• facebook
  • whatsapp
  • telegram

కదలని పట్టణ ప్రగతిరథం

జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం. దేశీయంగా పట్టణ స్థానిక సంస్థల బలోపేతానికి 74వ రాజ్యాంగ సవరణ చేశారు. అది అమలులోకి వచ్చి మూడు దశాబ్దాలు గడుస్తున్నా పట్టణ, నగర పాలక సంస్థలు నేటికీ ఎన్నో అంశాల్లో సరైన అభివృద్ధిని సాధించలేదు.

ఇటీవల విశాఖపట్నంలో జరిగిన జీ20 సన్నాహక సదస్సులో పలు దేశాల ప్రతినిధులు పట్టణ ప్రాంతాల అభివృద్ధిపై చర్చించారు. ప్రధానంగా మౌలిక వసతుల కల్పనపై వారు దృష్టి సారించారు. నగరాలను అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దడానికి ప్రైవేటు రంగం నుంచి పెట్టుబడులను ఆకర్షించడం, అందరికీ కనీస వసతులు అందేలా చేయడం, తద్వారా పట్టణాల్లోని ప్రజలు సంతృప్తికరమైన జీవనాన్ని గడిపేలా చూడటం తదితర అంశాలపై ఆ సదస్సులో చర్చలు జరిగాయి. భారత్‌లో పట్టణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి ముప్ఫయ్యేళ్ల క్రితమే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. 1992లో 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ స్థానిక సంస్థలను బలోపేతం చేసే వైపు అడుగులు పడ్డాయి. ఇది 1993 జూన్‌ ఒకటి నుంచి అమలులోకి వచ్చింది. ఈ సవరణ ద్వారా రాజ్యాంగానికి 12వ షెడ్యూల్‌, ‘9ఏ’ అనే విభాగం చేర్చారు. దేశంలోని నగర పంచాయతీలు, పురపాలక, నగరపాలక సంస్థలు, మెట్రోపాలిటన్‌ నగరాల్లో అవసరమైన సంస్కరణలు తీసుకొచ్చి, ప్రజాస్వామ్య పునాదులపై పట్టణ ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం ఈ సవరణ ముఖ్య ఉద్దేశం.

గతి తప్పిన ప్రణాళికలు

స్వాతంత్య్రానంతరం పట్టణ స్థానిక సంస్థల అభివృద్ధికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో 74వ రాజ్యాంగ సవరణ ప్రధానమైంది. దీన్ని నగరపాలక చట్టం అనీ పిలుస్తారు. దీని ప్రకారం పట్టణ స్థానిక సంస్థలకు తప్పనిసరిగా ప్రతి అయిదేళ్లకోసారి ఎన్నికలు జరపాలి. ప్రజాప్రతినిధుల స్థానాలు ఖాళీ అయినప్పుడు ఆరు నెలల్లో వాటికి ఎలెక్షన్లు నిర్వహించాలి. షెడ్యూల్డు కులాలు, తెగల నుంచి రిజర్వేషన్‌ ప్రకారం ప్రతినిధులు ఎన్నికయ్యేలా చూడటం, మహిళలకు సముచిత స్థానం (1/3వ వంతుకు తగ్గకుండా) కల్పించడం, అధికార వికేంద్రీకరణ దిశగా ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడం 74వ సవరణ ప్రధాన ఉద్దేశం. దీని ప్రకారం పట్టణ స్థానిక సంస్థలను నగర పంచాయతీలు, పురపాలక, నగరపాలక సంస్థలుగా విభజించారు. వీటికి ప్రజాప్రతినిధులు ప్రజల ద్వారా నేరుగా ఎన్నికవుతారు. వీరితో పాటు ఆయా స్థానిక సంస్థల స్థాయిని బట్టి పట్టణ పాలనలో అనుభవం ఉన్న కొందరిని పాలకమండళ్లు కో-ఆప్టెడ్‌ సభ్యులుగా నామినేట్‌ చేసుకుంటాయి. వీటిలోనూ మహిళలు, మైనారిటీలకు ప్రత్యేక స్థానాలు కేటాయిస్తారు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు లక్షలకు పైగా జనాభా కలిగిన కార్పొరేషన్లలో వార్డు కమిటీల ఏర్పాటుకు అవకాశం కల్పించారు. ప్రతి 10 డివిజన్లకు ఒక సభ్యుడు/సభ్యురాలు చొప్పున ఎంపిక చేసి కార్పొరేషన్‌ స్థాయిలో ఒక స్టాండింగ్‌ కమిటీ (స్థాయీ సంఘం) ఏర్పాటు చేస్తారు.

డెబ్భై నాలుగో రాజ్యాంగ సవరణ లక్ష్యాలను మన పట్టణ స్థానిక సంస్థలు ఎంతమేరకు సాధించాయన్నది పరిశీలిస్తే ఆవేదనే మిగులుతుంది. ఈ సవరణ ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పద్దెనిమిది అధికారాలు, విధులను పట్టణ, నగర పాలక సంస్థలకు బదిలీ చేయాలి. పట్టణాలను ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దడం, ప్రజారోగ్యం, ఘనవ్యర్థాల నిర్వహణ, అగ్నిమాపక సేవలు, వనాల పెంపకం, పర్యావరణ పరిరక్షణ, పట్టణ పేదరిక నిర్మూలన తదితరాలు వాటిలో ఉన్నాయి. గత మూడు దశాబ్దాల్లో చాలా అంశాల్లో మెరుగైన ఫలితాలు సాధ్యం కాలేదు. పట్టణ ప్రణాళికలు అన్నవి కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. చెరువులు, నాలాలను ఆక్రమిస్తూ విచ్చలవిడిగా పుట్టుకొస్తున్న భవంతులు నగరజీవనాన్ని నానాటికీ సంక్లిష్టమయం చేస్తున్నాయి. భవనాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకాలు అక్రమ నిర్మాణదారులకు వరాలుగా మారుతున్నాయి. రహదారుల నిర్మాణంలో కొంత ప్రగతి కనిపించినా ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, అగ్నిమాపక సేవలు, వనాల పెంపకం, మురికివాడల అభివృద్ధి వంటి అంశాల్లో చాలా చోట్ల ప్రగతి కొరవడింది. పట్టణ స్థానిక సంస్థల సొంత నిధుల నుంచి నలభై శాతాన్ని మురికివాడల అభివృద్ధికి వినియోగించాలన్న ఉత్తర్వులూ అమలుకు నోచుకోవడంలేదు. నియమాల ప్రకారం చాలా పురపాలక, నగరపాలక సంఘాలకు సకాలంలో ఎన్నికలు జరపకుండా ప్రత్యేక అధికారుల పరిపాలనతో ప్రజాస్వామ్యానికి పాతరేస్తున్నారు. దానివల్ల సరైన పర్యవేక్షణ, అజమాయిషీ, జవాబుదారీతనం కొరవడి ఆయా విభాగాల్లో పాలన పడకేస్తోంది.

సమర్థ అమలు కీలకం

ప్రణాళికాబద్ధమైన నగరాల నిర్మాణం, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, పట్టణాల్లో వనాలు పెంచడం తదితర విషయాల్లో ప్రభుత్వాల పటిష్ఠ చర్యలకు ప్రజల సహకారమూ జతపడాలి. అప్పుడే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి. ముఖ్యంగా పట్టణ స్థానిక సంస్థలు వనరులను పెంచుకొని ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలి. ఆయా పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించే నిధులు పక్కదారి పట్టకుండా చూడటం తప్పనిసరి. వాటికి తోడు రాష్ట్ర ప్రభుత్వాలూ తమ సొంత నిధులను జోడించి పట్టణాలు, నగరాల అభివృద్ధిని జోరెత్తించాలి. దానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను కచ్చితంగా అమలు చేయాలి.

చిత్తశుద్ధి కరవు

దేశీయంగా పార్కింగ్‌ ప్రదేశాలు, ప్రజా మరుగుదొడ్లు వంటివి కొన్ని మెట్రోపాలిటన్‌ నగరాల్లో తప్ప మామూలు పట్టణ ప్రాంతాల్లో నేటికీ సరిగ్గా అందుబాటులోకి రాలేదు. శ్మశానవాటికల అభివృద్ధి, విద్యుత్‌ దహన వాటికల ఏర్పాటు, నిర్వహణలో తీవ్ర అలక్ష్యం నెలకొంటోంది. పట్టణ పేదరిక నిర్మూలన సైతం కలగానే మిగిలింది. పట్టణ స్థానిక సంస్థల సమగ్రాభివృద్ధి కోసం కార్యాచరణ పథకాలు రూపొందించడంలో జిల్లా ప్రణాళికా సంఘాలు సఫలం కావడం లేదు. ఏతావతా 74వ రాజ్యాంగ సవరణ అమలులోకి వచ్చి ముప్ఫై ఏళ్లు గడుస్తున్నా మహిళలకు మూడో వంతు రిజర్వేషన్‌, రహదారులు, వంతెనల నిర్మాణం, జనన మరణాల నమోదు వంటి నాలుగైదు అంశాల్లోనే మెరుగైన ఫలితాలు దక్కాయి. 74వ సవరణ నిర్దేశించిన ఎన్నో లక్ష్యాల సాధనలో మన ప్రభుత్వాలు విఫలమయ్యాయి. పట్టణ స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పాలకులు చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవడంలేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 25 నగర పంచాయతీలు, 81 పురపాలక, 17 నగరపాలక సంస్థల్లో ప్రగతి ఏమాత్రం సంతృప్తికరంగా లేదు. రాష్ట్రంలో ఎన్నో మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు ప్రతినెలా తమ సిబ్బంది జీతాలు ఇవ్వడానికి, విద్యుత్‌ చార్జీలు చెల్లించడానికి నానా తంటాలు పడుతున్నాయి.

- డాక్టర్‌ వి.రాజేంద్రప్రసాద్‌

(విశ్రాంత ప్రాంతీయ సంచాలకులు, ఏపీ పురపాలక శాఖ)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కృత్రిమ మేధ ఎంత లాభం.. ఎంత నష్టం?

‣ వాణిజ్య ఒప్పందంలో చిక్కుముళ్లు

‣ పుడమి తల్లికి గర్భశోకం

‣ కోకో దీవుల్లో డ్రాగన్‌ పాగా

‣ సత్వరన్యాయం కోసం కృత్రిమమేధ

‣ భారత్‌ - ఇజ్రాయెల్‌ చెట్టపట్టాల్‌

‣ సమగ్ర సన్నద్ధతకు అవకాశం

Posted Date: 24-04-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం