• facebook
  • whatsapp
  • telegram

తమిళనాట... ఓట్ల వేట

గెలుపు కోసం కూటముల ఆపసోపాలు

తమిళనాడు శాసనసభ ఎన్నికలకు రాజకీయ పొత్తులు ఖరారయ్యాయి. పాలక అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నాడీఎంకే) ఓటర్లపై వరాల కుంభవృష్టి కురిపిస్తున్నా- ఈసారి చతుర్ముఖ పోటీలో ప్రతిపక్షం డీఎంకేకి విజయావకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అన్నాడీఎంకే అధినేత ఎం.జి.రామచంద్రన్‌ మరణించిన 13 నెలలకు- అంటే 1989లో జరిగిన ఎన్నికల్లో ముత్తువేల్‌ కరుణానిధి నాయకత్వంలో డీఎంకే సాధించిన ఘన విజయం రానున్న ఎన్నికల్లోనూ పునరావృతమవుతుందని విశ్లేషకుల అంచనా. కరుణానిధి కాలధర్మం చెందిన నేపథ్యంలో ఆయన కుమారుడు స్టాలిన్‌ సారథ్యంలో డీఎంకే ఎన్నికల బరిలోకి దిగింది. 1989లో అన్నాడీఎంకే రెండుగా చీలింది. కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేసింది. నాటి చతుర్ముఖ పోటీలో డీఎంకే విజయం నల్లేరు మీద బండి నడకే అయింది. తాజా ఎన్నికల్లో సైతం చతుర్ముఖ పోటీ జరగనుంది కాబట్టి మళ్ళీ డీఎంకే విజయ పతాక ఎగరేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. పాలక అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే కూటములకు తోడు టీటీవీ దినకరన్‌ నేతృత్వంలోని అమ్మా మక్కళ్‌ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే), ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్‌ పార్టీల కూటమి, కమల్‌హాసన్‌ పార్టీ ఈసారి ఎన్నికల కదన రంగంలో తలపడుతున్నాయి. మరో సినీ కళాకారుడు సీమన్‌ స్థాపించిన నామ్‌ తమిళర్‌ కక్షి (మన తమిళుల పార్టీ) కూడా బరిలో ఉంది.

భారీ వ్యయాలకూ సిద్ధం

ద్రవిడ ఉద్యమం చలవతో తమిళనాట రాజకీయాలు భారీ బడ్జెట్‌ సినిమాలను తలపిస్తాయి. సినీ హీరోలను రాజకీయాల్లోనూ వీరులుగా ఆరాధిస్తూ, నెత్తిన పెట్టుకునే సంస్కృతి ఇక్కడ పాతుకుపోయింది. గత ఎన్నికల్లో సినీ నటుడు విజయకాంత్‌ పార్టీ డీఎండీకేతో పొత్తు పెట్టుకున్న అన్నాడీఎంకే, ఈసారి ఆ పార్టీతో జట్టు కట్టలేదు. దీంతో డీఎండీకేతోపాటు ఇతర చిన్నా చితకా పార్టీలు మిగిలిన మూడు కూటముల్లో ఏదో ఒకదాన్ని ఆశ్రయించక తప్పదు. 1989 తరవాత మొట్టమొదటిసారిగా ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడుతున్నవారు నలుగురైదుగురు కనిపిస్తున్నారు. 1989వ సంవత్సరం తమిళనాడు రాజకీయాలను మలుపు తిప్పడమే కాక, కేంద్రంలోనూ మార్పునకు నాంది పలికింది. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి చెప్పుకోదగిన నాయకుడు లేరు. అన్నాడీఎంకేను అదుపులో పెట్టుకుని తెర వెనక నుంచి చక్రం తిప్పాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ ఎన్నికల ద్వారా తమిళనాట అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతోంది. డీఎంకేకు కరుణానిధి వారసుడు ఎంకే స్టాలిన్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అన్నాడీఎంకే తరఫున ప్రస్తుత ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి మళ్ళీ సింహాసనమెక్కాలని వాంఛిస్తున్నారు. అవినీతిపై ఎలుగెత్తుతూ మార్పు తీసుకొస్తానంటూ కమల్‌ హాసన్‌ వీరిద్దరితో పోటీ పడుతున్నారు. భాజపా రాబోయే విధాన సభ ఎన్నికల్లో 20 సీట్లకు పోటీచేయడంతోపాటు కన్యాకుమారి లోక్‌సభ ఉప ఎన్నికలోనూ తలపడుతోంది. అన్నాడీఎంకే, భాజపాలతో కూడిన ఎన్డీయే కూటమి తరఫున ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా ఊతమిస్తున్నారు. స్టాలిన్‌ నాయకత్వంలో డీఎంకే, కాంగ్రెస్‌, వామపక్షాలు, ఎండీఎంకే, విడుతలై చిరుత్తైగళ్‌ కక్షి (వీసీకే), ఐయూఎంఎల్‌, మరో ముస్లిం పార్టీ ఎంఎంకే, కొన్ని ఇతర ఓబీసీ, దళిత పార్టీలు జట్టుకట్టి ఎన్డీయేని ఢీకొంటున్నాయి.

‘వరాలు’ గట్టెక్కించేనా?

తమిళనాట 2019 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రభంజనాన్ని అడ్డుకొని విజయాలు సాధించిన డీఎంకే తాజా శాసన సభ ఎన్నికల్లోనూ అదే ఎత్తు వేయాలనుకొంటోంది. సీట్ల పంపకంలో డీఎంకే పెద్దన్న పాత్ర పోషిస్తోందని మిత్రపక్షాలు రుసరుసలాడుతున్నాయి. ఎండీఎంకేతోపాటు ఇతర చిన్న పార్టీలూ డీఎంకే గుర్తుపైనే పోటీచేయవలసి ఉంటుంది. రాష్ట్రంలో అన్నాడీఎంకే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగిన మాట నిజం. దీన్ని అధిగమించడానికి  ముఖ్యమంత్రి పళనిస్వామి ఎన్నో హామీలు గుప్పించారు. ఈ వరాలే అన్నాడీఎంకేని గెలిపిస్తాయా అంటే అనుమానమే. వివిధ సర్వేల ప్రకారం డీఎంకే 218 అసెంబ్లీ స్థానాల్లో ముందంజలో ఉంటే అన్నాడీఎంకే 16 స్థానాల్లో, పీఎంకే, భాజపాలు తలా రెండు స్థానాల్లో మాత్రమే ఆధిక్యత కనబరుస్తున్నాయి. దినకరన్‌ పార్టీ దేవర్‌ కులస్థుల ఓట్లను లాగేయబోతున్నదని, అది అన్నాడీఎంకే ఓటు బ్యాంకుకు గండి పెట్టినట్లవుతుందని నిపుణులు భావిస్తున్నారు. భాజపాతో పొత్తు మైనారిటీలను అన్నాడీఎంకేకు దూరం చేయవచ్చు. డీఎంకే, అన్నాడీఎంకేలలో ఈ ఎన్నికల్లో ఏ పార్టీ ఓడితే అది రాజకీయంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఫలితంగా తమిళనాడు రాజకీయాలు సమూలంగా మారిపోవడం తథ్యం.

- ఎం.సి.రాజన్‌
 

Posted Date: 24-03-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం