• facebook
  • whatsapp
  • telegram

ఒక అభ్యర్థి.. ఒక్కచోటే పోటీ!

ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఒకేసారి రెండు స్థానాల నుంచి పోటీ చేయకూడదంటూ దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు ఇటీవల తోసిపుచ్చింది. ఇది శాసన విధానానికి, రాజకీయ ప్రజాస్వామ్యానికి, పార్లమెంటరీ సార్వభౌమత్వానికి సంబంధించిన అంశమని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవలసింది పార్లమెంటేనని తేల్చి చెప్పింది. దాంతో ఒక అభ్యర్థి ఒక నియోజకవర్గంలో మాత్రమేపోటీచేసేలా ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణ చేపట్టాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదన మరోమారు తెరపైకి వచ్చింది.

జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో ప్రభావం చూపగల రాజకీయ నేతలు లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో ఒకటి కంటే ఎక్కువ స్థానాల నుంచి పోటీ చేయడం దశాబ్దాలుగా కొనసాగుతోంది. రెండు చోట్లా గెలుపొందినా వీరు ఏదో ఒక్క నియోజకవర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. దాంతో రెండో స్థానంలో ఉపఎన్నిక అనివార్యమవుతోంది. ఇది ఆర్థికంగా, నిర్వహణ, పాలనాపరంగా ప్రభుత్వానికి భారమవుతోంది. అభ్యర్థులు రెండు చోట్ల పోటీ చేయడం ద్వారా ఓటర్లను సందిగ్ధావస్థలోకి నెట్టి, తరవాత ప్రజాతీర్పును అవమానకరంగా తృణీకరిస్తున్నారన్న వాదనలూ ఉన్నాయి. ఈ పరిస్థితిని మార్చాలని కేంద్ర ఎన్నికల సంఘం రెండు దశాబ్దాలుగా ప్రభుత్వాన్ని కోరుతోంది.

మొదట్లో ఎన్ని చోట్ల నుంచి అయినా..

ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం మొదట్లో ఒక వ్యక్తి లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో ఒకేసారి ఎన్ని స్థానాల నుంచయినా పోటీచేసే సౌలభ్యం ఉండేది. భాజపా వ్యవస్థాపకుడు వాజ్‌పేయీ 1957లో ఒకేసారి లఖ్‌నవూ, బలరామ్‌పుర్‌, మథుర లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన ఒక్క బలరామ్‌పుర్‌లో మాత్రమే విజయం సాధించారు. 1962, 1991, 1996 ఎన్నికల్లోనూ ఆయన ఏకకాలంలో రెండేసి లోక్‌సభ స్థానాల్లో బరిలోకి దిగారు. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్‌ 1971లో ఒక లోక్‌సభ, నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీకి దిగి, అన్నిచోట్లా పరాజయం మూటగట్టుకున్నారు. 1980లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఇందిరాగాంధీ రెండు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేశారు. 1985లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌.టి.రామారావు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నల్గొండ, గుడివాడ, హిందూపురం అసెంబ్లీ స్థానాల నుంచి పోటీచేసి మూడు చోట్లా విజయం సాధించారు. తరవాత ఆయన హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగడంతో మిగతా రెండుచోట్లా ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. 1991లో భాజపా అగ్రనేత ఎల్‌.కె.ఆడ్వాణీ, 1999లో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ రెండేసి లోక్‌సభ స్థానాల్లో పోటీచేసి విజయం సాధించారు. దేవీలాల్‌ 1989లో జనతాదళ్‌ అభ్యర్థిగా సీకర్‌, రోహ్‌తక్‌ లోక్‌సభ స్థానాల నుంచి  ఎన్నికై, అనంతర పరిణామాల్లో ఉపప్రధానిగా పనిచేశారు. సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయంసింగ్‌ యాదవ్‌, ఆర్జేడీ నేత లాలూప్రసాద్‌ యాదవ్‌, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి వంటి నేతలు సైతం గతంలో రెండేసి నియోజకవర్గాల్లో పోటీ చేసినవారే. వ్యక్తిగత ఛరిష్మాతో భిన్న ప్రాంతాల ఓటర్లను తమ పార్టీల వైపు ఆకర్షించేందుకు అగ్రనేతలు ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీచేయడం పరిపాటిగా వస్తోంది. అయితే ఆ తరవాత కేంద్ర ప్రభుత్వం ప్రజాప్రాతినిధ్య చట్టాని (పీఆర్‌ఏ)కి సవరణ చేపట్టి, ఒక అభ్యర్థి ఏకకాలంలో గరిష్ఠంగా రెండు నియోజకవర్గాల్లో మాత్రమే పోటీ చేయాలన్న నిబంధన విధించింది. 1996 నుంచి ఇది అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి అభ్యర్థులు గరిష్ఠంగా రెండు నియోజకవర్గాల్లో మాత్రమే పోటీ చేయడానికి వీలవుతోంది. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ సైతం వారణాసి (యూపీ), వడోదర (గుజరాత్‌) లోక్‌సభ నియోజకవర్గాల్లో బరిలోకి దిగి రెండు చోట్లా ఘన విజయం సాధించారు. ఆ తరవాత ఆయన వడోదర స్థానాన్ని వదులుకోవడంతో అక్కడ ఉపఎన్నిక తప్పలేదు. 2019లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అమేఠీ (యూపీ), వయనాడ్‌ (కేరళ) లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసి, అమేఠీలో ఓటమి చవిచూశారు.

ప్రతిపాదనకు మన్నన దక్కేనా?

ఒక అభ్యర్థి ఏకకాలంలో గరిష్ఠంగా రెండు చోట్ల మాత్రమే పోటీ చేయవచ్చని పీఆర్‌ఏలోని సెక్షన్‌-33(7) నిర్దేశిస్తోంది. అదే చట్టంలోని సెక్షన్‌-70 మాత్రం ఒక వ్యక్తి ఒకేసారి రెండు నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించడం కుదరదని విస్పష్టం చేస్తోంది. మరి అలాంటప్పుడు రెండు స్థానాల్లో పోటీకి ఎందుకు అనుమతించాలన్న వాదనలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. ఉపఎన్నికలతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, ఒక అభ్యర్థి ఒకచోట మాత్రమే పోటీచేసేలా మార్పులు తీసుకురావాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం 2004లోనే ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణ ప్రతిపాదించింది. ఇదే విషయమై 2010, 2016, 2018 సంవత్సరాల్లోనూ కేంద్ర న్యాయశాఖకు సూచనలు చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ నిరుడు న్యాయశాఖకు సరికొత్త ప్రతిపాదన చేశారు. ఒక అభ్యర్థి గరిష్ఠంగా ఒక నియోజకవర్గంలోనే పోటీ చేసేలా చట్టసవరణ చేపట్టాలని, అలా కుదరని పక్షంలో రెండు స్థానాల్లో గెలిచే అభ్యర్థులు ఒకచోట జరిగే ఉపఎన్నిక ఖర్చును భరించేలా నిబంధనలను చేర్చాలని సూచించారు.

అభ్యర్థులు రెండు చోట్ల పోటీ చేసేందుకు అనుమతించడం వల్ల ఓటర్లు తమకు నచ్చిన వ్యక్తిని ప్రతినిధిగా ఎన్నుకొనే అవకాశాలు విస్తృతంగా ఉంటాయన్నది పలు రాజకీయ పార్టీల అభిప్రాయం. ఇలా గెలుపొందిన అభ్యర్థి రాజీనామాతో వచ్చే ఉపఎన్నికపట్ల ఓటర్లు అంతగా ఆసక్తి చూపడంలేదు. ఖాళీ అయిన స్థానంలో తమ అభ్యర్థిని గెలిపించుకొనేందుకు అధికారపక్షాలు ముమ్మరంగా డబ్బులను గుమ్మరిస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నాయి. సమర్థులైన నాయకులు ఆర్థిక భారం కారణంగా మరోమారు పోటీకి దూరమవుతున్నారు. అందువల్ల ‘ఒక అభ్యర్థి-ఒక నియోజకవర్గం’ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఓటేయాలన్న డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి.

పాలనకు ఇబ్బందులు

ఎన్నికల్లో అభ్యర్థులు ఒకేసారి రెండేసి నియోజకవర్గాల్లో పోటీ చేయడం వల్ల ఎదురవుతున్న నష్టాలు, ఇబ్బందులను కేంద్ర న్యాయ కమిషన్‌ నిశితంగా సమీక్షించింది. పార్లమెంటు, శాసనసభ, శాసనమండలి, ఉప ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఒకచోట మాత్రమే పోటీచేసేలా ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 33(7)ను సవరించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ మేరకు ఎన్నికల సంస్కరణలపై ప్రభుత్వానికి 2014లోనే తన 255వ నివేదికను సమర్పించింది. ఎన్నికల నిర్వహణకు అధికంగా సమయం, డబ్బు వెచ్చించాల్సి వస్తోందని, తరచూ ఎన్నికలు రావడం వల్ల పాలనకు ఇబ్బందులు ఏర్పడి ప్రజలు ఒత్తిడికి గురవుతున్నారని న్యాయ కమిషన్‌ వ్యాఖ్యానించింది. ఒక వ్యక్తి ఒక నియోజకవర్గం నుంచి మాత్రమే పోటీ చేయడం వల్ల ఓటర్లు గందరగోళానికి గురయ్యే పరిస్థితి ఉండదని, ఇది ప్రజాస్వామ్యానికి మేలు చేస్తుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో- ఈ నివేదికలోని సిఫార్సులను అనుసరించి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

- తమ్మిశెట్టి రఘు
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భయపెడుతున్న ఎల్‌ నినో

‣ అడ్డగోలు అప్పులు... జనానికే తిప్పలు!

‣ సాగు మారితేనే ఆహార భద్రత

‣ వివాదాల సేతుసముద్రం

‣ భగ్గుమంటున్న పుడమి

Posted Date: 14-02-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం