఫూర్తి

Posted Date: 26-11-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం