• facebook
  • whatsapp
  • telegram

బెంగాల్‌లో హింసా రాజకీయాలు

ప్రతిపక్షాల అణచివేతలో దీదీ దూకుడు

ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌ తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల హోరులో బెంగాల్‌ స్థానిక సంస్థల ఎన్నికలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ (టీఎంసీ) ప్రతిపక్షాలను తుడిచిపెట్టి- పురపాలక సంస్థలన్నింటినీ గంపగుత్తగా చేజిక్కించుకుంది. భారతీయ జనతా పార్టీ కానీ, సీపీఐ (ఎం) కానీ తృణమూల్‌కు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయాయి. గతంలో బెంగాల్‌ శాసన సభ ఎన్నికల్లో పెద్దయెత్తున ఆర్భాటం చేసిన భాజపా రాష్ట్ర శాఖ స్థానిక ఎన్నికల్లో తగిలిన దెబ్బకు కకావికలమైంది. భాజపా కేంద్ర నాయకత్వం సైతం ఏ కారణంవల్లనో బెంగాల్‌ శాఖ అతీగతీ పట్టించుకోవడం మానేసింది. పాలక తృణమూల్‌ ఒత్తిళ్లను తట్టుకోలేక బెంగాల్‌ భాజపా కార్యకర్తలు, నాయకులు దిక్కులేనివారై చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురవుతున్నారు. పాలక పార్టీ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో హింసాదౌర్జన్యాలకు ఒడిగడుతున్నా, ప్రజాస్వామ్యానికి పాతరేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.

పురపాలక ఎన్నికల్లో గెలవడానికి తృణమూల్‌ ఇంత యాగీ చేయనక్కర్లేదు. గెలుపు ఆ పార్టీదేనని అందరికీ తెలుసు. అయినా రాష్ట్రంలో ప్రతిపక్షమనేదే లేకుండా చేయాలనే అహంకారంతో ‘దీదీ’ పంతం పట్టారు. పాలక తృణమూల్‌ కార్యకర్తలు ప్రజాస్వామ్యాన్ని కాలరాచి పట్టపగ్గాలు లేకుండా ప్రతిపక్షాలపై దాడులకు పాల్పడుతున్నారు. పోలీసులు, అధికార యంత్రాంగం ఏమీ పట్టనట్లు ఉండిపోయారు. అక్కడ రాజ్యసభ నామినేటెడ్‌ సభ్యుడు, ప్రముఖ పాత్రికేయుడు స్వపన్‌ దాస్‌ గుప్తా ఒక ఉదంతాన్ని వెలుగులోకి తెచ్చారు. హుగ్లీ జిల్లాలోని ఒక చిన్న పట్టణంలో భాజపాకు చెందిన ఓ మహిళా కార్యకర్తను తృణమూల్‌ గూండాలు ఎంతగా యాతనపెట్టారో వెల్లడించారు. వార్డులో తనకు మంచి పేరు ఉన్నందువల్ల పురపాలక సంఘ ఎన్నికల్లో ఆమె నామినేషన్‌ వేశారు. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తృణమూల్‌ కార్యకర్తలు బెదిరించినా ఆమె లొంగలేదు. ఆమె సన్నిహిత నేస్తాన్ని ఆ కార్యకర్తలు దారుణంగా కొట్టారు. మరునాడు వాళ్లు మహిళ ఇంటికి వచ్చి నామినేషన్‌ వెనక్కు తీసుకోకపోతే ఆమె పసి బిడ్డను అంతం చేస్తామని బెదిరించారు. అక్కడికీ ఆమె లొంగకపోవడంతో రెండు రోజుల తరవాత ఇంటికొచ్చి ఆమె బిడ్డను తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చి తృణమూల్‌ గూండాలను అడ్డుకున్నారు. అయినా, ‘నామినేషన్‌ ఉపసంహరించుకోకపోతే నీ బిడ్డ నీకు దక్కడు...’ అంటూ వారు హెచ్చరించారు. తనకు అండగా నిలిచేవారెవరూ లేకపోవడంతో చివరికి ఆ మహిళ పోటీ నుంచి వైదొగలక తప్పలేదు.

టీఎంసీలో గతంలో కార్యకర్తలుగా ఉన్న వారే రాజకీయాల్లో ఎదిగి ఆధిపత్య పోరాటాలకు దిగుతున్న సంఘటనలూ కలవరం కలిగిస్తున్నాయి. ఆ మధ్య తృణమూల్‌కు చెందిన బర్షాల్‌ గ్రామ పంచాయతీ ఉపప్రధాన్‌ బాదుషేక్‌ను కొందరు కిరాతకంగా హతమార్చారు. వెంటనే గుమిగూడిన అతడి అనుచరగణం దేశవ్యాప్తంగా అందరూ విస్తుపోయేలా తీవ్రమైన నరమేధానికి ఒడిగట్టింది. ప్రత్యర్థి వర్గానికి చెందిన సోనా షేక్‌కు సంబంధించిన వారి ఇళ్లపై  మూకలు దాడులు చేసి చిన్నారులు, మహిళలు అన్న భేదం లేకుండా అందరినీ తీవ్రంగా హింసించాయి. ఆగంతకులు పలు ఇళ్లకు నిప్పు పెట్టి- కొందరిని సజీవ దహనం చేశారు. అంతటి మారణహోమానికి కారకుడైన వ్యక్తిని అరెస్టు చేసేందుకూ పోలీసులు మీనమేషాలు లెక్కించారు. పశ్చిమ్‌బెంగాల్‌లో శాంతిభద్రతలకు పట్టిన దుర్గతి ఎలాంటిదో ఈ ఉదంతమే కళ్లకు కడుతోంది. తృణమూల్‌ ఆగడాలు కొత్తవి కావు. అంతకుముందు కమ్యూనిస్టు కార్యకర్తలూ దౌర్జన్యాలు చేసేవారు. మమత, తృణమూల్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు 30 ఏళ్లపాటు ఈ దురాగతాలను భరించారు. తృణమూల్‌ను గెలిపిస్తే దౌర్జన్యకాండ నుంచి విముక్తి దొరుకుతుందనే ఆశతో బెంగాల్‌ ఓటర్లు ఆమెకు పట్టంకట్టారు. చివరకు ఆమె మళ్ళీ పాత కథనే పునరావృతం చేశారు. చిన్న వ్యాపారులు, ఫ్యాక్టరీ కార్మికులు, వీధి వర్తకుల నుంచి తృణమూల్‌ కార్యకర్తలు మామూళ్లు వసూలు చేస్తుంటారు. గతంలో కమ్యూనిస్ట్‌ పార్టీల్లో ఉన్నవారే నేడు తృణమూల్‌ కార్యకర్తలుగా మారారు. ఆర్‌ఎస్‌ఎస్‌-భాజపాలు బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొన్న తరవాత చేతులు దులిపేసుకున్నాయి. సాధారణ బెంగాలీలను పట్టించుకోవడం మానేశాయి. బెంగాల్‌లో మైనారిటీల జనాభా పెరుగుతున్నందువల్ల మెజారిటీ ప్రజల్లో పెద్దయెత్తున వ్యతిరేకత వచ్చి అస్సామ్‌లో మాదిరిగా బెంగాల్‌లోనూ తమను గెలిపిస్తారని భాజపా ఆశపెట్టుకున్నట్లు కనిపిస్తోంది. అప్పటివరకు చేతులు కట్టుకుని కూర్చోవడానికే అది మొగ్గు చూపుతున్నట్లుంది. అటువంటి ఆశలు రాజకీయాల్లో పనిచేయవని భాజపా గుర్తించాలి.

- వీరేంద్ర కపూర్‌ 

(సామాజిక, రాజకీయ విశ్లేషకులు)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ముట్టడి వ్యూహంతో ముందుకు

‣ భూసారం... ఆహార భద్రతకు వరం!

‣ సరిహద్దు వివాదాల పీటముడి

‣ దశాబ్దాల నిర్లిప్తత... కుదేలైన అక్షరాస్యత!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 05-04-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం