• facebook
  • whatsapp
  • telegram

సమాఖ్య స్ఫూర్తికి విఘాతం

‘ఒకే దేశం - ఒకే ఎన్నిక’ సాధ్యమేనా?

ప్రధాని నరేంద్రమోదీ రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దేశం మొత్తాన్ని ఏకసూత్ర ప్రాతిపదికగా సంస్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ‘ఒకే దేశం-ఒకే విధానం’ అనే సూత్రాన్ని చాలా అంశాలకు అన్వయిస్తూ ముందుకు సాగుతున్నారు. పలు పెద్ద రాష్ట్రాలు, 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ప్రతి విషయంలోనూ ఒకే విధానాన్ని అనుసరించడం పాలన కేంద్రీకృతం కావడానికి తోడ్పడుతుంది తప్ప- వివిధ ప్రాంతాల వాస్తవ ప్రగతికి దోహదం చేయదు. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం చెల్లుబాటు అయ్యేలా వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ని అమలులోకి తీసుకురావడం నుంచి వివిధ అంశాల్లో ఇటువంటి ప్రయత్నాలే జరుగుతున్నాయి. ప్రజాపంపిణీ, ఉపరితల రవాణా శాఖల పరిధిలో తీసుకువస్తున్న ఏకీకృత విధానాలు కొంతవరకూ ప్రజలకు ఉపయుక్తంగా ఉండే అవకాశముంది. ఇదే విధానం ఎన్నికలకూ విస్తరిస్తే మాత్రం అది మన పార్లమెంటరీ వ్యవస్థకు, సమాఖ్య స్ఫూర్తికి ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది. కొన్ని నెలలుగా ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

సవరణలు తప్పనిసరి

దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలను 2023 లేదా 2024లో నిర్వహించడానికి కేంద్రంలోని భాజపా ప్రభుత్వం సిద్ధమవుతోందని, న్యాయపరమైన సమస్యల పరిష్కారంపై దృష్టి సారించిందని రాజకీయ పక్షాల్లో చర్చ సాగుతోంది. ఈ రెండేళ్లలోనూ దేశవ్యాప్తంగా చట్టసభలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణ అసాధ్యమనే చెప్పాలి. పదవీకాలమున్న శాసనసభలను అర్ధాంతరంగా రద్దు చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ప్రస్తుత లోక్‌సభ పదవీకాలం 2024 మే వరకూ ఉంది. వచ్చే ఏడాది జమిలి ఎన్నికలు నిర్వహించాలనుకుంటే 2024లో ఎన్నికలు జరగాల్సిన ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, హరియాణా, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, ఒడిశా, సిక్కిమ్‌లను ముందస్తుకు ఒప్పించాలి. వాటితో పాటు లోక్‌సభకు ఎన్నికలు జరపాలి. ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌, తెలంగాణ, త్రిపుర శాసనసభలకు వచ్చే ఏడాది ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. 2024లోనే జమిలి ఎన్నికలు నిర్వహించాలనుకుంటే- 2025లో ఎన్నికలు జరగాల్సిన దిల్లీ, బిహార్‌లను ముందస్తుకు ఒప్పించాలి. కొన్ని రాష్ట్రాల శాసనసభల కాలాన్ని పొడిగించాలి. ఈ రెండు మార్గాలు మినహా దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీలనూ లోక్‌సభతో ముడిపెట్టడానికి వీలు కాదు. అన్ని రాష్ట్రాల అసెంబ్లీలనూ రద్దుచేసి జమిలి ఎన్నికలను నిర్వహించాలనుకుంటే అది రాజకీయంగా భాజపాకు నష్టదాయకమే అవుతుంది. జమిలి కోసం రాజ్యాంగపరంగా కొన్ని సవరణలు చేయాల్సి ఉంటుంది. లోక్‌సభ కాలపరిమితికి సంబంధించి ఆర్టికల్‌ 83, రద్దుకు ఆర్టికల్‌ 85; శాసనసభల కాలపరిమితికి ఆర్టికల్‌ 172, రద్దుకు ఆర్టికల్‌ 174; రాజ్యాంగ యంత్రాంగ వైఫల్యానికి సంబంధించిన ఆర్టికల్‌ 356తో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టం 1951ని సవరించాలి. వాటిని రాష్ట్రాలు ఆమోదించాలి. దేశంలో ఎనిమిది జాతీయ స్థాయి, 53 రాష్ట్రస్థాయి గుర్తింపు పొందిన రాజకీయ పక్షాల్లో సింహభాగం ఈ జమిలి ఎన్నికలకు సుముఖత వ్యక్తం చేయాలి. ఆ ప్రక్రియ పూర్తయితే తప్ప ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ సాధ్యం కాకపోవచ్చు. పార్లమెంటు స్థానాల పెంపుపై ఉన్న నిషేధం 2026తో పూర్తవుతుంది. అనంతరం జరిగే జనగణన ఆధారంగా వాటిని పునర్వ్యవస్థీకరించాలని 84వ రాజ్యాంగ సవరణ చెబుతోంది. దీన్ని సవరించి 2021 జనగణన ఆధారంగా లోక్‌సభ స్థానాలను పునర్‌ వ్యవస్థీకరించాలనుకుంటే తాజా జనాభా లెక్కలు రావాలి. నిరుడు నిర్వహించాల్సిన జనగణనను కొవిడ్‌ మూలంగా వాయిదావేసి... ఈ ఏడాది ప్రారంభించినా ఇంకా జోరందుకోలేదు. 2024 నాటికి గానీ ఈ ఫలితాలు వచ్చే అవకాశం లేదు. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు స్థానాల సంఖ్య ఆధారపడినందువల్ల కుటుంబ నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించిన దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలు తగ్గిపోతాయనే వాదన ఉంది. ఈ పరిస్థితుల్లో జమిలి ఎన్నికల యత్నం కేంద్రంలోని అధికార పక్షానికి మేలు కంటే కీడే ఎక్కువ చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

ప్రాంతీయ పార్టీలకు ప్రమాదం

జమిలి ఎన్నికలు జరిగినప్పుడు సాధారణంగా దేశ ఆర్థిక పరిస్థితి, ధరలు, ద్రవ్యోల్బణం, రక్షణ తదితర అంశాలపైనే ఓటర్ల దృష్టి, రాజకీయ చర్చ కేంద్రీకృతమవుతుంది. రాష్ట్ర, ప్రాంతీయ సమస్యలు మరుగునపడతాయి. ఫలితంగా రాష్ట్ర రాజకీయాలను ఆసరాగా చేసుకుని ఏర్పాటైన ప్రాంతీయ పార్టీల భవితవ్యం ప్రశ్నార్థకమవుతుంది. జాతీయ, రాష్ట్రస్థాయిలో ఏ ఒక్క రాజకీయ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి అవసరమైన స్థానాలు రాకపోతే సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటు తప్పనిసరి. సంకీర్ణ ప్రభుత్వాలకు స్థిరత్వం తక్కువని మన అనుభవాలు చెబుతున్నాయి. ప్రభుత్వాలు అర్ధాంతరంగా కూలిపోకుండా పూర్తికాలం కొనసాగించే విధానాలపై స్పష్టత లేదు. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి, వాటికి రాజ్యాంగంలో చోటు కల్పించాలి. అంతకు ముందు ఎన్నికల సంస్కరణలు తప్పనిసరి. ‘జమిలి’ వల్ల విభిన్న పక్షాలు కలిసి ఏర్పడిన కూటములకు మాత్రమే రాష్ట్రాల స్థాయిలో మనుగడ ఉంటుంది. ప్రజాదరణ పొందలేని పార్టీలు తెరమరుగు అవుతాయి. క్రమంగా అమెరికా, బ్రిటన్‌ మాదిరిగా కొన్ని పార్టీలే మిగిలి, బహుళ పార్టీ వ్యవస్థ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఇది ఒక రకంగా అధికారం కేంద్రీకృతం అయ్యేందుకు, అధ్యక్ష తరహా పాలన వ్యవస్థకు దారితీసే అవకాశముంది.

భారీ ప్రక్రియ

దేశంలో 90 కోట్లకు పైగా ఓటర్లు, భారీ సంఖ్యలో రాజకీయ పక్షాలు, లక్షల మంది అభ్యర్థులు పాల్గొనే భారత ఎన్నికల క్రతువు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియ. పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తులు, శాసనసభలు, శాసన మండళ్లు, లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు ఎన్నికలు జరుగుతుంటాయి. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు భారీస్థాయిలో యంత్రాంగం తప్పనిసరి. ఎన్నికల వ్యయం పెరుగుతుండటం, రాష్ట్రాల్లో ఎన్నికల వల్ల అమలులోకి వచ్చే ప్రవర్తన నియమావళి కొత్త పథకాలకు అడ్డుగోడగా నిలవడంవంటి కారణాలను చూపుతూ- భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల దిశగా ఆలోచిస్తోంది. ఇంత పెద్ద దేశంలో ఒకే విడతలో చట్టసభలకు ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సాహసమే.

ప్రశ్నార్థకంగా స్థిరత్వం

జమిలి ఎన్నికలు దేశానికి కొత్త కాదు... రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరవాత 1951-52, 1957, 1962, 1967ల్లో పార్లమెంటుకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించారు. 1968, 69లలో కొన్ని శాసనసభలకు, 1971లో లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. అప్పటి నుంచి జమిలి ఎన్నికల నిర్వహణకు గండిపడింది. గతంలో శాసనసభలు, లోక్‌సభలు అర్ధాంతరంగా రద్దయ్యాయి. ప్రస్తుతం గణనీయంగా మారిన రాజకీయ, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో చట్టసభల స్థిరత్వం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఎన్నికలు లేకుండా అధికారమార్పిడి విధానం సైతం పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఇబ్బందికరంగానే తయారైంది.

- ఎం.కృష్ణారావ్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కుదరని కూర్పు

‣ పరిశోధనలే దన్నుగా పురోగమనం

‣ మాల్దీవులతో స్నేహబంధం

‣ మూడో ప్రపంచ యుద్ధ భయం!

‣ మిగ్‌ పాపం ఎవరిది?

‣ పశ్చిమాసియాలో ఆధిపత్య పోరు

Posted Date: 09-08-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం