• facebook
  • whatsapp
  • telegram

మంచుకొండల్లో రాజకీయ వేడి!

జమ్మూకశ్మీర్‌ నేతలతో ప్రధాని భేటీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జమ్మూకశ్మీర్‌ రాజకీయ నాయకుల భేటీకి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. రేపు జరగబోయే ఈ సమావేశానికి  సంబంధించి ఇప్పటికే కేంద్ర హోం శాఖ నుంచి ఆయా నేతలకు ఆహ్వానాలు వెళ్ళాయి. రెండేళ్ల క్రితం 370వ అధికరణ రద్దుతో తన ప్రత్యేక ప్రతిపత్తిని కోల్పోయిన ప్రాంతంలో దీనితో ఎన్నికల రాజకీయాలు మళ్ళీ మొదలుకాబోతున్నాయి. 370వ అధికరణ రద్దును నిరసిస్తూ ‘పీపుల్స్‌ అలయెన్స్‌ ఫర్‌ గుప్కార్‌ డిక్లరేషన్‌’(పీఏజీడీ) పేరిట స్థానిక ప్రముఖ రాజకీయ పక్షాలన్నీ కూటమి కట్టిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్‌ కోల్పోయిన ప్రత్యేక ప్రతిపత్తిని తిరిగి సాధించడమే తమ లక్ష్యమని అవి ఇప్పటికే స్పష్టంచేశాయి. కానీ, ప్రధానితో సమావేశానికి పిలుపందుకున్న వారికి తమవైన ఆకాంక్షలున్నాయి. ఈ పరిస్థితుల్లో రేపటి సమావేశం తాలూకు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరం. దాదాపుగా స్థానిక నేతలందరూ ఎన్నికలకు జైకొట్టి, ప్రస్తుతానికి వాటితో సర్దుకుపోయే పరిస్థితే కనిపిస్తోంది!

కేంద్రం ముందుజాగ్రత్తలు

నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్సీ), పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌(పీసీ), పీడీపీ, సీపీఐ(ఎం), అప్నీ పార్టీలతో సహా చిన్నా పెద్దా రాజకీయ పక్షాలన్నింటినీ కేంద్రం చర్చలకు ఆహ్వానించింది. మొదట్లో పీఏజీడీలో భాగస్వామిగా ఉన్న సాజద్‌ లోనే ఇప్పుడు తన సొంత పార్టీ ‘పీసీ’ తరఫున ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. అప్నీ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అల్తాఫ్‌ బుఖారీ పీడీపీ-బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. వీరు భాజపాకు పరోక్ష మద్దతుదారులనే భావన కశ్మీరీ రాజకీయ వర్గాల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం, జమ్మూకశ్మీర్‌ స్థానిక నాయకత్వం మధ్య కొంత కాలంగా తెర వెనక మంతనాలు జోరుగా సాగుతున్నాయి. వీటి ఫలితాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి. జమ్మూకశ్మీర్‌ స్వయంప్రతిపత్తిని రద్దుచేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్న నాయకులను బుజ్జగించగలిగే కొంతమంది కీలక నేతలు నిర్బంధం నుంచి బయటపడటం ఇందులో భాగమే! ఇటువంటి వారిలో మెహబూబా ముఫ్తీ నిర్ణయాల్లో కీలక పాత్రధారి అయిన ఆమె సమీప బంధువు సర్తాజ్‌ మదినీ ఒకరు. మెహబూబా తండ్రి, మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్‌ సయీద్‌కూ సర్తజ్‌ ఇలాగే చేదోడువాదోడుగా ఉండేవారు. మరో ప్రభావశీల నేత సాజద్‌ లోనేకు భాజపా నాయకత్వంతో ఉన్న సాన్నిహిత్యం రహస్యమేమీ కాదు. హురియత్‌ కాన్ఫరెన్స్‌ వర్గాలను విమర్శించే నేతగా దిల్లీ నాయకత్వానికి సాజద్‌ లోనే బాగా ఇష్టులు. చర్చల్లో ఆయన భాగస్వామ్యం- గుప్కార్‌ కూటమి కంటే కేంద్రానికే ఎక్కువ ప్రయోజనకారి కానుంది. కారాగారం నుంచి విడుదలయ్యాక ఒమర్‌ అబ్దుల్లా సైతం కాస్త మెత్తబడినట్టు కనిపిస్తున్నారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి పునరుద్ధరణపై కంటే కూడా 4జీ సేవలను పునరుద్ధరింపజేయడంపైనే ఈ మధ్యకాలంలో ఆయన ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారు! పార్టీ వ్యవహారాలు, క్షేత్రస్థాయి రాజకీయాలను విస్మరించి ట్విటర్‌లోనే అధిక సమయం గడిపే నేతగా ఆయన ఇప్పటికే గుర్తింపు పొందారు. 2010 ఆందోళనల్లో పదుల కొద్దీ నిరసనకారులు మృత్యువాత పడినప్పుడు ముఖ్యమంత్రిగా ఉదాసీన వైఖరి ప్రదర్శించారంటూ ఒమర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఒమర్‌తో పోలిస్తే ఆయన తండ్రి ఫరూఖ్‌ అబ్దుల్లాతో వ్యవహరించడమే న్యూదిల్లీకి కాస్త కష్టం కావచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నియోజకవర్గాల పునర్విభజన సంఘం నిర్వహించిన సమావేశానికి ఫరూఖ్‌ అబ్దుల్లాతో సహా కశ్మీరీ ఎంపీలెవరూ హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో రేపటి భేటీ సైతం అలా వెలాతెలాపోకుండా ఆహ్వానితుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంది. మెహబూబా తప్ప మిగిలిన నేతలందరూ ఈ సమావేశం పట్ల సానుకూలత చూపించడానికి ప్రధాన కారణమిదే. అజెండా ఏమిటో ముందే ప్రకటించాలని మెహబూబా మొదట్లో పట్టుపట్టారు. ఒకదశలో సమావేశానికి ఆమె గైర్హాజరు అవుతారనే ప్రచారమూ ఊపందుకొంది. కానీ, ఈ భేటీకి తాము హాజరవుతామని పీఏజీడీ నేతలు నిన్న స్పష్టంచేశారు. ‘మెహబూబా, ఎండీ తారిగామిలతో పాటు నేనూ సమావేశానికి వెళ్తున్నాను’ అని ఫరూఖ్‌ అబ్దుల్లా స్వయంగా ప్రకటించారు. నేతలందరూ ఐక్యంగానే కనిపిస్తున్నా, వాళ్లలో ఎవరికి వారికి సొంత ఆలోచనలున్నాయి. వారందరూ అంతిమంగా ఎవరి పార్టీ ప్రయోజనాలకు వారు కట్టుబడి ఉంటారు. నేతాగణాలకు స్వాభావికమైన ఈ వ్యవహారశైలి స్థానిక ఎన్నికల్లో ఇప్పటికే బయటపడింది. సీట్ల పంపకాల్లో తలెత్తిన పొరపొచ్చాలతో కూటమి నేతల మధ్య అసమ్మతి సెగలు రాజుకున్నాయి.

దిల్లీదే పైచేయి

రేపటి సమావేశం అజెండాపై పూర్తిస్థాయి స్పష్టతలేదు. రాజకీయ కార్యకలాపాల పునరుద్ధరణ, సాధారణ పాలనా వ్యవస్థల ఏర్పాటుపై నేతలు ప్రధానంగా చర్చించే అవకాశముంది. స్థానిక భౌగోళిక పరిస్థితులు, జనాభా స్థితిగతులు, ప్రజల రాజకీయ ఆకాంక్షలపై ఇప్పటికే అక్కడ సర్వేలు సాగుతున్నాయి. ఎన్నికలకు ముందే నియోజకవర్గాలకు కొత్త రూపునివ్వడానికి పునర్విభజన సంఘానికి తమ నివేదికలను సమర్పించాలని ఈ కేంద్ర పాలిత ప్రాంతంలోని డిప్యూటీ కమిషనర్లందరికీ ఆదేశాలు అందాయి. పరిస్థితులన్నీ తమకు అనుకూలంగా ఉన్న దశలో సమావేశం అజెండాను నిర్ణయించడంలో దిల్లీ నాయకత్వానిదే పైచేయి కావచ్చు. అటువైపు కశ్మీరీ నాయకత్వమేమో తమ మాట చెల్లించుకునే పరిస్థితిలో లేదు. మరోవైపు, 370వ అధికరణ రద్దుపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్న దృష్ట్యా, ప్రపంచ దేశాల్లో భారత ప్రతిష్ఠను పెంచడానికి దిల్లీ సర్కారుకు ఈ సమావేశం ఉపయోగపడనున్నది. ఇందులో జరగబోయే చర్చలు, వాటి ఫలితాలు- బహుశా ఎన్నికల ప్రక్రియ ఆరంభమే కావచ్చు- ప్రత్యేక ప్రతిపత్తితో సంబంధం లేకుండానే కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయనే భావనను కలిగించనున్నాయి. కశ్మీర్‌ తనలో అంతర్భాగమన్న భారతదేశ అభిప్రాయాన్ని దీనితో మరింతగా దృఢంగా ప్రకటించినట్లు అవుతుంది. వచ్చే ఏడాది ఉత్తర్‌ప్రదేశ్‌తో సహా ఇతర రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో భాజపాకు ఇది లబ్ధి చేకూర్చవచ్చు!

కలిసివస్తున్న పాక్‌ వైఖరి

పరిస్థితులన్నీ సాధారణ స్థాయికి చేరుకున్నాయని చెప్పడానికి వేర్పాటువాద నేతల విషయంలోనూ కొన్ని నిర్ణయాలు వెలువడే అవకాశముంది. వేర్పాటువాదుల్లోని అతివాదులకు నిర్బంధం తప్పకపోయినప్పటికీ వాళ్లంతగా మంకుపట్టు పట్టని కొంతమంది నాయకులను విడుదల చేయవచ్చు. స్థానిక రాజకీయ నాయకత్వానికి సమస్యలు సృష్టించగలిగిన ఇద్దరు వేర్పాటువాద నేతల్లో అష్రాఫ్‌ సెహ్రాయ్‌ కారాగారంలోనే మరణించారు. మరొకరు మస్రత్‌ ఆలాం జైలు జీవితం గడుపుతున్నారు. వేర్పాటువాదులకు అనుకూలమైన రాజకీయ వాతావరణంలో రెండేళ్ల నుంచి గుప్కార్‌ కూటమి నేతల ప్రభావం పెరుగుతోంది. కశ్మీర్‌పై పాకిస్తాన్‌ ప్రస్తుత వైఖరి సైతం వీరికి కలిసివస్తోంది. దాయాది దేశాల మధ్య ప్రస్తుతం సరిహద్దుల్లో కాల్పుల విరమణ అమలవుతోంది. కశ్మీర్‌ పరిణామాలపై ఇది నిస్సందేహంగా ప్రభావపూరిత అంశమే!

- బిలాల్‌ భట్‌ 

(కశ్మీరీ వ్యవహారాల నిపుణులు)
 

Posted Date: 23-06-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం