• facebook
  • whatsapp
  • telegram

రాజ్యాంగ ప్రమాణాలకు పెనుముప్పు

జనవరి 26... మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. గణతంత్ర రాజ్యంగా భారతదేశం ఆవిర్భవించిన రోజు. డెభ్భై నాలుగో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతి నిర్మాతలకు నివాళులు అర్పిస్తూనే- మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రధానాంశం ఒకటి ఉంది. భారతదేశంలో నేడు ఏ ప్రాంతంలో పాలన రాజ్యాంగబద్ధంగా సాగుతోందన్నదే ఆ ప్రశ్న. ‘ఎక్కడా లేదు’ అనేదే దానికి సమాధానం!

అసత్యాలు, అర్ధసత్యాలను విశ్వసించడం అజ్ఞానమని అందరికీ తెలుసు. కానీ, వాస్తవాలను అంగీకరించేందుకు చాలామందికి మనసు రాదు. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యం దేశీయంగా ఎండమావిని తలపిస్తోందన్న నిష్ఠుర సత్యాన్ని అయితే నేటి రాజకీయ నేతలెవరూ దాదాపుగా ఒప్పుకోరు!

‘రాజ్యం తన విశేషమైన అధికారాలతో జాతీయ సమగ్రతను పెంచగలదు... అన్ని రకాల విచ్ఛిన్నకర శక్తులనూ ప్రోత్సహించగలదు... వలసవాద రాజ్యం రెండో దాన్ని ఎంపిక చేసుకుంది’ అంటారు ప్రఖ్యాత చరిత్రకారులు బిపిన్‌చంద్ర. స్వాతంత్య్రానంతర కాలంలో నల్లదొరలు అందుకు భిన్నంగా ఏమైనా వ్యవహరించారా? ప్రభుత్వాలే పనిగట్టుకుని మరీ రాజ్యాంగ విలువలను ఒక్కొక్కటిగా ధ్వంసం చేస్తూ వస్తున్నాయన్నది నిజం కాదా? అందుకే దేశంలో న్యాయాన్ని నేడు గొప్ప ఆదర్శంగా భావించాల్సి వస్తోంది. సమానత్వమనేది ఊహలకే పరిమితమవుతోంది. అసలు ఆ మాటే మన ప్రజాస్వామ్య నిఘంటువు నుంచి మాయమైపోతోంది. సౌభ్రాతృత్వం అల్లరి పాలవుతోంది. అందుకే 2022 ఉదారవాద ప్రజాస్వామ్య సూచీలో 179 దేశాల్లో ఇండియా 93వ స్థానానికి పరిమితమైంది.

అసమానతల భారతం

భారతీయులందరూ తమ శక్తిసామర్థ్యాలకు అనుగుణంగా ఎదిగేందుకు రాజ్యం అన్ని అవకాశాలనూ కల్పించాలన్నది సంవిధాన ప్రబోధం. పాలకుల కార్యాచరణలో అది పక్కకెళ్ళిపోవడంతో ప్రజల మధ్య అసమానతలు తీవ్రస్థాయిలో పెచ్చరిల్లుతున్నాయి. దేశీయంగా మొత్తం సంపదలో దాదాపు నలభైశాతం- జనాభాలో ఒక శాతం మేరకే ఉండే శ్రీమంతుల చేతుల్లోనే కేంద్రీకృతమైనట్లు ఆక్స్‌ఫామ్‌ నివేదిక ఇటీవలే వెల్లడించింది. అదే సమయంలో యాభైశాతం ప్రజావళికి కేవలం మూడు శాతం సంపద మాత్రమే మిగిలింది. తత్ఫలితంగా పరపీడనా సంకెళ్లను తెంచుకుని ఏడున్నర దశాబ్దాలు గడచిపోయినా- నేటికీ సగటు భారతీయుడికి ఆర్థిక స్వాతంత్య్రం అందని ద్రాక్షే అవుతోంది. పూటకింత తిండిలేక కడుపులో కాళ్లు ముడుచుకుని పడుకుంటున్న దురదృష్టవంతుల వెతలూ ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మనమెంత అభివృద్ధి సాధించినా సరే- దేశంలో ఆకలి చావులు సంభవిస్తూనే ఉన్నాయంటూ సుప్రీంకోర్టు నిరుడు ఆవేదనాత్మకంగా స్పందించింది. అలా వృద్ధి రేట్లు, జీడీపీ లెక్కల మాటున మసిబారిపోతున్న బతుకుల గురించి ప్రభుత్వాలు ఏమైనా ఆలోచిస్తున్నాయా? వ్యక్తులూ వర్గాల నడుమ అవకాశాలూ ఆదాయాల్లో అసమానతలను రూపుమాపడానికి రాజ్యం కృషిచేయాలని 38వ రాజ్యాంగ అధికరణ ఉద్బోధిస్తోంది. పాలకులు ఎవరైనా సరే, దానికి పట్టంకట్టడం లేదు. ఆ పని మానేసి వట్టిగా రాజ్యాంగం గొప్పదనం గురించి మూస ఉపన్యాసాలను వల్లెవేసేందుకు మాత్రం ఎందరో తెగ ఉత్సుకత చూపుతుంటారు. ఎండిన మానుకు ఎర్రపూలు అలంకరించినంత మాత్రాన దానికి జీవకళ వచ్చేయదు. పేదరికం కబంధ హస్తాల్లోంచి సామాన్యులను బయటపడేయలేని ఆర్థికాభివృద్ధీ అటువంటిదే! దానివల్ల విశాల జనభారతానికి కలిగే వాస్తవ లబ్ధి ఏమీ ఉండదు.

సార్వత్రిక వయోజన ఓటుహక్కు ప్రాతిపదికన ప్రజలే ప్రభుత్వాలను కొలువుతీర్చాలన్నది రాజ్యాంగ నిర్దేశం. కానీ, దేశవ్యాప్తంగా అన్ని చోట్లా అలాగే జరుగుతోందా? ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రజాప్రతినిధులకు ప్రలోభాల ఎరవేస్తున్నారు. వివిధ పార్టీల వారిని ఒక గంపకు కిందకు చేర్చి సర్కార్లను నిలబెడుతున్నారు. ప్రజల కోసం ప్రజల చేత ప్రజల ద్వారానే ప్రభుత్వాలు ఏర్పాటుకావాలన్న రాజ్యాంగ మౌలిక లక్ష్యానికి అది విరుద్ధమే కదా? రాజ్యాంగ నిర్మాతలు ప్రత్యక్ష ఎన్నికలను సామాజిక విప్లవానికి మూలస్తంభాలుగా భావించారు. కానీ, సమకాలీన రాజకీయ నాయకులేమో తమ అధికార దాహాన్ని, ధన వ్యామోహాన్ని తీర్చేందుకు అక్కరకొచ్చే సాధనాలుగా ఎన్నికలను భావిస్తున్నారు. స్వాభిమానం లేనివాళ్లు, గెలవడానికి ఎన్ని అడ్డదారులు తొక్కడానికైనా సిద్ధపడేవాళ్లు ఎన్నికల్లో అభ్యర్థులు కాకూడదన్నది ప్రథమ ప్రధాని నెహ్రూ అభిలాష. కానీ, నేడు ఎన్నికల బరిలో నిలుస్తున్న వాళ్లలో చాలామంది ఆ బాపతు మనుషులే. మంచినీళ్ల ప్రాయంగా సొమ్ములను వెదజల్లగలిగిన వ్యక్తులు, నేరచరితులను వెతుక్కొచ్చి మరీ పార్టీలు టికెట్లు కట్టబెడుతున్నాయి. అటువంటి వాళ్లు విజయం సాధించిన తరవాత స్వలాభాల మీద పేరాశతో మూకుమ్మడిగా గోడలు దూకుతున్నారు! అలా రాజకీయాల్లో విలువలు పతనమైపోతే- అటు సమాఖ్యతత్వం వంటి రాజ్యాంగ ప్రమాణాలూ పెళ్లగింపునకు గురవుతున్నాయి. రాజ్‌భవన్లలో తమ అంతేవాసులను కూర్చోబెట్టి, రాష్ట్ర ప్రభుత్వాల మీద స్వారీ చేసే పిదపబుద్ధులకు కేంద్ర పాలకపక్షాలు దూరం కావడం లేదు. ఆయా పార్టీల అవకాశవాదం, సంకుచితత్వాల మూలంగా రాజ్యాంగబద్ధమైన సంస్థల విశ్వసనీయత సైతం అడుగంటిపోతోంది.

హక్కుల చైతన్యంతో...

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ వ్యాఖ్యానించినట్లు- ప్రజాస్వామ్యమంటే కేవలం ఒక ప్రభుత్వ రూపం కాదు. ప్రాథమికంగా దానికి  అర్థం... ప్రజలంతా కలిసిమెలిసి జీవించడం. సాటి మనుషుల పట్ల గౌరవ మర్యాదలతో మెలగడం. విద్వేష రాజకీయాల పుణ్యమా అని జనంలో ఆ సుహృద్భావం బీటలు వారుతోంది. దేశ భద్రతకు అది ఎంతమాత్రం క్షేమదాయకం కాదు. ఒక్కసారి ఓటు వేసినంత మాత్రాన ప్రజల బాధ్యత అక్కడితో ముగిసిపోదు. కుల మత ప్రాంతాల రంగుటద్దాలను ధరించకుండా ప్రభుత్వాల చేతలను కనిపెడుతూ ఉండాలి. పెడ పాలన పోకడలను అడ్డుకోవడానికి సంఘటిత ప్రజాఉద్యమాలు దోహదపడతాయని గుర్తించాలి. హక్కుల చైతన్యంతో ప్రజావిఘాతకర ధోరణులను ఎక్కడికక్కడ అడ్డుకోవాలి. దుర్విచక్షణలు, బలహీనులపై బలవంతుల దౌర్జన్యాలు, దోపిడి పర్వాల సమాహారంగా భారతీయ సామాజిక వ్యవస్థ కునారిల్లుతోంది. అందులో మౌలిక మార్పును తీసుకురావడం ప్రభుత్వాల విధ్యుక్తధర్మం. ఆ విధినిర్వహణలో అవి విఫలమైతే, పండిత నెహ్రూ హెచ్చరించినట్లు- కాగితం మీద రాసుకున్న రాజ్యాంగ నిబంధనలన్నీ పనికిరానివీ, అర్థం లేనివే అవుతాయి!

విభజన  రాజకీయాలు

‘మొత్తం రాజకీయ ఆర్థిక అధికారాలను రాజ్యం తన గుప్పిటపట్టిన చోట ధర్మం దారితప్పుతుంది’ అన్నది పండిత దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ హెచ్చరిక!  దాన్ని మన్నించని ప్రభుత్వాలు ఎక్కడికక్కడ అపరిమిత అధికారాలను చలాయిస్తున్నాయి. రాజ్యాంగబద్ధమైన భావప్రకటనా స్వేచ్ఛను కరకు ఆంక్షల చట్రంలో బిగిస్తున్నాయి. మూక మనస్తత్వాన్ని రెచ్చగొడుతున్న నాయకగణాలు- ఆలోచనాపరులపై దాడులకు పురిగొల్పుతున్నాయి. విమర్శలను సహించలేనితనంతో ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు వంటి పత్రికా స్వేచ్ఛకూ పొగపెడుతున్నాయి. తమ వాస్తవ సమస్యల గురించి ప్రజలు ఆలోచించకూడదన్న కుటిల వ్యూహంతో మతతత్వం, కులతత్వాలను నేతలు ఎగదోస్తున్నారు. సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం సమాజ ఐక్యతను దెబ్బతీస్తున్నారు. చట్టబద్ధమైన పాలనకు నీళ్లొదులుతూ నిరంకుశ రాజ్యాలను ఏలుతున్నారు. ఏపీలోని జగన్‌ సర్కారు ఇటీవలే జీఓ నంబర్‌ ఒకటితో తెల్లదొరల కాలం నాటి పోలీస్‌ చట్టానికి కొత్త కోరలు తొడిగింది. మనదైన రాజ్యాంగాన్ని రాసుకుని దశాబ్దాలు గడచిపోయినా- ఆంగ్లేయుల దమననీతికి ఇంకా దేశంలో నూకలు చెల్లనేలేదనడానికి అదే సాక్ష్యం!

- ఎన్‌.కె.శరణ్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

ఓటు... ప్రజాస్వామ్య జీవనాడి!

‣ మహాసాగరంలో ఆధిపత్యపోరు

‣ పచ్చని ఉదజని తోడుంటే...

‣ మిన్నంటుతున్న ఆకలి కేకలు

‣ రాజ్యాంగమే సర్వోన్నతం!

‣ మధ్యతరగతి ఆశల పద్దు

‣ అమృత కాలానికి పటిష్ఠ మార్గం

Posted Date: 27-01-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం