• facebook
  • whatsapp
  • telegram

కమలదళంతో అమీతుమీకి సై!

దిల్లీపై కన్నేసిన దీదీ

పశ్చిమ్‌ బంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఇటీవల తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలనుకుంటున్న దీదీ ఆకాంక్షకు ఇది అద్దం పడుతోంది. కొన్నాళ్లుగా దీనికి సంబంధించిన సంకేతాలు వెలువడుతూనే ఉన్నాయి. మమతా బెనర్జీ జులై 21న అమరుల సంస్మరణ ర్యాలీ నిర్వహించడం 28 ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ. 1993లో నాటి వామపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ యువ కార్యకర్తలు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారి పోలీసుల కాల్పులకు దారితీసింది. ఆ తరవాత జరిగిన పరిణామాలతో నాడు రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో మమత కీలక నేతగా ఆవిర్భవించారు. ఆ తరవాత సొంత పార్టీని స్థాపించి వామపక్షాల కంచుకోటను బద్దలుకొట్టారు. అమరుల సంస్మరణ ర్యాలీని దీదీ ఇన్నేళ్లుగా రాజకీయంగానూ ఉపయోగించుకుంటూ వస్తున్నారు. పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు తన భవిష్యత్తు కార్యాచరణను అదే వేదికగా అనేకమార్లు ప్రకటించారు. వామపక్ష కూటమి, ముఖ్యంగా సీపీఐ(ఎం)పై ఎన్నోసార్లు విరుచుకుపడ్డారు. కరోనా నిబంధనల కారణంగా వరసగా రెండో ఏడాదీ జులై 21 ర్యాలీని వర్చువల్‌గా నిర్వహించారు. అయితే ఎప్పుడూ వామపక్షాలపై నిప్పులు చెరిగే దీదీ, ఈసారి వారి ప్రస్తావనే లేకుండా ప్రసంగాన్ని ముగించారు! ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్‌పైనా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

అయిదు రోజుల కిందట జరిగిన ర్యాలీలో మమత తన అస్త్రాలన్నీ భాజపాపైనే ఎక్కుపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మొదలుకొని భాజపా శ్రేణులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కరోనా సంక్షోభం, పెగాసస్‌ వ్యవహారం, పెట్రోల్‌ ధరలు, ఆర్థిక అంశాలను లేవనెత్తి భాజపా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కరోనాను కట్టడి చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఘన విజయంతో మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మమత, 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. కేంద్రంలో భాజపాయేతర కూటమి కోసం ఆమె గళమెత్తడమే దీనికి నిదర్శనం. ఈ క్రమంలో ఆప్‌, డీఎంకే, అకాలీదళ్‌, ఎన్‌సీపీతో పాటు ఇతర రాజకీయ పార్టీలను ప్రస్తావించారు. ‘త్వరలో దిల్లీకి వెళ్తాను. అన్ని పార్టీల నేతలను కలుస్తాను’ అని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పని మొదలుపెట్టాలి, సమయాన్ని వృథా చేయాకూడదు అని అమరుల సంస్మరణ ర్యాలీ వేదికగా దీదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆ రోజున దిల్లీ కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ప్రత్యక్ష ప్రసారమైన మమత ప్రసంగాన్ని వివిధ పార్టీలకు చెందిన చిదంబరం, దిగ్విజయ్‌ సింగ్‌, శరద్‌ యాదవ్‌, మనోజ్‌ ఝా, సుప్రియా సూలే, జయా బచ్చన్‌, రామ్‌ గోపాల్‌ యాదవ్‌ వంటి సీనియర్‌ నేతలు వీక్షించడం గమనార్హం.

ప్రతిపక్షాలపై నిఘా పెట్టడం, బల ప్రదర్శన చేయడమే కమలదళానికి చేతనవుతుందని మమత తన ప్రసంగంలో ఆరోపించారు. అలాంటి వారికి బెంగాల్‌ ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పారంటూ తమ పార్టీ ఇటీవలి విజయాన్ని గుర్తుచేశారు. అన్యాపదేశంగా మోదీ-షాలకు ప్రత్యామ్నాయ నేతను తానేనన్న సంకేతాలూ ఇచ్చారు. ఈ క్రమంలో తమ ఎన్నికల నినాదమైన ‘ఖేలా హోబే’(ఆట కొనసాగుతుంది)ను గుర్తుచేసుకున్నారు. కేంద్రం నుంచి భాజపాను దింపేంతవరకూ ఆట కొనసాగుతుందని తేల్చిచెప్పారు. అయితే, ఈ ఆటలో ఆమెకు మద్దతుగా ప్రతిపక్ష, తటస్థ పార్టీలు ఎంత వరకు కలిసివస్తాయన్నదే ఆసక్తికరం. మమత తన ప్రసంగంలో వామపక్షాలను పక్కనపెట్టడానికి మరో బలమైన కారణం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పశ్చిమ్‌ బంగలో కాంగ్రెస్‌, వామపక్షాల నుంచి తనకు ముప్పు లేదని ఆమెకు అర్థమైంది. ఇప్పుడు రాష్ట్రంలో దీదీకి భాజపా మాత్రమే సవాలు విసరగలిగే స్థాయిలో ఉంది. ప్రతిపక్ష హోదాను సంపాదించుకున్న కమలదళం, మమతను ముప్పుతిప్పలు పెట్టడానికి ప్రయత్నిస్తోంది. రాష్ట్రస్థాయిలో వాళ్లకు అడ్డుకట్ట వేయడంతో పాటు జాతీయ రాజకీయాలపైనా తనదైన ముద్ర వేయాలన్న సంకల్పంతోనే ఆమె భాజపాపై ప్రధానంగా దృష్టిపెట్టారు. భాజపాకు బలమైన ప్రత్యామ్నాయ వేదికను నిర్మించే పనిని ముమ్మరం చేశారు. పశ్చిమ్‌ బంగలో తన పీఠాన్ని సుస్థిరం చేసుకుంటూనే హస్తినాపురంలో పాగా వేసే దిశగా అడుగులు ముందుకేస్తున్న మమత సఫలీకృతమవుతారా అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి!

- దీపాంకర్‌ బోస్‌
 

Posted Date: 26-07-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం