• facebook
  • whatsapp
  • telegram

కాంగ్రెస్‌ పార్టీ... నానాటికీ తీసికట్టు!

అంతర్గత సంస్కరణలు అత్యవసరం

 

 

కాంగ్రెస్‌ రాజకీయం ఒక అడుగు ముందుకు పడితే రెండు అడుగులు వెనక్కు వెళ్తోంది. ఒకవైపు ప్రతిపక్షాలను ఏకం చేసి 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా పావులు కదుపుతుంటే, మరోవైపు స్వపక్ష సభ్యులు స్వలాభాల కోసం పార్టీ ప్రయోజనాలకు పాతరేస్తున్నారు. ఇటీవల 19 పార్టీలతో నిర్వహించిన వర్చువల్‌ సమావేశంలో దేశ క్షేమం కోసం తామంతా కలిసి పనిచేయడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని సోనియాగాంధీ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటాలు సాగించాలని నిర్ణయించారు. కాంగ్రెస్‌ నాయకులు మాత్రం అలవాటైన అంతర్గత కుమ్ములాటల్లో తలమునకలై ఉన్నారు. కాంగ్రెస్‌ స్వయంగా బలపడకుండా విపక్షాల ఐక్యత సాధ్యం కాదు. ఆ దిశగా పార్టీ పూర్తి స్థాయిలో దృష్టిసారించినట్లు లేదు. వచ్చే సంవత్సరం జరిగే ఏడు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల ఫలితాలు 2024 పార్లమెంటు ఎన్నికలకు ముందస్తుగా రంగం సిద్ధం చేస్తాయి. ఆ పోటీలో హస్తం పార్టీ కొన్ని చోట్ల ఒంటరిగా, మరికొన్ని చోట్ల మిత్రులతో కలిసి బీజేపీని ఎదుర్కోవాలి. కమలం పార్టీ ఇప్పటికే తమ శ్రేణులను బలోపేతం చేసే పనిలో పడింది. సొంత ఇంటిని చక్కదిద్దుకొని, దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించే ప్రయత్నాలను కాంగ్రెస్‌ ఇంకా మొదలు పెట్టినట్టు కనిపించడంలేదు.

 

ముదురుతున్న విభేదాలు

జాతీయస్థాయిలో కాంగ్రెస్‌కు పటిష్ఠ నాయకత్వం లేకపోవడం, అసెంబ్లీ ఎన్నికల్లో వరస వైఫల్యాల కారణంగా పార్టీలో అంతర్గతంగా అసమ్మతి రాగం ఊపందుకొంది. ఈ స్థితిని కాంగ్రెస్‌ అధిగమించాల్సి ఉంది. పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడిని, బలమైన జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుంటేనే విపక్షాలను కార్యోన్ముఖులను చేసే బాధ్యతలను విమర్శలకు తావులేకుండా కాంగ్రెస్‌ పార్టీ తలకెత్తుకోగలుగుతుంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవు. పాత, కొత్తతరం నాయకులను కలిపి నడిపించేందుకు చేస్తున్న ప్రయత్నాలు వికటిస్తున్నాయి. పంజాబ్‌లో కలహాలు తారస్థాయికి చేరాయి. సిద్ధూ సలహాదారులు పాకిస్థాన్‌, కశ్మీర్‌లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వారిని కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తీవ్రంగా మందలించారు. దానికి ప్రతిగా, ఇచ్చిన హామీలను నెరవేర్చని ముఖ్యమంత్రిని గద్దె దించాలని సిద్ధూ ప్రోద్బలంతో నలుగురు మంత్రులు, 32 మంది ఎమ్మెల్యేలు బహిరంగ విమర్శలు మొదలుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పరిస్థితి పార్టీకి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. అమరీందర్‌ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని అధిష్ఠానం ప్రకటనలు చేసినా, నాయకుల మధ్య పొసగని సయోధ్యను కుదిర్చి స్వయంగా అధికారానికి పొగపెట్టుకున్నట్లయింది.

 

కేంద్రంలో అధికారాన్ని అందించడంలో కీలకంగా నిలిచే ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ తన కళ కోల్పోయి మూడు దశాబ్దాలు దాటింది. ప్రస్తుతం ఏడుగురు ఎమ్మెల్యేలతో నెట్టుకొస్తుంటే అందులో ఇద్దరు తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్నారు. రాబోయే ఎన్నికల కోసం పునాది స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ఈమధ్యే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంకపై పడింది. సీనియర్‌ నాయకులు అజయ్‌కుమార్‌ లల్లూ, సల్మాన్‌ ఖుర్షీద్‌, రాజీవ్‌ శుక్లా, ఆర్‌పీఎన్‌ సింగ్‌లతో ఇప్పటికే ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసుకున్నప్పటికీ, ప్రజల్లోకి దూసుకెళ్లేందుకు, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఎలాంటి ప్రణాళికనూ సిద్ధం చేసుకున్నట్లు కనిపించడం లేదు. ఒకపక్క యోగి ఆదిత్యనాథ్‌ అధికారాన్ని నిలబెట్టుకొనే లక్ష్యంతో తమ విజయాలను ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లే పనిలో పడ్డారు. ఉత్తరాఖండ్‌లోనూ కాంగ్రెస్‌కు ఎదురుగాలే వీస్తోంది. మాజీ ముఖ్యమంత్రి హరీశ్‌సింగ్‌ రావత్‌, రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు, శాసనసభాపక్ష నేత ప్రీతమ్‌ సింగ్‌ల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. వీటిని చక్కదిద్దే ప్రయత్నంలో భాగంగా పీసీసీకి కొత్త అధ్యక్షుడిగా గణేశ్‌ గొడియాల్‌ను నియమించినా ప్రయోజనం కనిపించడం లేదు. ఒకే సంవత్సరంలో ఇద్దరు ముఖ్యమంత్రులను మార్చి రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్న బీజేపీని సమర్థంగా ఎదుర్కొని, అధికారాన్ని చేజిక్కించుకోడానికి ఉన్న అవకాశాలను అంతర్గత కుమ్ములాటల వల్ల కాంగ్రెస్‌ దూరం చేసుకుంటోంది.

 

కొరవడిన దిశానిర్దేశం

ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలిగిన సత్తా ఉండీ సమర్థంగా వ్యవహరించలేక అధికారాన్ని కోల్పోయి మణిపూర్‌లో కాంగ్రెస్‌ మరింత సంక్షోభంలోకి జారిపోయింది. వచ్చే సంవత్సరం ఎన్నికలకు సన్నాహాలు మొదలుపెట్టిన కొద్ది రోజులకే సీనియర్‌ నాయకుడు, పీసీసీ అధ్యక్షుడు, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గోవిందాస్‌ కోంథౌజమ్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ గూటికి చేరారు. 2017 ఎన్నికల్లో ఏకైక పెద్ద పార్టీగా 17 సీట్లు గెలుచుకున్నప్పటికీ సరైన వ్యూహాలు లేక గోవాలో కాంగ్రెస్‌ అధికారాన్ని దక్కించుకోలేకపోయింది. 2019లో మనోహర్‌ పారికర్‌ మరణంతో బీజేపీ ప్రభుత్వంలో మంత్రి పదవులు కోల్పోయిన గోవా ఫార్వార్డ్‌ పార్టీ (జీఎఫ్‌పీ) అధ్యక్షుడు విజయ్‌ సర్దేశాయ్‌, ఇతర సభ్యులు కాషాయ పార్టీని వదిలి 2022 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జట్టుకట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కమలానికి కలిగిన అనుభవమే జీఎఫ్‌పీతో తమకూ ఎదురవుతుందేమోననే ఆలోచనలో హస్తం పార్టీ పడింది. సందిగ్ధంలో ఉన్న కాంగ్రెస్‌ శ్రేణులకు అక్కడ సరైన దిశానిర్దేశం లేదు. రాబోయే పార్లమెంటు ఎన్నికలకు కాంగ్రెస్‌ ముందుండి అందరినీ నడిపించి బీజేపీని ఓడించాలని ప్రతిపక్షాలు భావిస్తుంటే, ఆ పార్టీ సొంతంగా బలాన్ని పుంజుకోవడానికి, మోదీలాంటి బలమైన నాయకుణ్ని ఢీకొట్టడానికి సరైన విధంగా సన్నద్ధం కావడంలేదు. హస్తం పార్టీలో నిత్య అసంతృప్తులు, ఘర్షణలు ప్రత్యర్థుల ప్రయోజనాలకు అనుకూలమైన వాతావరణాన్నే కల్పిస్తున్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్‌ మేల్కొని అంతర్గత సంస్కరణలకు ప్రాధాన్యం ఇస్తేనే పార్టీ ఉనికిని మనికిని కొంతవరకైనా కాపాడుకోగలుగుతుంది!

 

నియామకాలు ఏవీ?

గుజరాత్‌ను కాంగ్రెస్‌ అధిష్ఠానం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నట్లు కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పరాజయానికి బాధ్యతవహిస్తూ పీసీసీ అధ్యక్షుడు అమిత్‌ చావ్డా, ప్రతిపక్ష నేత పరేశ్‌ ధనాని తమ పదవులకు రాజీనామాలు చేశారు. రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జ్‌ రాజీవ్‌ సతావ్‌ మరణించి నాలుగు నెలలు దాటింది. కార్యకర్తలను ఉత్తేజపరిచి అసెంబ్లీ ఎన్నికల కోసం సమర్థంగా నడిపించాల్సిన ఆ మూడు ముఖ్యమైన పదవులకు పూర్తిస్థాయి నాయకుల నియామకాలు జరగలేదు. కాషాయం పార్టీకి ఏకైక శక్తిగా ఎదురు నిలవాల్సిన రాష్ట్రంలో కాంగ్రెస్‌ దుస్థితి అది. హిమాచల్‌ప్రదేశ్‌లో మాజీ సీఎం వీరభద్రసింగ్‌ మరణం కాంగ్రెస్‌కు లోటుగా మారే అవకాశం ఉంది. ఆయన అనుచర నాయకులు ముఖేశ్‌ అగ్నిహోత్రి, సుధీర్‌ శర్మ, ఆశా కుమారి వంటి వారిని కూడగట్టి సమర్థంగా నడిపించాలి. అప్పుడే బీజేపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తి కాంగ్రెస్‌కు కలిసొస్తుంది. ఆ దిశగా అధిష్ఠానం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు లేదు.

 

- ఎం.శ్రీనివాసరావు
 

Posted Date: 30-08-2021గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం