• facebook
  • whatsapp
  • telegram

మయన్మార్‌లో ఎన్నికల ప్రహసనం

మయన్మార్‌ పాలన పగ్గాలను సైన్యం చేజిక్కించుకొని రెండేళ్లు దాటింది. ఎన్నికల నిర్వహణతో దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని మిలిటరీ పెద్దలు ఆదిలో చెప్పారు. ఎన్నికల నిర్వహణకు సైనిక ప్రభుత్వం ఇప్పుడు మొగ్గుచూపుతున్నా, వాటిని స్వేచ్ఛగా నిర్వహిస్తుందా అన్న సందిగ్ధత నెలకొంది.

మయన్మార్‌లో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు అక్కడి సైనికాధికారుల కమిటీ (జుంటా) నేతృత్వంలోని ప్రభుత్వం సానుకూలత కనబరుస్తోంది. వచ్చే ఆగస్టులోనే ఆ క్రతువును పూర్తిచేస్తామంటోంది. ఇందుకు పలు కారణాలున్నాయి. దేశంలో రాజకీయ పార్టీల నమోదు విషయంలో సైనిక పాలకులు ఈ ఏడాది జనవరిలో ఒక కఠిన చట్టాన్ని తీసుకొచ్చారు. దాని ప్రకారం- జైలుశిక్ష అనుభవిస్తున్న నేతలెవర్నీ పార్టీలు తమ సభ్యులుగా ఉండనివ్వకూడదు. చట్ట వ్యతిరేకమైనవంటూ సైన్యం ముద్రవేసిన ఏ సంస్థతోనూ సంబంధాలు నెరపకూడదు. రెండు నెలల్లోగా రాజకీయ పార్టీలన్నీ ఈ నూతన చట్టం కింద తిరిగి నమోదు చేసుకోవాలి. అయితే, ప్రజాస్వామ్య పోరాట యోధురాలు ఆంగ్‌ సాన్‌ సూచీ నేతృత్వంలోని ‘నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమోక్రసీ (ఎన్‌ఎల్‌డీ)’ సహా మరికొన్ని పక్షాలు తమ రిజిస్ట్రేషన్లను పునరుద్ధరించుకునేందుకు విముఖత వ్యక్తం చేశాయి. గడువు దాటిపోవడంతో ఎన్‌ఎల్‌డీ, మరో 39 పార్టీల గుర్తింపు రద్దయింది. సైనిక ప్రభుత్వం మోపిన కేసుల వల్ల సూచీ ప్రస్తుతం 33 ఏళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్నారు. ఆమెను పూర్తిగా రాజకీయాలకు దూరం చేయాలన్న కుట్రతోనే నూతన చట్టాన్ని తీసుకొచ్చారన్నది జగమెరిగిన సత్యం.

గత ఆరు దశాబ్దాల కాలంలో మయన్మార్‌ దాదాపు 50 ఏళ్లపాటు సైనిక పాలనలోనే మగ్గింది. 2021 ఫిబ్రవరి నాటి తిరుగుబాటుకు ముందు పదేళ్లు మాత్రమే ఆ దేశంలో ప్రజాస్వామ్యం మనగలిగింది. అప్పుడూ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంతో కలిసి సైన్యం అధికారాన్ని పంచుకుంది. ప్రజాస్వామిక విధానాల వల్ల అప్పట్లో దేశం కాస్తోకూస్తో సంస్కరణల బాట పట్టింది. పాశ్చాత్య దేశాల నుంచి పెట్టుబడులు పెరిగాయి. నిరంకుశ సైనిక పాలన కారణంగా మయన్మార్‌పై గతంలో విధించిన ఆంక్షలను పలు దేశాలు ఎత్తివేశాయి. ఫలితంగా మయన్మార్‌ ప్రగతిబాట పడుతున్నట్లే కనిపించింది. ఈ పరిస్థితుల్లో 2020 నవంబరులో జరిగిన ఎన్నికల్లో సూచీ పార్టీ ఎన్‌ఎల్‌డీ అఖండ విజయం సాధించింది. దాదాపు 80శాతం సీట్లను గెలుచుకొంది. సైన్యం మద్దతున్న యూఎస్‌డీపీ (యూనియన్‌ సాలిడారిటీ అండ్‌ డెవలప్‌మెంట్‌ పార్టీ) ఏడు శాతం స్థానాలకే పరిమితమైంది. అది మింగుడుపడని సైనిక పెద్దలు- ఎన్నికల్లో భారీగా అవకతవకలు జరిగాయంటూ పాలనను తమ చేతుల్లోకి తీసుకున్నారు. సూచీ సహా వందల మంది రాజకీయ నాయకులను నిర్బంధించారు. ప్రజాస్వామ్యానికి అనుకూలంగా రోడ్డెక్కినవారిపై ఉక్కుపాదం మోపారు. దాంతో దేశంలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లయింది. పెట్టుబడులు తగ్గిపోయాయి. విదేశాల ఆంక్షలు తిరిగి అమల్లోకి వచ్చాయి. దాంతో సైనిక సర్కారుకు ఆర్థిక కష్టాలు తీవ్రమయ్యాయి.

మయన్మార్‌లో సైన్యం పాలనను వ్యతిరేకిస్తూ ఇటీవల సాయుధ తిరుగుబాట్లు ఊపందుకున్నాయి. ఓ అంచనా ప్రకారం- ప్రస్తుతం మయన్మార్‌లో కేవలం 17శాతం భూభాగంపైనే సైనిక ప్రభుత్వానికి పూర్తిస్థాయి పట్టుంది. కొన్ని ప్రాంతాల్లో గిరిజన సాయుధ బలగాల నుంచి సైన్యానికి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఎక్కువ శాతం భూభాగాల్లో మిలిటరీ వ్యతిరేక శక్తులదే పైచేయి. ఈ పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ ద్వారా ప్రజాస్వామ్యయుత ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు చూపించి, దేశమంతటినీ తమ ఆధీనంలోకి తీసుకోవాలన్నది సైనిక పాలకుల వ్యూహం! ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే- ఎన్‌ఎల్‌డీ సహా పలు పార్టీలు పోటీలో లేనందువల్ల యూఎస్‌డీపీ విజయం లాంఛనప్రాయమే అవుతుంది. అది సర్కారును ఏర్పాటుచేస్తే సైన్యం అధికారాలకు ఎలాంటి ఢోకా ఉండదు. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినట్లు చూపించడం ద్వారా విదేశీ ఆంక్షల నుంచి ఉపశమనం పొందవచ్చని... పొరుగున ఉన్న ఇండియా, థాయ్‌లాండ్‌ వంటి దేశాలతో సంబంధాలు సాధారణ స్థితికి చేరుకుంటాయని సైనిక ప్రభుత్వం యోచిస్తోంది. సైన్యం ఆధ్వర్యంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగే అవకాశాలు కనిపించడంలేదు. తన వ్యతిరేక శక్తులకు పట్టున్న ప్రాంతాల్లో సైనిక పాలకులు పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేసే సాహసం చేయబోరు. కొన్నిచోట్ల మాత్రమే ఎన్నికలను నిర్వహిస్తే, ఆ ఫలితాలను యావత్‌ దేశం తీర్పుగా అంతర్జాతీయ సమాజం పరిగణించదు. యూఎస్‌డీపీ ముసుగులో ఏర్పడే సైనిక ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉండదు. రాజకీయ పార్టీల నమోదుకు సంబంధించిన నూతన చట్టాన్ని సవరించి, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించినప్పుడే- మయన్మార్‌లో నిజమైన ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం కొలువుతీరుతుంది.

- ఎం.నవీన్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మితిమీరిన రుణం దేశానికే అరిష్టం

‣ ఆధునిక యుగానికి కొత్త డిజిటల్‌ చట్టం

‣ అఫ్గాన్‌ - భారత్‌ చెలిమికి బలిమి

‣ పెచ్చరిల్లుతున్న కార్చిచ్చుల ముప్పు

‣ విపత్తుల సునామీ

Posted Date: 07-04-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం