• facebook
  • whatsapp
  • telegram

కమలరథం దూకుడుకు పగ్గాలు

భాజపాను దెబ్బతీసిన మైనారిటీలు, మహిళలు

 

 

భారతీయ జనతా పార్టీ విజయ పరంపరకు చక్రాల కుర్చీలోని ఓ మహిళ ఒంటరిగా అడ్డుకట్ట వేయగలిగిందా? లేకపోతే, పశ్చిమ్‌ బంగలో కాషాయదళం అధికారంలోకి వస్తే తమ ఉనికికే ముప్పు వాటిల్లుతుందన్న అల్పసంఖ్యాక వర్గాల భయమే దీనికి కారణమా? అవును... ఈ రెండో వాదనే వాస్తవం. మైనారిటీలందరూ తృణమూల్‌ కాంగ్రెస్‌ వెనకే నిలబడ్డారు. ఇతర ప్రధాన లౌకిక పార్టీలన్నింటినీ విడిచిపెట్టి, గంపగుత్తగా టీఎంసీకే ఓట్లేశారు. భాజపా అధికారంలోకి రాకుండా అడ్డుకోగలిగిన శక్తి సామర్థ్యాలు మమతా బెనర్జీకి మాత్రమే ఉన్నాయన్న నమ్మకమే మైనారిటీ ప్రజలను ఏకతాటిపై నడిపించింది. పశ్చిమ్‌ బంగలో మరికొన్ని అంశాలూ భాజపాకు వ్యతిరేకంగా పనిచేశాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఏకపక్షంగా గెలిచిన దక్షిణ జంగల్‌మహల్‌ ప్రాంతంలో ఇప్పుడు తుడిచిపెట్టుకుని పోవడానికి సైతం అవే కారణాలు తోడయ్యాయి. ముఖ్యంగా పెద్దయెత్తున పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చిన మహిళా ఓటర్లు తృణమూల్‌కు భారీ విజయం కట్టబెట్టారు. దక్షిణ జంగల్‌మహల్‌లో భాజపా ఓటమికి వాళ్లే బాటలు పరచారు. గణనీయమైన సంఖ్యలో ఉన్న మథువాలను (బంగ్లాదేశ్‌ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన ప్రజలు) ఆకర్షించడానికి ‘అంతర్జాతీయ స్థాయి’లో ప్రయత్నించినా కమలదళానికి పెద్దగా కలిసి రాలేదు.

 

కేరళలోనూ ఖేదమే!

భాజపాకు వ్యతిరేకంగా మమతను నాయకురాలిగా ఎంచుకుంటూ వెలువడిన ప్రజాతీర్పు ఇది. తృణమూల్‌ కాంగ్రెస్‌ 2016 ఎన్నికలకు మించిన ఫలితాలను సాధించడానికి ఇదే కారణం. మరోవైపు, భాజపా సైతం ఓట్లశాతాన్ని పెంచుకుంది. కాకపోతే ఆ ఓట్లు వామపక్షాలు, కాంగ్రెస్‌ తదితరాలవి. అలా రాష్ట్ర ఎన్నికల చిత్రపటం నుంచి అవి పూర్తిగా అంతర్థానమయ్యాయి. నిజానికి రాష్ట్రంలో ఇంకా ఎక్కువ సంఖ్యలో సీట్లు వస్తాయని భాజపా ఆశించింది. తృణమూల్‌ నుంచి వలస వచ్చిన నేతలు అద్భుతాలు చేస్తారనుకుంటే అసలుకే మోసం వచ్చింది! మమతను వదిలి భాజపా తీర్థం పుచ్చుకొన్నవారిలో చాలామంది ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. రాజీవ్‌ బెనర్జీ, బైశాలీ దాల్మియా లాంటి కాకలుతీరిన యోధులు ఈ జాబితాలో ఉన్నారు. భాజపా గూటిలో చేరిన పెద్దనేతల్లో సువేందు అధికారి మాత్రమే కాస్త మెరుగైన ఫలితం సాధించారు. తూర్పు మిడ్నాపూర్‌ జిల్లాలోని నందిగ్రామ్‌లో చాలా కష్టపడి ఆయన మమతను ఓడించగలిగారు. ఈ ఎన్నికలతో దేశం మొత్తం దృష్టి పశ్చిమ్‌ బంగపైనే పడింది. రసవత్తరమైన ఎన్నికల ప్రక్రియ ముగిసినా ఇక్కడ ఒక ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. శాసనసభ్యురాలు కాని మమతా బెనర్జీ ఆరు నెలల్లో చట్టసభకు ఎన్నికై, తన ముఖ్యమంత్రి పదవిని ఎలా నిలబెట్టుకుంటారన్నది ఆసక్తికరం. దీదీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయంపైనా చర్చలు సాగుతున్నాయి. అయితే, మమత కోసం కోల్‌కతాలోని ఖర్దా నియోజక వర్గం ఎదురుచూస్తోంది. ఇక్కడి అభ్యర్థి ఎన్నికల సమయంలో కొవిడ్‌ బారిన పడి మరణించడంతో ఈ నియోజకవర్గం ఖాళీ అయ్యింది.

 

కేరళలోనూ భాజపాది ఇదే పరిస్థితి! ఇక్కడా ఆ పార్టీని ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. దానితో రాబోయే అయిదేళ్ల పాటు రాష్ట్ర శాసనసభలో భాజపాకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. వివిధ పార్టీలకు ఓట్లేసే ఉత్తర, మధ్య ప్రాంతాల మైనారిటీలు ఈసారి మొత్తంగా ఎల్డీఎఫ్‌ వెనక నిలబడ్డారు. రాష్ట్రంలో భాజపా ప్రవేశిస్తే తమ అస్తిత్వమే ప్రశ్నార్థకమవుతుందన్న భావనతో వామపక్ష కూటమిని బలపరిచారు. ముస్లింలీగ్‌కు గట్టి పట్టు ఉన్న ఉత్తర కేరళలో ఈసారి ఎక్కువ మంది ఎల్డీఎఫ్‌కే ఓట్లేశారు. క్రైస్తవ జనాభా అధికంగా ఉండే మధ్య ప్రాంతంలో సైతం పినరయి విజయన్‌కు ఇలాంటి మద్దతే లభించింది. హిందూ ప్రాబల్యం ఉన్న దక్షిణ కేరళలోనూ భాజపా ప్రభావం చూపలేక పోయింది. సహేతుకమైన, అర్థవంతమైన ఎన్నికల ప్రచారాంశాలను ఎంచుకోకపోవడం వల్లే ఆ పార్టీ దెబ్బతింది. తమిళనాడులో అలాంటి ప్రచారాంశాలతోనే డీఎంకే అధికారంలోకి రాగలిగింది. వారసత్వ రాజకీయాలంటూ తమపై ముసురుకున్న ఆరోపణలను తోసిరాజంటూ స్పష్టమైన అజెండాను ప్రకటించడం ద్వారా ప్రజలకు దగ్గరైంది. ఈ క్రమంలో కరుణానిధి వారసుడు ఎంకే స్టాలిన్‌ మాత్రమే కాదు, మూడో తరం యువరాజు సైతం అద్భుత ఫలితం సాధించారు. చెపాక్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధి చక్కటి మెజారిటీతో గెలిచారు. జయలలిత హయాములో అన్నాడీఎంకేకు మహిళల మద్దతు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఆ నారీశక్తి అంతా డీఎంకే వైపు వెళ్ళింది. డీఎంకే విజయం- పదేళ్లుగా అధికారంలో ఉన్న ఏఐఏడీఎంకే పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తికి మాత్రమే అద్దం పట్టడం లేదు. వారసత్వ సంపదలుగా మారిన ప్రజాస్వామ్య పదవులు ఎంత ప్రశాంతంగా ఒక తరం నుంచి మరోతరానికి సంక్రమిస్తాయో కళ్లకు కట్టింది. నాలుగున్నర దశాబ్దాలుగా రాజకీయ ఆటుపోట్లను చవిచూస్తున్న రాజకుమారుడు స్టాలిన్‌ మొత్తానికి ఇప్పుడు సింహాసనాన్ని అధిష్ఠిస్తున్నారు. కొవిడ్‌ కేసుల విజృంభణతో దేశమంతా ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ డీఎంకే అధికారంలోకి వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో తన పాలనా ప్రాథమ్యాల పట్ల ఆ పార్టీ స్పష్టతతోనే ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రజారోగ్య రంగంలో సమస్యలు ముసురుకున్న నేపథ్యంలో తమ పార్టీ ముందు అనేక సవాళ్లు ఉన్నాయన్న డీఎంకే అధికార ప్రతినిధి మనుసుందరం ప్రకటన ఇక్కడ ప్రస్తావనార్హం.

 

అసోమ్‌లో ఆనందం

పశ్చిమ్‌ బంగ, కేరళలతో పోలిస్తే అసోమ్‌లో భాజపాకు సంతోషకర ఫలితాలే వచ్చాయి. మైనారిటీ ఓట్లు ఆ పార్టీని దెబ్బ తీయలేకపోయాయి. కాంగ్రెస్‌ ప్రచారానికెత్తుకున్న ఆదివాసీ అస్తిత్వ అంశాలూ భాజపాకే ఉపయోగపడ్డాయి. అభివృద్ధి నినాదంతో ఎన్నికలను ఎదుర్కొన్న కమలదళానికి ఇవీ కలిసివచ్చాయి. సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌-బోడోలాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌, ఏఐయూడీఎఫ్‌, వామపక్షాల మహాకూటమి చేసిన ప్రచారం అనుకున్న ఫలితాలను సాధించలేదు. భాజపాకు ప్రజల మద్దతు కూడగట్టడంలో హేమంత బిశ్వశర్మ కీలకపాత్ర పోషించారు. ఆదివాసుల రక్షణకు హామీ ఇచ్చే అసోం ఒడంబడికలోని ఆరో నిబంధనను కచ్చితంగా అమలు చేస్తామని భాజపా హామీ ఇచ్చింది. బద్రుద్దీన్‌ అజ్మల్‌(ఏఐయూడీఎఫ్‌)ను మతతత్వ శక్తిగా, అసోం ఆదివాసులకు ప్రమాదకర వ్యక్తిగా ప్రచారం చేయడం- ఆయన మిత్రపక్షాలకు చేటుచేసింది. ప్రజలకు మహాకూటమి ఎంత అపవిత్ర కలయికగా కనిపించిందో రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షులు రిపున్‌ బోరా ఓటమే స్పష్టం చేస్తోంది. మరోవైపు, అసోం ప్రస్తుత ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్‌, హేమంత బిశ్వశర్మల మధ్య సయోధ్యను సాధించడం భాజపా అధిష్ఠానానికి పెద్ద సవాలే. ముఖ్యమంత్రి పదవిపై హేమంత సుదీర్ఘకాలంగా ఆశ పెట్టుకున్నారు. పన్నీర్‌సెల్వం, పళనిస్వామి, శశికళల మధ్య కుర్చీలాట సాగుతున్న ఏఐఏడీఎంకే మాదిరిగా- అసోమ్‌లో భాజపా పరిస్థితి మారబోతోందా? లేకపోతే- సోనోవాల్‌, హిమంతల మధ్య రాజీ కుదిర్చి పార్టీ ఈ గండం నుంచి గట్టెక్కుతుందా? కొన్నాళ్లు గడిస్తే కానీ సమాధానం దొరకని ప్రశ్నలివి!

 

- బిలాల్‌ భట్‌
(కశ్మీరీ వ్యవహారాల నిపుణులు)

 

Posted Date: 29-05-2021గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం