• facebook
  • whatsapp
  • telegram

కాకరేపుతున్న కేరళ!

ఒకరిది వృద్ధి మాట... మరొకరిది ఉద్వేగాల బాట

 

 

ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ కేరళలో రాజకీయ ప్రచారం వేడెక్కుతోంది. వామపక్ష ఫ్రంట్‌కు సారథ్యం వహిస్తున్న సీపీఐ(ఎం), యూడీఎఫ్‌ సారథిగా కాంగ్రెస్‌ల మధ్య విమర్శల వాగ్బాణాలు పదునెక్కాయి. మరోవంక రాష్ట్రంలో అస్తిత్వం చాటుకునేందుకు సర్వప్రయత్నాలూ చేస్తున్న భాజపా తరఫున స్వయంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగి ప్రత్యర్థి పార్టీలపై అస్త్రశస్త్రాలు సంధించారు. మరో మూడు రోజుల్లో పోలింగ్‌కు సిద్ధమవుతున్న కేరళలో ఈ దఫా ఎల్‌డీఎఫ్‌కే విజయావకాశాలు అధికంగా ఉన్నాయని వివిధ సర్వేలు చెబుతున్నాయి. శబరిమలలో మహిళల ప్రవేశం అన్న భావోద్వేగ అంశాన్ని  యూడీఎఫ్‌, భాజపాలు బలంగా నెత్తికెత్తుకోవడంతో... ఓటరు మనోగతాన్ని అది ఏ మేరకు ప్రభావితం చేయగలదన్న ఉత్కంఠ నెలకొంది.

 

అయిదేళ్ల ఎల్డీఎఫ్‌ పాలనలో బంగారం దొంగ రవాణా, లైఫ్‌ మిషన్‌లో అవినీతి, ఐటీ విభాగంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. వాటిని ప్రతిపక్ష యూడీఎఫ్‌ ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచార ఆయుధాలుగా మార్చుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దాంతో శబరిమలలో మహిళలకు ప్రవేశం అనే అంశం ఆధారంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్‌పై విజయఢంకా మోగించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. కొవిడ్‌ కోరసాచిన రోజుల్లోనూ, వరదలు ముంచెత్తిన కాలంలోనూ వామపక్ష ప్రభుత్వం ఇంటింటికీ ఠంచనుగా రేషన్‌ సరకులు సరఫరా చేసింది. సహాయ కార్యక్రమాలను జోరుగా చేపట్టింది. గడచిన అయిదేళ్ల ఎల్డీఎఫ్‌ పాలనలో కేరళను నిపా వైరస్‌, రెండు భారీ వరదలు, మట్టిపెళ్లలు విరిగిపడిన ఘటనలు, కొవిడ్‌ విజృంభణ చుట్టుముట్టాయి. వీటిని సమర్థంగా ఎదుర్కొనడం ద్వారా ఎల్డీఎఫ్‌ ప్రజాదరణ చూరగొందనడంలో సందేహం లేదు. 2016 అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికలో ఎల్డీఎఫ్‌ 600 పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టుల ఏర్పాటును ప్రకటించింది. వాటిలో 30 తప్ప మిగిలిన పథకాలన్నింటినీ నెరవేర్చామని, ఈ ఏడాది మిగిలిన హామీలనూ పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి విజయన్‌ ఉద్ఘాటిస్తున్నారు. ఎల్డీఎఫ్‌ నెరవేర్చిన వాగ్దానాలలో ‘ఆర్ద్రం’ పథకం ముఖ్యమైనది. దీని కింద ఆ రాష్ట్రంలో ప్రజారోగ్య యంత్రాంగాన్ని సంస్కరించారు. ‘లైఫ్‌ మిషన్‌’ కింద ఈ ఏడాది జనవరి 18కల్లా రాష్ట్రంలో ఇళ్లు లేనివారికి సుమారు రెండున్నర లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చారు. ‘హరిత కేరళం’ పథకం కింద రాష్ట్రంలోని జలమార్గాల వెంట పచ్చదనం పెంచారు. వనాలు, పచ్చిక బయళ్లను సంరక్షించారు. పెద్దయెత్తున వ్యర్థాల శుద్ధిని చేపట్టారు. విద్యా వ్యవస్థలను పటిష్ఠీకరించారు. మహిళా సాధికారత సాధనలో ముందడుగు వేశారు. దేశంలో మొట్టమొదటిసారిగా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ‘ట్రాన్స్‌జెండర్ల’కు ప్రభుత్వోద్యోగాలు కల్పించి, వారి కోసం ప్రత్యేక సంక్షేమ చర్యలు తీసుకున్నారు. పౌరులందరికీ ఉచితంగా కె-ఫోన్‌ ఇచ్చి, అందుబాటు ధరలకు అంతర్జాల సదుపాయం కల్పించారు. కేరళ మౌలిక సదుపాయాల పెట్టుబడి నిధి (కేఐఐఎఫ్‌బీ) ద్వారా రాష్ట్రంలో అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులు నిర్మించారు.

 

వామపక్ష కూటమిలో విశ్వాసం కనబడుతుంటే, యూడీఎఫ్‌లో అయోమయం వ్యక్తమవుతోంది. నాయకత్వం కోసం కుమ్ములాట ప్రతిపక్షమైన యూడీఎఫ్‌ను బలహీనపరుస్తోంది. రేపు తమ ఫ్రంట్‌ గెలిస్తే కాబోయే ముఖ్యమంత్రి నేనంటే నేనని మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు రమేశ్‌ చెన్నితల, కేరళ పీసీసీ అధ్యక్షుడు ములప్పళ్లి రామచంద్రన్‌ పోటీపడుతున్నారు. స్థానిక ఎన్నికల్లో యూడీఎఫ్‌ మట్టికరచినప్పటి నుంచి ఆ ఫ్రంట్‌లో చిరకాల భాగస్వామి అయిన ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (ఐయూఎంఎల్‌) మిగతా పార్టీలపై పెత్తనం చేయాలని చూస్తోంది. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తనకు కంచుకోటలనుకున్న స్థానాల్లోనూ ఓడిపోగా, యూడీఎఫ్‌ గెలిచిన స్థానాల్లో అత్యధికం ఐయూఎంఎల్‌ ఆధిక్య ప్రాంతాల్లోనే ఉన్నాయి. అందుకే యూడీఎఫ్‌కు తాను తప్ప గతిలేదని ఐయూఎంఎల్‌ నమ్ముతున్నట్లుంది. దీంతో కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూడీఎఫ్‌ నిరుడు లోక్‌సభ ఎన్నికల్లో తనకు గెలుపు సాధించిపెట్టిన శబరిమల నినాదాన్ని మళ్ళీ తలకెత్తుకుంది. ఆ నినాదమే ఎన్నికల్లో ప్రధాన పాత్ర వహించేట్లయితే- దానివల్ల ఎల్డీఎఫ్‌ దెబ్బతింటుంది.

 

అందువల్ల కాంగ్రెస్‌, భాజపాలు లేవనెత్తుతున్న శబరిమల నినాదానికి ఏ విధంగానూ స్పందించవద్దని సీపీఐ(ఎం) తమ నాయకులు, కార్యకర్తలకు నూరిపోస్తోంది. శబరిమల సమస్య కోర్టులో ఉన్నందువల్ల దాని గురించి పార్టీలు చేయగలిగిందేమీ లేదు, కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసమే దీన్ని లేవనెత్తుతున్నారని ఆ పార్టీ కొట్టిపారేస్తోంది. శబరిమల నినాదంతో గెలవాలని యూడీఎఫ్‌ ప్రయత్నించడం చివరకు ఆ ఫ్రంట్‌కే నష్టం కలిగించినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మతపరమైన సమస్యలు లేవనెత్తితే అది భారతీయ జనతా పార్టీకి మేలు కలిగించి, ముస్లిం పార్టీలను కాంగ్రెస్‌కు దూరం చేసే ప్రమాదం ఉంది.

 

- కె.ప్రవీణ్‌ కుమార్‌
 

Posted Date: 05-04-2021గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం