• facebook
  • whatsapp
  • telegram

మారుతున్న వ్యూహాలు

యూపీ బిహార్లలో నయా కుల సమీకరణలు

కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించడంలో ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాలకు కీలకమైన స్థానం ఉంది. పార్లమెంటుకు అత్యధికంగా (120 మంది) ఎంపీలను ఎన్నుకునే రాష్ట్రాలు ఈ రెండే. యూపీలో 80 లోక్‌సభ స్థానాలుంటే, బిహార్‌లో 40 ఉన్నాయి. హిందుత్వ పార్టీగా ముద్రపడిన భారతీయ జనతా పార్టీ 1990ల నాటి మండల్‌ ఉద్యమం దరిమిలా యూపీ, బిహార్‌లలో ప్రధాన శక్తిగా ఎదగలేకపోయింది. 2014 ఎన్నికల్లో ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతూ అగ్రవర్ణేతర హిందూ ఓట్లను ఆకర్షించింది. మంచి భవిష్యత్తు కోసం ఆశలు పెట్టుకున్న యువతరం కులాలకు అతీతంగా నరేంద్ర మోదీకి ఓటు వేసి ఎన్డీయే కూటమిని గెలిపించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 80 సీట్లకు 73, బిహార్‌లో 40 సీట్లకు 33 స్థానాలను ఎన్డీయేకి కట్టబెట్టారు. ఇంతకాలం తమ వెన్నంటి ఉన్న కుల ఓటు బ్యాంకులు భాజపావైపు మళ్ళడం తాత్కాలిక పరిణామమేనని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ), బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్‌పీ), రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్‌జేడీ), జనతా దళ్‌ యునైటెడ్‌ (జేడీయూ)లు భావించాయి.

తప్పిన అంచనా

ఓటర్లు 2019 ఎన్నికల్లోనూ భాజపావైపు మొగ్గడంతో ఎస్‌పీ, బీఎస్‌పీ, ఆర్‌జేడీ, జేడీయూలు తమ అంచనా తప్పని తెలుసుకున్నాయి. వివిధ సంక్షేమ పథకాలు, ముద్ర రుణాలు ఆశావహ, తటస్థ ఓటర్లను ఆకట్టుకున్నాయి. ఎంబీసీలు, దళితులకు ఎక్కువ సీట్లు ఇవ్వడం ద్వారా ఎన్‌డీఏ కూటమి బిహార్‌లో 39, యూపీలో 64 సీట్లు గెలుచుకోగలిగింది. ఆ ఎన్నికల్లో ఎస్‌పీ, బీఎస్‌పీ, ఆర్‌జేడీలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇలాగైతే తమ భవితకే ముప్పు అని ఆ పార్టీలు భయపడి, తమ వ్యూహాలను మార్చుకొంటున్నాయి. గతంలో అగ్ర కులాలను దుర్భాషలాడుతూ, దాన్ని గర్వకారణంగా భావించిన ఆర్‌జేడీ అందరికన్నా ముందు తన పంథా మార్చుకొంది. ఎన్నికల తరవాత మొట్టమొదటిసారిగా అగ్రవర్ణ రాజపుత్ర కులానికి చెందిన జగదానంద్‌ సింగ్‌ను ఆర్‌జేడీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. బ్రాహ్మణుడైన మృత్యుంజయ్‌ తివారీని ఆర్‌జేడీ జాతీయ ప్రతినిధిగా నియమించారు. బిహార్‌లో ఎంబీసీ కుర్మీల పార్టీగా ముద్రపడిన జేడీయూ తమ జాతీయ అధ్యక్షుడిగా అగ్రకులమైన భూమిహార్‌కు చెందిన లలన్‌ సింగ్‌ను ఎన్నుకొంది. ఇక బిహార్‌లో భాజపా 2020 నవంబరు అసెంబ్లీ ఎన్నికల తరవాత ఎంబీసీ కులాలకు చెందిన రేణూ దేవి, తార్‌ కిశోర్‌ ప్రసాద్‌లకు ఉపముఖ్యమంత్రి పదవులిచ్చింది. మరో ఎంబీసీ డాక్టర్‌ సంజయ్‌ జయస్వాల్‌ను బిహార్‌ భాజపా అధ్యక్షుడిగా నియమించారు. ఏతావతా బిహార్‌ ఆర్‌జేడీ, జేడీయూలలో అగ్ర కులస్థులు ప్రధాన పదవుల్లో ఉండగా, భాజపాలో ఎంబీసీలకు ప్రాధాన్యం పెరిగింది.

ఉత్తర్‌ ప్రదేశ్‌లో భాజపా ఓటు బ్యాంకుగా ఉన్న బ్రాహ్మణులు- 2017 అసెంబ్లీ ఎన్నికల తరవాత రాజపుత్ర కులస్థుడైన యోగీ ఆదిత్యనాథ్‌కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడంపై గుర్రుగా ఉన్నారు. రాష్ట్ర జనాభాలో 10శాతమైన బ్రాహ్మణులకు, 8.5శాతమైన రాజపుత్రులకు మధ్య చిరకాల వైరం ఉంది. బ్రాహ్మణ కులదైవం వంటి పరశురాముడి జయంతిని యోగి ప్రభుత్వం రద్దు చేయడం వంటి చర్యలు ఈ వర్గానికి ఆగ్రహం కలిగిస్తున్నాయి. యోగిని బ్రాహ్మణ వ్యతిరేకిగా పరిగణిస్తున్నారు. అయినా భాజపా తమ యూపీ శాఖ అధ్యక్ష స్థానంలో బ్రాహ్మణుడైన మహేంద్ర పాండేకు బదులు ఎంబీసీ కుర్మీ కులస్థుడు స్వతంత్ర దేవ్‌ సింగ్‌ను నియమించింది. ఉత్తర్‌ప్రదేశ్‌ జనాభాలో 45శాతం మేరకు ఉన్న యాదవేతర బీసీ కులాలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా భాజపా పావులు కదుపుతోంది.

వాగ్దానాల పరంపర

రాజపుత్ర యూపీ ప్రభుత్వంలో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని రుసరుసలాడుతున్న బ్రాహ్మణులను తమవైపు తిప్పుకోవడానికి ఎస్‌పీ, బీఎస్‌పీలు కృషి మొదలుపెట్టాయి. బీఎస్‌పీ జులై 23న అయోధ్యలో బ్రాహ్మణ సమ్మేళనం నిర్వహించి, అయోధ్యను అంతర్జాతీయ మతపరమైన పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేసింది. బ్రాహ్మణులు యోగి ఆదిత్యనాథ్‌పై కోపంతో భాజపాకు వ్యతిరేకంగా ఓటు వేయవచ్చునని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్‌ యాదవ్‌ సైతం అంచనా వేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే లఖ్‌నవూలో నిలువెత్తు పరశురామ విగ్రహం ఏర్పాటు చేస్తామని ఎస్‌పీ వాగ్దానం చేస్తోంది. యూపీలో ప్రధాన పార్టీలు ఉప ప్రాంతీయ కుల పార్టీలకు వాటి నిజ బలానికి మించి సీట్లు కట్టబెట్టాల్సి వస్తోంది. కుల ప్రాతిపదికన ఓట్లు ఆశిస్తున్న పార్టీలు వాటిలో కొన్నింటిని గెలుచుకున్నాక ప్రత్యర్థి శిబిరంలోకి మారిపోతుంటాయి. అందుకే బీసీ, దళిత కులాలకు ప్రాధాన్యమిచ్చి, కులాల ఓటు బ్యాంకులను లక్ష్యంగా చేసుకుంటున్న పార్టీలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. బిహార్‌లో ఆర్‌జేడీకి 32శాతం, జేడీయూకు 18శాతం, భాజపాకు 15శాతం స్థిర ఓటు బ్యాంకులు ఉన్నాయి. వీటిలో ఏ రెండు కలిసినా మూడో పార్టీ ఓడిపోవడం ఖాయం. ఈ పరిస్థితిలో యూపీ, బిహార్‌లలో కేవలం సంప్రదాయ కుల సమీకరణల మీదే ఆధారపడటం మంచిది కాదని, ఇతర వర్గాలను ఆకట్టుకోవడం ద్వారానే విజయం సాధించగలమనే భావన పెరుగుతోంది. కులానికి కాకుండా అభివృద్ధి, సంక్షేమాలకే ప్రాధాన్యమిచ్చే తటస్థ, ఆశావహ ఓటర్లు ఎన్నికల్లో జయాపజయాలు నిర్ణయించడంలో కీలకంగా మారుతున్నారు. వీరి సంఖ్య పెరిగితే భావి రాజకీయ సమీకరణలు సమూలంగా మారిపోతాయి.

- రాజీవ్‌ రాజన్‌
 

Posted Date: 06-09-2021గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం