• facebook
  • whatsapp
  • telegram

అనిశ్చితిలోనూ ఓలీ ధీమా

నేపాల్‌ రాజకీయాల్లో ఎటూతేలని పరిస్థితి 

నేపాల్‌ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ, అధ్యక్షురాలు బిద్యాదేవీ భండారీల వ్యవహార శైలిపై అక్కడి ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాజ్యాంగ విలువలకు వారు విఘాతం కలిగిస్తున్నారని పలువురు ఆందోళన చెందుతున్నారు. వారిరువురూ గత ఆరు నెలల్లో పార్లమెంటును రెండుసార్లు రద్దు చేయడమే ఇందుకు కారణం. కానీ ఓలీ, భండారీ మాత్రం తమ వైఖరిని సమర్థించుకుంటున్నారు. ఈ పరిణామాలు నేపాల్‌ రాజకీయాల్లో తీవ్ర అనిశ్చితికి దారితీశాయి. పార్లమెంటును రద్దు చేయాలని విజ్ఞప్తి చేసే వెసులుబాటు ప్రధానికి లేదని, 2015లో నూతన రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా రూపకర్తలు గర్వంగా ప్రకటించారు. కానీ గత ఆరు నెలల్లోనే ఆ దేశ ప్రతినిధుల సభ రెండుసార్లు రద్దు కావడం గమనార్హం. ఓలీ విజ్ఞప్తిని అంగీకరిస్తూ తొలుత 2020 డిసెంబర్‌ 20న, మళ్ళీ 2021 మే 22న పార్లమెంటును రద్దు చేశారు భండారీ. రాజ్యాంగంలోని 76వ ఆర్టికల్‌ను పరిశీలించకుండా ఓలి విజ్ఞప్తికి అధ్యక్షురాలు ఆమోదముద్ర వేశారని విశ్లేషకులు అంటుంటే... దాన్ని ప్రధాని, అధ్యక్షురాలు ఖండించారు.

అడుగడుగునా బలపడుతూ...

ఓలీ, భండారీ ఇరువురూ కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ నేపాల్‌ - యునైటెడ్‌ మార్క్సిస్ట్‌ లెనినిస్ట్‌ (సీపీఎన్‌-యూఎంఎల్‌) పక్షానికి చెందినవారే. భండారీ భర్త, ప్రముఖ నేత మదన్‌ భండారీ 1993లో ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అ తరవాత భండారీకి రాజకీయ పాఠాలు నేర్పించిన ఓలీ పార్టీలో ఆమెను ఉన్నత స్థాయిలో నిలబెట్టారు. ఇందుకు కృతజ్ఞతగా 2015లో అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఓలీకి ఆమె అన్ని విధాలుగా మద్దతిస్తున్నారని విమర్శకులు ఆరోపిస్తున్నారు. నూతన రాజ్యాంగాన్ని ప్రకటించిన సమయంలో, దేశానికి దక్షిణాన ఉన్న తెరాయ్‌ ప్రాంతంలోని మధేసి పార్టీలను కూడా చేర్చుకోవాలని భారత్‌ నుంచి నేపాల్‌కు తీవ్ర ఒత్తిడి ఎదురైంది. కానీ వాటిని ఓలీ లెక్కచేయకుండా ధైర్యంగా నిలబడ్డారు. ఈ పరిణామంతో ఓలీకి అక్కడి ప్రజల్లో ఆదరణ పెరిగింది. 2020 మే 20న నేపాల్‌ కొత్త మ్యాపును విడుదల చేశారు. కాలాపానీ, లింపియదుర, లిపులేఖ్‌ ప్రాంతాలపై భారత్‌-నేపాల్‌ మధ్య వివాదం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. అవి తమ భూభాగంలోనివేనని ఇరు దేశాలూ వాదిస్తున్నాయి. ఈ తరుణంలో ఆయా ప్రాంతాలను జోడిస్తూ ఓలీ మ్యాప్‌ రూపొందించడం తీవ్ర చర్చలకు దారితీసింది. అయినప్పటికీ ఓలీ వెనకడుగు వేయక పోవడంతో మద్దతుదారుల్లో ఆయన నాయకత్వం మీద నమ్మకం పెరిగింది. పార్లమెంటు రద్దు తరవాత సైతం ఓలీ ధైర్యంగా ఉండటానికి- మహంత ఠాకుర్‌, రాజేంద్ర మహతో వంటి మధేసి నేతలు ఆయనకు మద్దతుగా నిలవడం మరో కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. వారిని తనవైపు తిప్పుకోవడానికి ఓలీ ‘పౌరసత్వ’ అస్త్రాన్ని ప్రయోగించారు. నూతన పౌరసత్వ ఆర్డినెన్స్‌ను ఓలీ- అధ్యక్షురాలికి పంపగా... ఆమె వెంటనే దాన్ని ఆమోదించారు. 2015 సెప్టెంబర్‌ 20కి ముందు నేపాల్‌ పౌరసత్వం ఉన్న దంపతుల సంతానాలకు, ఒంటరి తల్లుల సంతానాలకు పౌరసత్వాన్ని అందించే విధంగా ఆ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చారు. దీంతో అప్పటి వరకు తనపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న మధేసి నేతలను ఓలి తనవైపు తిప్పుకోగలిగారు.

భండారీ పనితీరుపై ప్రశ్నలు

2008లో నేపాల్‌ రిపబ్లిక్‌గా మారగా... డాక్టర్‌ రామ్‌బరన్‌ యాదవ్‌, దేశ తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 2015 అక్టోబర్‌ 28న పార్లమెంటులో ఓటింగ్‌ ద్వారా భండారీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అయితే వీరి పనితీరులో చాలా వ్యత్యాసం ఉంది. ఓలీ చెప్పుచేతల్లో భండారీ ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. కానీ నేపాలీ కాంగ్రెస్‌ సభ్యుడైన యాదవ్‌, తన పదవీకాలంలో తటస్థంగా ఉంటూ, రాజ్యాంగానికి విలువనిస్తూ బాధ్యతలను నిర్వర్తించారన్నది విశ్లేషకులు అభిప్రాయం. ఓలీ చర్యల వల్ల ఎన్‌సీపీకి కూడా దెబ్బపడింది. పార్టీ మూడుగా చీలిపోయింది. సీపీఎన్‌-యూఎంఎల్‌కు ఓలీ ప్రాతినిధ్యం వహిస్తుండగా, అందులో నుంచి బయటకు వచ్చిన వారిలో మాధవ్‌ కుమార్‌, జలనాథ్‌ ఖానల్‌లు కీలక నేతలుగా ఉన్నారు. ఇక సీపీఎన్‌ను ప్రచండ ముందుండి నడిపిస్తున్నారు. 2017 ఎన్నికల ముందు ఈ కమ్యూనిస్టు పార్టీలు చేతులు కలిపాయి. అయితే ప్రధాని పదవిని పంచుకోవాలని ఎన్నికల ముందు ప్రచండ-ఓలీ మధ్య ఒప్పందం కుదిరింది. కానీ అది అమలు కాకపోవడం ఇరు వర్గాల మధ్య విభేదాలకు దారితీసింది. ఓలీని గద్దె దింపేందుకు తీవ్రంగా శ్రమించడం మొదలుపెట్టారు ప్రచండ. నిరుడు డిసెంబరులో భండారీ ఆమోదించిన పార్లమెంటు రద్దు ప్రక్రియను అత్యున్నత న్యాయస్థానం ఈ ఏడాది ఫిబ్రవరిలో కొట్టివేసింది. ఈ నేపథ్యంలో అధ్యక్షురాలు మళ్లీ అదే నిర్ణయం తీసుకోవడంతో కథ మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ సాగుతోంది. అందువల్ల సుప్రీం తీర్పు వెలువడేంత వరకు నేపాల్‌లో రాజకీయ అనిశ్చితి అనివార్యం.

- సురేంద్ర ఫుయాల్‌ 
(నేపాల్‌కు చెందిన పాత్రికేయుడు)

 

Posted Date: 31-05-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం