• facebook
  • whatsapp
  • telegram

నందిగ్రామ్‌... ఎవరి పక్షం?

ఉత్కంఠగా బంగ పోరు

పశ్చిమ్‌ బంగ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో ఇటీవల రెండు ఆడియో టేపులు కలకలం రేపాయి. ఒకదానిలో భాజపా నేత ముకుల్‌రాయ్‌ ఓ కార్యకర్తతో జరుపుతున్న సంభాషణ ఉంది. ఎన్నికల సందర్భంగా బూత్‌ ఏజెంట్ల నియామకంలో నిబంధనల మార్పుపై ఎన్నికల సంఘాన్ని ఎలా ఆశ్రయించాలనేది అందులో వివరించారు. మరోదానిలో, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పూర్వమేదినీపూర్‌ జిల్లాకు చెందిన ఓ భాజపా కార్యకర్తతో మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపు కోసం తమ పార్టీకి సహాయ పడాల్సిందిగా అందులో విన్నవించారు. ఈ రెండు ఆడియోలకు సంబంధించిన నిజానిజాలు పూర్తిగా తెలియకపోయినా, అవిమాత్రం కావాల్సినంత రచ్చకు దారితీశాయి.
మరోవైపు- మార్చి 28న నందిగ్రాం పరిధిలోని ఒక సభలో మమతా బెనర్జీ మాట్లాడుతూ... 2007 మార్చి 14న నందిగ్రామ్‌లో చోటుచేసుకున్న మరణాల వెనక సూత్రధారులు ఇటీవల భాజపాలో చేరిన తండ్రీకుమారులైన శిశిర్‌ అధికారి, సువేందు అధికారేనని ఆరోపించారు.

ఆ వెంటనే సామాజిక మాధ్యమాలు పలురకాల సందేశాలతో పోటెత్తాయి. నాటి సీఎం బుద్ధదేవ్‌ భట్టాచార్యకు అంటిన రక్తం మరకలను ఆయన ప్రత్యర్థి మమతా బెనర్జీయే కడిగి పారేశారనే వ్యాఖ్యానాలు వెల్లువెత్తాయి. పద్నాలుగేళ్ల తరవాత మమత అకస్మాత్తుగా బహిరంగంగా ఈ విషయాన్ని ఎందుకు ప్రకటించారు? అత్యంత కీలకమైన ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఇలాంటి ప్రకటన చేయడానికి ఆమెను ప్రేరేపించిందేమిటి? ఒకప్పుడు హోరాహోరీగా తలపడిన సీపీఐ(ఎం)తో సత్సంబంధాలు ఆశిస్తున్నారా? 2007లో ఇదే నందిగ్రామ్‌ మమతకు పశ్చిమ్‌ బంగలో అధికారం దక్కించుకోవడానికి మార్గం సుగమం చేయలేదా? ఇలాంటి ప్రశ్నలెన్నో ఉన్నాయి.

పూర్వ మేదినీపూర్‌ జిల్లాలోని నందిగ్రాం అసెంబ్లీ నియోజకవర్గం వామపక్షాలకు కంచుకోట. అక్కడ రెండు పంచాయతీ సమితులు, రెండు బ్లాకులు, 17 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సుమారు మూడున్నర లక్షల మంది జనాభా ఉండే నందిగ్రామ్‌లో 2.70 లక్షలకుపైగా ఓటర్లున్నారు. ఇందులో సుమారు 27 శాతం ముస్లిం మైనారిటీ ఓటర్లే. ఈ ఓట్లే ఇక్కడ కీలకంగా మారాయి. నందిగ్రాం బ్లాక్‌-1లో నివసించే మైనారిటీ ఓటర్లపైనే తృణమూల్‌ భారీ ఆశలు పెట్టుకుంది. ఈ బ్లాక్‌ మమతకు అనుకూలంగా మారుతుందని, ఫలితంగా ఆమెకు మంచి ఆధిక్యమే లభిస్తుందని భావిస్తోంది. మరోవైపు, భాజపా అభ్యర్థి సువేందు అధికారి బ్లాక్‌-2 ప్రాంతంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మమతపై తీవ్రస్థాయిలో తలపడుతున్న ఆయన ఈ ప్రాంతంలోని హిందూ ఓటర్లను మచ్చిక చేసుకునే విషయంలో ఏ ఒక్క అవకాశాన్నీ జారవిడవడం లేదు. వైష్ణవ భక్తులు అధికంగా ఉండే నందిగ్రాం ప్రాంతంలోని పల్లెల్లో నిత్యం కీర్తనలు వినిపిస్తుంటాయి. అవి ఈవీఎమ్‌లలోనూ ప్రతిధ్వనించాలని సువేందు ఆశిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితులన్నింటి మధ్య వామపక్షాల ఓట్లు కీలకంగా పరిణమించాయి. 2011లో వామపక్ష ప్రభుత్వం మమత చేతిలోనే పదవీచ్యుతి పొందినా, వామపక్షాలకు 60 వేలదాకా ఓట్లు దక్కాయి. 2016లో వామపక్షాలు మమత చేతిలో ఓటమి పాలయినా, సుమారు 53 వేలదాకా ఓట్లు పొందాయి. చివరికి, 2019 లోక్‌సభ ఎన్నికల్లో వామపక్షాల ఓట్లశాతం బాగా పడిపోయినప్పటికీ టామ్లుక్‌ స్థానంలో సుమారు 1.40 లక్షల ఓట్లను సాధించగలిగాయి. నందిగ్రామ్‌ ఈ స్థానంలో భాగమే. ఇప్పుడు లెక్కలన్నీ నందిగ్రాం బరిలో దిగిన సీపీఐ(ఎం) అభ్యర్థి మీనాక్షి ముఖర్జీ చుట్టూనే తిరుగుతున్నాయి. మమత, సువేందు మధ్య పోరులో మీనాక్షియే నిర్ణయాత్మక శక్తిగా అవతరించారు. అందుకే, తాజాగా మమత వామపక్షాల వైపు మొగ్గు కనబరచారు. వామపక్షాల ఓట్లు కమలదళం వైపు మరలకుండా తనవైపు తిప్పుకోవడంగాని, కనీసం అడ్డుకోవడమైనా చేయాలనేది ఆమె లక్ష్యంగా తెలుస్తోంది. వ్యక్తిగతంగా సువేందుకు, పార్టీగా భాజపాకు మమత బలమైన ప్రత్యర్థే అయినా- ఒకప్పటి తన సహచరుణ్ని ఎదుర్కోవడం ఆమెకు అంత సులువైన పనేమీ కాదు. ఒకవేళ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యం దక్కకపోతే బయటి నుంచి మద్దతు తీసుకొనే అవకాశం ఉందా? వామపక్షాలకు స్నేహహస్తం చాస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలతో నేడు నందిగ్రామ్‌ పోలింగ్‌ ఉత్కంఠ రేపుతోంది.

- దీపాంకర్‌ బోస్‌

Posted Date: 01-04-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం