• facebook
  • whatsapp
  • telegram

మమత బాణీ మంత్రాంగం

వేడెక్కిన జాతీయ రాజకీయం

పశ్చిమ్‌ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట గెలిచిన ఊపులో రచ్చ గెలిచేందుకూ రంగం సిద్ధం చేస్తున్నారు. హస్తినలో సుడిగాలి పర్యటన చేసి రాజకీయ వేడిని రగిలించారు. అత్యంత క్లిష్టమైన బెంగాల్‌ ఎన్నికల్లో ఫలించిన వ్యూహాలు, అందిన విజయంతో ఆత్మవిశ్వాసం పెరిగి జాతీయ రాజకీయాల్లో భాజపా పైకి ప్రత్యామ్నాయ శక్తిని ప్రయోగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. 2024లో కమలం పార్టీని గద్దె దించేందుకు సర్వశక్తులను కూడగడుతున్నారు. గతంలో ఎదురైన చేదు అనుభవాల నుంచి నేర్చిన పాఠాలతో ఆమె ఆచితూచి వ్యూహాత్మకంగా అడుగులు   వేస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ, సాధారణ ఎన్నికల సమరఘట్టానికి చేరేలోపు అనేక అడ్డంకులను, ఆటుపోట్లను ఎంతవరకు అధిగమించగలరనేది ఆసక్తికరమైన అంశం. 

ప్రాంతీయ పరిధులు దాటి...

అజేయమనే ముద్రతో సాగుతున్న భాజపా దూకుడుకు, ఓటు బ్యాంకు ఏకీకృత హిందుత్వ వ్యూహాలకు అడ్డుకట్ట వేసి బంగ భూమిలో విజయాన్ని సాధించడం- సోషల్‌ మీడియా పోరులో, క్షేత్రస్థాయిలో కాషాయానికి దీటుగా నిలబడటం ద్వారా విపక్షాలకు ఒక కొత్త జాతీయ రాజకీయ పరిష్కార మార్గాన్ని మమత అందించగలిగారు. ముకుల్‌రాయ్‌ లాంటి సీనియర్‌ నాయకులు సహా పలువురిని తిరిగి వెనక్కు రప్పించుకోవడం వంటి చర్యలతో పార్టీని వ్యవస్థాగతంగా పునర్నిర్మించి పటిష్ఠపరిచారు. అదే సమయంలో రాజకీయంగా ప్రాంతీయ పరిధులు దాటి జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించడంపై దృష్టిసారించారు.        ‘కమలంపై కలిసి పోరాడదాం’ అంటూ 14 పార్టీల నేతలకు లేఖలు రాశారు. పెగాసస్‌ వ్యవహారంలో కేంద్రం కంటే ముందుగా స్పందించి మాజీ న్యాయమూర్తితో విచారణ కమిటీని వేసి సంచలనాత్మకంగా భాజపా ప్రభుత్వంపై ప్రత్యక్ష యుద్ధానికి దిగారు. అయిదు రోజులు దిల్లీలో మకాం వేసి చకచకా ప్రతిపక్షాల నేతలతో మంతనాలు జరిపారు. ఎంతమందిని కలిసినా ఒక్కరూ మమతతో కలిసి ఉమ్మడి లక్ష్యంపై ప్రకటన చేయకపోవడం లేదా కలిసి విలేకరులతో మాట్లాడకపోవడం గమనించాల్సిన విషయం. ఈ పరిణామాలన్నీ వేగంగా జరిగిపోయాయి. ఇప్పుడు రాబోయే అసలు సవాళ్లను అధిగమించడంపైనే భవిష్యత్తు అంతా ఆధారపడి ఉంటుంది. అందులో మొదటగా విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడం, కొత్త రాష్ట్రపతి ఎంపికలో, రాబోయే రాష్ట్రాల ఎన్నికల్లో భాజపాను నిలువరించడం- అన్నింటికీ మించి మోదీకి ప్రత్యామ్నాయం ఉందని నిరూపించడం ప్రధానమైనవి. మోదీ జాతీయస్థాయిలో చూపినంతగా ప్రాంతీయంగా ప్రభావాన్ని కనబరచలేకపోతున్నారు. బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్న పశ్చిమ్‌ బంగ, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో భాజపా సాధించిన ఓట్లను, సీట్లను సమీక్షిస్తే అదే అర్థమవుతుంది. వీళ్లందరినీ కూడగట్టి, కాంగ్రెస్‌ను ముందుపెట్టి, సీట్ల సర్దుబాటులో, ఓట్ల చీలికలో ఇబ్బందులు తలెత్తకుండా పథకాలను రచించి విజయాన్ని సొంతం చేసుకోవడం కష్టసాధ్యమే. మోదీ-షాల దూకుడు రాజకీయం, ఎత్తుకు పైఎత్తులతో చేసే వ్యూహ రచనలను ఇంకా సంప్రదాయ పద్ధతుల్లో నడుస్తున్న కాంగ్రెస్‌ ఎదుర్కొనగలుగుతుందా? ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో తమిళనాడు మినహా మిగిలిన చోట్ల ఎదురైన ఓటములను ఒక ప్రమాద ఘంటికగా ఆ పార్టీ గుర్తించిందా అనేది సందేహాస్పదమే. 

ఎన్‌డీఏ వైఫల్యాలపై దృష్టి

వచ్చే సంవత్సరం పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణలను సంతృప్తిపరచి రాబోయే లోక్‌సభ ఎన్నికలకు భాజపా సమాయత్తమవుతున్నట్లు సంకేతాలు పంపింది. కమలం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతకు అడ్డుకట్ట వేసే వ్యూహాల అమలు మొదలైనట్లు కనిపిస్తోంది. సామాజిక వర్గాలను సమన్వయం చేసే సత్తా కాంగ్రెస్‌లో కనిపించడంలేదు. సమ్మోహన ప్రసంగాలు లేవు. దీంతో ఆ పార్టీతో జట్టుకట్టడం తమకు భారమని మిత్రపక్షాలు భావించవచ్చు. బిహార్‌లో ఆర్జేడీ మళ్ళీ కలిసి వస్తుందా అంటే అనుమానమే. ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో జట్టుగా పనిచేసే ఉద్దేశం లేదని అఖిలేశ్‌ ప్రకటించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ పట్ల జేడీఎస్‌ విముఖంగా ఉంది. ఈ పరిస్థితులన్నింటినీ సర్దుకొని, సరిదిద్దుకొని భాజపాను ఓడించడం సాధ్యమవుతుందా? ప్రతిపక్షాలకు సామూహిక వ్యూహం లేకపోవడమే 2019లో అపజయానికి కారణం. ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ్‌ బంగ వంటి రాష్ట్రాల్లో భాగస్వామ్య పక్షాల మధ్య సరైన సఖ్యత లేకపోవడంతో భాజపా వ్యతిరేక ఓట్లు చీలిపోయి కమలమే లాభపడింది. 2014, 2019ల్లో ఎన్నికలకు కొన్ని నెలల ముందు మాత్రమే విపక్షాలు ఏకం కావడం వల్ల ఓటర్ల ఆమోదాన్ని పూర్తిస్థాయిలో ఆ కూటమి పొందలేకపోయింది. ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా దాదాపు రెండున్నరేళ్ల ముందుగానే మమత వ్యూహాత్మక సన్నద్ధత మొదలుపెట్టారు. ఇప్పటి నుంచే ప్రజల్లో నమ్మకాన్ని సంపాదించుకోవడానికి ఈ ప్రయత్నం ఉపయోగపడవచ్చు. మోదీకి ఎదురుగా బలమైన ఫ్రంట్‌ సాధ్యమేనా అనే ప్రశ్న చాలామందిలో తలెత్తుతోంది. సైద్ధాంతిక వైరుధ్యాలను పక్కనపెట్టి శివసేన, కాంగ్రెస్‌లు ఎన్సీపీతో కలిసి మహారాష్ట్రలో కమలానికి అధికారం దక్కకుండా చేయడాన్ని గమనిస్తే కొత్తకూటమి విజయానికి అవకాశాలను కొట్టిపారేయడం కుదరదు. గతంలో మోదీని వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకొని ప్రచారం సాగించడం వ్యతిరేక ఫలితాలను ఇచ్చింది. ఇప్పుడు ఎన్‌డీఏ వైఫల్యాలపై ప్రధానంగా దృష్టిపెట్టి జాతీయ స్థాయిలో ‘ఖేలా హోబే (ఆట మొదలైంది)’ అంటూ దీదీ వ్యూహాలను మార్చారు. అదే పంథాను అనుసరించి, ఐకమత్యంగా ముందడుగు వేస్తే నయాఫ్రంట్‌ ఆట సరైన దిశగా సాగుతుందేమో చూడాలి. 

ప్రభావం చూపలేని కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ అధికారానికి దూరమై ఏడేళ్లయింది. మొదటి సార్వత్రిక ఎన్నికల కంటే రెండోసారి మరింత ఘోరంగా ఓటమిపాలైంది. 2019 ఎన్నికల్లో 13 రాష్ట్రాల్లో 50 శాతంపైగా ఓటింగ్‌ వాటాను భాజపాయే దక్కించుకుంది. హస్తం పార్టీ రాజకీయ వ్యూహాల్లో పదును తగ్గుతోంది. పొత్తులు, క్షేత్రస్థాయి ఓటర్ల నాడి అంచనాల్లో కాంగ్రెస్‌ విఫలమవుతోంది. అందుకే బిహార్‌లో శక్తికి మించిన స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయి ఆర్‌జేడీకి అధికారం దక్కకుండా చేసిందన్న అపవాదును మూటగట్టుకుంది. పశ్చిమ్‌ బంగలో వామపక్షాలతో కలిసినా ఒక్క సీటూ సాధించుకోలేకపోయింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌తో కలిపి మమత ఏర్పరచాలనుకుంటున్న కూటమి కోరుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుందా? కానీ, అంతకంటే మార్గాంతరం ప్రత్యామ్నాయ ఫ్రంట్‌కు కనిపించడంలేదు. బలమైన ప్రాంతీయ పార్టీలను మినహాయిస్తే పలు రాష్ట్రాల్లో భాజపాకు నేరుగా ఎదురునిలిచే సత్తా కాంగ్రెస్‌కు మాత్రమే ఉంది. ఆ విషయాన్ని గమనించే మమతా బెనర్జీ- శరద్‌పవార్‌ వంటి నాయకులు కాంగ్రెస్‌తో కలిసి సాగాలని భావిస్తున్నారు. కానీ, ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతూ కాంగ్రెస్‌ బలహీనపడుతోంది. రాహుల్‌గాంధీ, ప్రియాంకల ప్రభావం ఆశించినమేర కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పునరుజ్జీవాన్ని సాధించి కొత్త కూటమికి వెన్నుదన్నుగా నిలబడగలుగుతుందా అనేది సందేహమే!

- యం.శ్రీనివాసరావు  
 

Posted Date: 02-08-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం