• facebook
  • whatsapp
  • telegram

రక్షణ ప్రాజెక్టుల నత్తనడక!

రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) యుద్ధప్రాతిపదికన పూర్తిచేసే సంకల్పంతో 55 ‘మిషన్‌ మోడ్‌ ప్రాజెక్టులు’ చేపట్టింది. వాటిని పూర్తి చేయడంలో ఆలస్యం చోటుచేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో  రాజ్యసభకు వెల్లడించింది. రక్షణ ప్రాజెక్టుల్లో ఈ తరహా జాప్యాన్ని నివారించాల్సిన అవసరముంది.

రక్షణ దళాల అవసరాలను తీర్చే ప్రత్యేక  కార్యక్రమాలను ‘మిషన్‌ మోడ్‌ ప్రాజెక్టులు’ అంటారు. వీటిని ముందే నిర్దేశించుకున్న కాలపరిమితిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. డీఆర్డీఓ అత్యంత ప్రాధాన్య ప్రాతిపదికపై 178 ప్రాజెక్టులను చేపట్టగా వాటిలో 119 గడువు తీరిపోయినా ఇంకా పూర్తికాలేదని 2022 డిసెంబరులో పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) వెల్లడించింది. 67 శాతం ప్రాజెక్టులు కాలపరిమితి గురించి అసలు పట్టించుకోలేదని వివరించింది. మిషన్‌ మోడ్‌ ప్రాజెక్టుల్లో సైతం ఆలస్యం చోటుచేసుకోవడం సమంజసం కాదు. వీటికి  కావలసిన సాంకేతికత సిద్ధంగా ఉన్నా వాటికి ఆమోదం తెలిపి, శీఘ్రంగా ప్రారంభించే విషయంలో నిర్లక్ష్యం వ్యక్తమవుతోందనే విమర్శలున్నాయి.

పెరిగే వ్యయం

సాధారణంగా రక్షణ ప్రాజెక్టులకు అనేక రకాల అడ్డంకులు ఎదురవుతాయి. ప్రాజెక్టు వ్యయం, సాంకేతికతకు సంబంధించిన సమస్యలు, కాంట్రాక్టు నిబంధనలు అడ్డుపడతాయి. స్వదేశంలో ముడి సరకులు, మౌలిక వసతుల కొరత సాంకేతికంగా అడ్డుపడితే, విదేశీ విక్రేతలతో కుదుర్చుకున్న కాంట్రాక్టులు సకాలంలో సక్రమంగా నెరవేరక ప్రాజెక్టులు ఆలస్యమవుతాయి. ధరవరలపైనా పేచీలు తలెత్తుతాయి. దానివల్ల సరఫరాదారులతో ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. ప్రాజెక్టు వ్యయం విపరీతంగా పెరిగిపోతుంది. ఉదాహరణకు మధ్య శ్రేణి ఎత్తులో దీర్ఘకాలం ఎగరగల మానవ రహిత గగనతల వాహనం (యూఏవీ) నిర్మాణం, ఏరోనాటికల్‌ టెస్ట్‌ రేంజ్‌ ఏర్పాటుకు రక్షణ శాఖ 2011 ఫిబ్రవరిలోనే పచ్చజెండా ఊపింది. దాన్ని 66 నెలల్లో, అంటే 2016 ఆగస్టుకల్లా పూర్తిచేయాల్సి ఉంది. కానీ, యూఏవీ ప్రాజెక్టు ఎయిర్‌ ఫ్రేమ్‌, ఇంజిన్‌, అది మోసుకెళ్ళే బాంబుల బరువు, ఇతర భాగాలకు సంబంధించి సమస్యలు తలెత్తాయి. దాంతో ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన గడువును మొదట 2020 వరకు, తరవాత 2023 ఆగస్టుదాకా పొడిగించాల్సి వచ్చింది. ప్రాజెక్టు వ్యయం కూడా పెరిగిపోయింది.

రక్షణ దళాల ఆధునికీకరణ పలు కారణాలతో ఆలస్యమవుతుంటుంది. ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతుంటుంది. ఆయుధ సేకరణ ప్రక్రియ సుదీర్ఘంగా, జటిలంగా ఉంటుంది. కాలంచెల్లిన నియమ నిబంధనలను, విధానాలనే ఆచరిస్తుండటం సమస్యగా మారుతుంది. ఆధునికీకరణకు సరైన బడ్జెట్‌ కేటాయించకపోవడమూ ఇబ్బందికరమే. ఆయుధాల డిజైన్‌, సంఖ్య, నాణ్యతా ప్రమాణాలను చీటికిమాటికి మారుస్తుంటారు. ఆయుధ పరీక్షల్లో లొసుగులు, వనరుల కొరత, రక్షణ పరిశ్రమల్లో మౌలిక వసతుల లేమి వంటివీ అడ్డంకులే. అవినీతి ఆరోపణలు, రాజకీయ వివాదాలు వంటివన్నీ కలిసి రక్షణ దళాల ఆధునికీకరణ ప్రక్రియను వెనక్కిలాగుతుంటాయి.

డీఆర్డీఓ ప్రణాళికా రచనా ప్రక్రియలో లోపాలను కాగ్‌ నివేదిక స్పష్టంచేసింది. మిషన్‌ మోడ్‌ ప్రత్యేక ప్రాజెక్టుల అమలుపైనా పర్యవేక్షణ లోపించిందని పేర్కొంది. మొత్తం మీద ప్రాజెక్టు నిర్వహణ లోపాలు వ్యయం పెరిగిపోవడానికి దారితీస్తున్నాయి. చేపట్టిన ప్రాజెక్టుల వల్ల ఒనగూడే ప్రయోజనాలను అతిగా అంచనా వేసుకోవడమూ కనిపిస్తోంది. ప్రాజెక్టుల ముగింపు నివేదికలను సమర్పించడంలోనూ జాప్యం జరుగుతోంది. డీఆర్డీఓకు త్రివిధ సాయుధ దళాధికారులకు మధ్య సమన్వయం కొరవడుతోంది. ఫలితంగా దళాలకు కావలసిన ఆయుధాలు, వాటి నాణ్యతపై అవగాహన లోపం ఏర్పడుతోందని కాగ్‌ ఏకరువు పెట్టింది. రక్షణ నిపుణుల అభిప్రాయమూ అదే. దీనంతటికీ జవాబుదారీతనం లోపించడమే మూల కారణం. ఎలాంటి ఆయుధాలను సొంతంగా తయారుచేయాలి, ఎటువంటి ఆయుధాలను స్వదేశీ, విదేశీ సరఫరాదారుల నుంచి కొనుగోలు చేయాలనే అంశాలపై స్పష్టత లోపిస్తోంది. అనేక సంస్థల ప్రమేయం ఉండటం వల్ల ఆయుధ సేకరణ ప్రక్రియకు అనవసర అడ్డంకులు భవిష్యత్తులోనూ కొనసాగవచ్చు. దీన్ని నివారించడానికి వాస్తవిక దృక్పథంతో యావత్‌ ఆయుధ సేకరణ కార్యక్రమాన్ని పునర్‌ వ్యవస్థీకరించాలి. సంబంధిత దస్త్రాలకు అనుమతిని వేగవంతం చేసేలా రక్షణ శాఖ, డీఆర్డీఓ, సైన్యాధికారులను జవాబుదారీగా చేయాలి. అరకొర ఆధునికీకరణ బడ్జెట్లు, ఆయుధ సేకరణలో లొసుగుల వల్ల అత్యాధునిక యుద్ధ విమానాలు, డ్రోన్లు, హెలికాప్టర్లు, జలాంతర్గాములు, శతఘ్నులు వంటివి సకాలంలో దళాలకు అందడం లేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి కేంద్రం 2020లో రక్షణ సామగ్రి సేకరణ (డీఏపీ) ప్రక్రియను కట్టుదిట్టం చేసింది. రక్షణ రంగంలో స్వావలంబనే దీని ప్రధాన లక్ష్యం. ఆయుధాల కొనుగోలు, లీజు, తయారీకి వీలుగా వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి డీఏపీ పలు విధివిధానాలను నిర్దేశిస్తోంది. ఆయుధ సేకరణను వేగవంతం చేయడానికి భారత ప్రభుత్వం రక్షణ ప్రాజెక్టులను తరచూ సమీక్షిస్తోంది. ఉత్పత్తిదారులు, రక్షణ దళాల మధ్య సమన్వయాన్ని పెంచుతోంది. ఆర్థిక అధికారాలను బదిలీ చేస్తోంది.

సదా సిద్ధం..

భారత్‌ ఇంతవరకు పాకిస్థాన్‌, చైనాలతో యుద్ధాలు చేయాల్సి వచ్చింది. ఆ రెండు దేశాలతో ఇప్పటికీ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో ఇద్దరు ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి భారీ ఆయుధ సంపత్తితో భారత్‌ సదా సిద్ధంగా ఉండాలి. ఆయుధ సేకరణలో అడ్డంకులను క్రమంగా తొలగించడానికి గట్టి ప్రయత్నమే జరుగుతున్నా- సకాలంలో ప్రక్రియ పూర్తి కావడం లేదు. సరైన బడ్జెట్‌, రాజకీయ దృఢ సంకల్పం, సాంకేతికత బదిలీ, ముడి పదార్థాల సరఫరా, మెరుగైన పని సంస్కృతి... భారత రక్షణ దళాల అవసరాలను వేగంగా తీర్చడానికి తోడ్పడతాయి.

తేలని ధరలు

ఆయుధాల ధరల విషయంలో సంప్రదింపులు చాలా ఆలస్యమవుతున్నాయి. రష్యా నుంచి భారత సైనికులకు ఏకే-203 రైఫిళ్లను, వైమానికసేన కోసం కమోవ్‌-226టి హెలికాప్టర్లను, ఆరు కల్వరి తరగతి భారతీయ యుద్ధ నౌకలకు టార్పెడోలను సేకరించాలని నిర్ణయించారు. చైనా సరిహద్దులో ఘర్షణలు జరుగుతున్నందువల్ల వీటిని వేగంగా సమకూర్చుకోవాల్సి వచ్చింది. రష్యా సహకారంతో స్వదేశంలోనే సంయుక్తంగా 6.71 లక్షల ఏకే-203 రైఫిళ్లను తయారుచేయాలని భారత్‌ సంకల్పించింది. కానీ, ధరల విషయంలో అంగీకారం కుదరలేదు. దాంతో అమెరికా నుంచి 1.5లక్షల సిగ్‌-716 రైఫిళ్ల కొనుగోలుకు ఆర్డరు పెట్టాల్సి వచ్చింది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కొత్త ఖండం అవతరించనుందా?

‣ వృద్ధిపథంలో భారతావని

‣ బొగ్గు దిగుమతితో విద్యుత్‌ ఖరీదు

‣ తైవాన్‌పై చైనా దూకుడు

Posted Date: 01-05-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం