• facebook
  • whatsapp
  • telegram

తూరుపు దిక్కున వేగుచుక్క

జాతీయ ప్రత్యామ్నాయ నేత దీదీయేనా?

పశ్చిమ్‌ బంగ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ను ఒంటి కాలిపై గెలిపించిన మమతా బెనర్జీ భాజపాయేతర లౌకిక పార్టీలకు నేతగా మారే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు జాతీయస్థాయిలో భాజపాకు కాంగ్రెస్‌పార్టీ ప్రత్యామ్నాయంగా ఉన్నప్పటికీ- దాన్ని నడిపే నేతల రాజకీయ చాతుర్యం నానాటికీ మసకబారుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌తో సహా, ఇతర ప్రతిపక్షాలకు మమత నాయకత్వాన్ని ఆమోదించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా హిందీ మాట్లాడే ప్రాంతాల్లో బలంగా ఉన్న యాదవ నేతలు ములాయంసింగ్‌, లాలూప్రసాద్‌, మరాఠా యోధుడు శరద్‌పవార్‌ వయోభార పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభ దిల్లీ పరిధి దాటలేదు. ఉత్తర్‌ ప్రదేశ్‌లో బీఎస్పీ ప్రాబల్యం తగ్గి, మాయావతి రాజకీయ క్రియాశీలతను కోల్పోయారు. ఇవన్నీ మమతకు కలిసి వచ్చే అంశాలుగా మారాయి. విభిన్న రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు, నాయకుల వ్యక్తిగత పరిమితులు, సమస్యలు అన్నీ కలిసి మమతనే ప్రత్యామ్నాయ నేతగా చూపిస్తున్నాయి.

కానరాని వ్యతిరేకత

జాతీయ రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌లో వేళ్లూనుకోవడం ముఖ్యం. ఇక్కడి రాజకీయాలను శాసించే నాయకులే జాతీయ రాజకీయాల్లో వెలుగొందడం ఇప్పటివరకు చూస్తూ వచ్చాం. ఇప్పుడు అక్కడ ములాయం, లాలూప్రసాద్‌ యాదవ్‌ క్రియాశీలక రాజకీయాలనుంచి వైదొలగడంతో వారసులు అఖిలేష్‌, తేజస్వి యాదవ్‌లు పార్టీలు నడుపుతున్నారు. స్వరాష్ట్రాల్లో నిలదొక్కుకొనేందుకు ఈ యువనేతలిద్దరూ జాతీయ రాజకీయాలకంటే రాష్ట్ర రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే మమత నాయకత్వాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే వీరిద్దరూ పశ్చిమ్‌ బంగకు వెళ్లి ఎన్నికలకు ముందే దీదీకి సంఘీభావం ప్రకటించడం ద్వారా ముందస్తు సంకేతాన్ని ఇచ్చారు. ఉత్తరాదిలో పంజాబ్‌, ఝార్ఖండ్‌నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శిరోమణి అకాళీదళ్‌, ఝార్ఖండ్‌ ముక్తిమోర్చాలు సైతం జాతీయ రాజకీయాల్లో భాజపాకు ప్రత్యామ్నాయంగా నిలబడే వారికి సంపూర్ణ మద్దతు పలికే అవకాశం ఉంది. ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్‌ అధినేత నవీన్‌ పట్నాయక్‌ వయసు రీత్యా జాతీయ రాజకీయాలవైపు చూసే పరిస్థితి లేదు. అందువల్ల మమత నాయకత్వంపట్ల సానుకూలత వ్యక్తం చేయకపోయినా వ్యతిరేకత కనబరచే అవకాశం ఉండదు.

చాలా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు భాజపాకు వ్యతిరేకంగా నిలవడానికి కొంత జంకుతున్నాయి. జాతీయస్థాయిలో ప్రతిపక్షాలకు బలమైన నాయకత్వం లేకపోవడంవల్ల ఎదురునిలిచినా తట్టుకోలేమన్న భయంతో చాలాపార్టీలు మిన్నకున్నాయి. ఇప్పుడు ఆ నాయకత్వ శూన్యతను భర్తీచేయడానికి మమతా బెనర్జీ ముందుకొస్తే ఆమెతో జట్టుకట్టడానికి ప్రాంతీయపార్టీలు ధైర్యం చేసే అవకాశాలున్నాయి. ఎంపీ సీట్ల పరంగా అత్యధిక స్థానాలున్న ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌ పార్టీలకు చెందిన నేతలు స్థానిక రాజకీయాలకే పరిమితం అవుతున్నారు. ఆ తరవాత అత్యధిక స్థానాలున్న మహారాష్ట్రలోని ప్రాంతీయ పార్టీలకు అక్కడ రాష్ట్రాన్ని పూర్తిగా శాసించే పట్టులేదు. 42 లోక్‌సభ స్థానాలున్న బెంగాల్‌ నేత మమతా బెనర్జీ జాతీయ ప్రత్యామ్నాయంగా ఎదగడానికి గణాంకాలు సైతం సహకరించే అవకాశం ఉంది. తృణమూల్‌ కాంగ్రెస్‌కు తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో కాస్తోకూస్తో పట్టున్నందువల్ల అక్కడి ప్రతిపక్షాలూ ఆమె నాయకత్వాన్ని అంగీకరించే అవకాశం ఉంటుంది. వీధిపోరాటాలకు ప్రత్యామ్నాయంగా మారిన ఆమె ఆ దూకుడును కొనసాగిస్తూనే- కొంత సర్దుబాటుతత్వాన్ని, జాతీయస్థాయి రాజకీయాలకు అవసరమైన పరిపక్వతను అలవరుచుకోవాలి. అప్పుడు రాజకీయ పునరేకీకరణకు చొరవ తీసుకుంటే 2024 లోక్‌సభ ఎన్నికలు రసవత్తరంగా మారే అవకాశం ఉంటుంది.

ఉద్యమాలే సోపానాలుగా...

ప్రస్తుతం ప్రతిపక్షాలకు సరైన నాయకత్వం లేకపోవడంవల్లే వారిపై విశ్వాసం కుదరక ప్రజలు భాజపా కూటమికి ఓటేస్తున్నారన్న వాదన ఇప్పటివరకూ ఉంది. ఆ శూన్యాన్ని భర్తీచేస్తూ మమతా బెనర్జీ నిలబడితే మున్ముందు జాతీయస్థాయిలోనూ ఢీ అంటే ఢీ అనే రాజకీయ వాతావరణం నెలకొనడం ఖాయం. పశ్చిమ్‌ బంగను చేజిక్కించుకుంటే మొత్తం భారతదేశాన్నే రాజకీయంగా తమ గుప్పిట ఉంచుకున్నట్టేనన్న ధోరణితో భాజపా నాయకత్వం ఆ రాష్ట్ర ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డింది. దాన్ని ఎదుర్కోవడానికి మమతా బెనర్జీ సైతం అదే స్థాయిలో పోరాడారు. మమత వర్సెస్‌ భాజపా అన్నట్లు సాగిన యుద్ధంలో జయభేరి మోగించడం ద్వారా ఆమె వ్యక్తి నుంచి ఒక శక్తిగా ఆవిర్భవించారు. భాజపా నాయకత్వం బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో- పరోక్షంగా మమతా బెనర్జీని బలోపేతం చేసింది. ఇప్పటికే రైతు ఉద్యమనేత రాకేశ్‌ తికాయత్‌ ఎన్నికలకు ముందే బెంగాల్‌కు వెళ్ళి మమతా బెనర్జీకి మద్దతు పలికారు. ఆమె జాతీయ రాజకీయాలపై దృష్టి సారించి ఇలాంటి ప్రజా ఉద్యమాలకు మద్దతిస్తే దేశవ్యాప్తంగా అవి తీవ్రరూపు సంతరించుకొనే అవకాశం ఉంది. సామూహిక ప్రయోజనాలతో కూడిన ఈ ఉద్యమాలు... ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపై వచ్చి పనిచేయడానికి వేదికలుగా మారే వీలుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిపక్షాలకు స్థానం కల్పిస్తాయి. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ స్తంభించి పేద, మధ్య తరగతి జీవితాలు అనిశ్చితంగా మారాయి. ప్రస్తుత సమయంలో సమాజంలోని చాలా మంది ప్రజలు ఆలంబనను కోరుకుంటున్నారు. అందువల్ల రాబోయే రోజుల్లో తమకు ఆశాకిరణంగా కనిపించే వారివైపు పేద, మధ్యతరగతి, రైతాంగం మొగ్గుచూపే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రస్తుతం ఉన్న ఏకపక్ష రాజకీయ విధానం పోయి పోటీ రాజకీయాలు తెరమీదికొచ్చే అవకాశాలున్నాయి. ‘బెంగాల్‌ ఈ రోజు ఆలోచించింది... దేశం రేపు ఆలోచిస్తుంది’ అన్న నానుడి స్వాతంత్య్ర సంగ్రామం నాటి నుంచి ఉంది. ప్రస్తుత పశ్చిమ్‌ బంగ ఫలితాలు దేశ ప్రజల ఆలోచనలను ఏ దిశకు మళ్ళిస్తాయో కాలమే చెప్పాలి.

అసాధారణ విజయంతో అవకాశాలు

దక్షిణాదిలో కాంగ్రెస్‌, వామపక్షాలు, డీఎంకే, జేడీఎస్‌, తెలుగుదేశం, తెరాస, ఎంఐఎం లాంటి పార్టీలు- భాజపా, దాని మిత్రపక్షాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న తరుణంలో జాతీయస్థాయిలో బలమైన కూటమి ఏర్పాటుకు మమత ముందుకొస్తే మద్దతిచ్చేందుకు దండిగా అవకాశాలున్నాయి. మమతా బెనర్జీ గత రెండు ఎన్నికల్లో గెలవడం వేరు, ఈ ఎన్నికల్లో గెలవడం వేరు. దశాబ్దాల వామపక్ష పాలనకు ముగింపు పలుకుతూ- 2011లో తొలిసారి అధికారంలోకి వచ్చిన ఆమె జాతీయ దృష్టిని ఆకర్షించినా జాతీయ నాయకురాలిగా కనిపించలేదు. 2016లో వరసగా రెండోసారి గెలుపొంది స్వరాష్ట్రంలో బలీయ నేతగా నిరూపించుకున్నారు. అప్పుడు సైతం ఆమె దిల్లీకి దిక్సూచిగా మారతారన్న భావన ఎవరికీ కలగలేదు. 2021 ఎన్నికల్లో గెలిచిన తీరు ఆమె పోరాట పటిమను జాతి యావత్తు ఉలిక్కిపడి చూసేలా చేసింది. భాజపా అగ్రనేతలు ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌ షా లు ఆమెను, ఆమె పార్టీని లక్ష్యంగా చేసుకొని సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించినా ఎదుర్కొని నిలవడమేకాకుండా, వారిద్దరినీ నిలువరించడం ద్వారా ఆమె జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయంగా మారారు. అసాధారణ రీతిలో తృణమూల్‌ను గెలిపించడం ద్వారా ఆమె ఎదురులేని జాతీయస్థాయి నేతగా నిలిచేందుకు ద్వారాలు తెరుచుకున్నాయి.

- హితైషి
 

Posted Date: 29-05-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం