• facebook
  • whatsapp
  • telegram

ఎన్నికల సమరాంగణంలో కన్నడసీమ

కర్ణాటకలో మే 10న జరిగే శాసనసభ ఎన్నికలు భాజపా, కాంగ్రెస్‌లకు అత్యంత కీలకంగా మారాయి. దక్షిణాదిన కాషాయ పార్టీ అధికారంలో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం, కాంగ్రెస్‌ పార్టీకి క్షేత్రస్థాయిలో అత్యంత పట్టున్న రాష్ట్రం- కర్ణాటకే. అందుకే 2024 లోక్‌సభ ఎన్నికల ముందు కన్నడనాట జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలను ఈ రెండు పార్టీలూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి.

వచ్చే నెలలో జరిగే కర్ణాటక శాసనసభ ఎన్నికలు భాజపా, కాంగ్రెస్‌లకు అత్యంత ముఖ్యమైనవనే చెప్పాలి. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించిన తరవాత జరుగుతున్న ఎన్నికలివి. దక్షిణాదిన తాము అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రంలో ఆధిపత్యాన్ని ఎలాగైనా నిలుపుకోవాలని భాజపా శ్రేణులు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం జనతాదళ్‌-సెక్యులర్‌ (జేడీ-ఎస్‌), కాంగ్రెస్‌ కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వం ఫిరాయింపుల వల్ల 14 నెలలకే కూలిపోయింది. ఆ తరవాత బీఎస్‌ యడియూరప్ప ముఖ్యమంత్రిగా భాజపా ప్రభుత్వం ఏర్పాటైంది. ఆయన పదవి నుంచి వైదొలగాక బసవరాజ్‌ బొమ్మై సీఎం బాధ్యతలు చేపట్టారు. యడియూరప్ప, బొమ్మైలింగాయత్‌ కులానికి చెందినవారే. శక్తిమంతమైన ఈ సామాజిక వర్గాన్ని భాజపా మొదటి నుంచి తనవైపు తిప్పుకొంటోంది.

ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గణనీయ ఫలితాలు సాధించగలిగితే జాతీయ పార్టీగా తనకున్న పేరును నిలబెట్టుకోగలుగుతుంది. ఇక్కడ చిత్తుగా ఓడిపోతే జాతీయ స్థాయిలో ఆ పార్టీ రాజకీయ ప్రాధాన్యానికి తీరని నష్టం కలుగుతుంది. కర్ణాటకలో కాంగ్రెస్‌ ఒంటరిగా లేదా జేడీ-ఎస్‌తో కలిసి విజయంసాధిస్తే, జాతీయ స్థాయిలో భాజపాకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టగలుగుతుంది. కర్ణాటక తరవాత ఈ ఏడాదిలో తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రతిపక్ష సారథిగా కాంగ్రెస్‌ బరిలో దిగగలుగుతుంది. ప్రస్తుతం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గే కర్ణాటకకు చెందినవారే. కాంగ్రెస్‌కు బలమైన స్థానిక నాయకులు, కార్యకర్తలు కలిగిన అతికొద్ది రాష్ట్రాల్లో కర్ణాటక ముఖ్యమైనది. ఈసారి ఇక్కడి ఎన్నికల్లో గెలవకపోతే దేశమంతటా తాను పోగొట్టుకున్న రాజకీయ పునాదిని పటిష్ఠం చేసుకోవడం కాంగ్రెస్‌కు కష్టతరమవుతుంది. మహారాష్ట్రలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌కు కర్ణాటకలో గెలవడం చాలా ముఖ్యం. రాహుల్‌ చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందనే వచ్చినా, తరవాత ఆయన విదేశీగడ్డపై భారతదేశ ఆంతరంగిక సమస్యలను ప్రస్తావించడం విమర్శలకు తావిచ్చింది. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో రాహుల్‌ ప్రచారం చేస్తారా, ఓటర్ల ఆదరణ చూరగొంటారా అన్న ఆసక్తికర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రధాని మోదీని ఉద్దేశించి చేసిన పరుష విమర్శలతో లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటితుడైన రాహుల్‌కు కర్ణాటక ఎన్నికల్లో గెలుపు గొప్ప ఊతమిస్తుంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒంటరిగా గెలవాలి. లేదంటే మళ్ళీ జనతాదళ్‌-ఎస్‌ను కింగ్‌ మేకర్‌గా ఆమోదించాల్సి వస్తుంది.     దానివల్ల కాంగ్రెస్‌కు నష్టమే తప్ప లాభం ఉండదు. పైగా జేడీ-ఎస్‌ అధినాయకుడు దేవెగౌడ ఎప్పుడు ఏ పంథాను అనుసరిస్తారో ఎవరికీ తెలియదు. కాంగ్రెస్‌ స్పష్టమైన మెజారిటీ సాధించలేకపోతే అధికారంమళ్ళీ భాజపా పరమయ్యే అవకాశాలే ఎక్కువ!

ఇప్పటికే పశ్చిమ, ఉత్తర భారత రాష్ట్రాల్లో గరిష్ఠ సంఖ్యలో సీట్లు సాధించిన భాజపా- దక్షిణ భారతంలోనూ ఎక్కువ సీట్లు తెచ్చుకుంటేనే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గణనీయమైన మెజారిటీ సాధించగలుగుతుంది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ తక్కువ సీట్లు వస్తే- ఆ నష్టాన్ని కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో పూడ్చుకోవాలని భాజపా ఆశిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా కర్ణాటకలోని 28 ఎంపీ సీట్లకు 25 సీట్లు గెలిచింది. ఒక స్వతంత్ర సభ్యుడి మద్దతునూ కూడగట్టుకొంది. మే 13న వెల్లడయ్యే కర్ణాటక శాసససభ ఫలితాలు పొరుగున ఉన్న తెలంగాణ ఎన్నికలనూ ప్రభావితం చేస్తాయి. కర్ణాటక శాసనసభలో భాజపా ఏనాడూ స్పష్టమైన మెజారిటీ సాధించలేదు. 1985, 1994 ఎన్నికల్లో తప్ప రాష్ట్రంలో ఇంతవరకు జరిగిన 14 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే అత్యధికంగా ఓట్లు పోలవుతూ వచ్చాయి. కర్ణాటకలోని భాజపా సర్కారు అంతర్గత కలహాలతో సతమతమవుతోంది. అవినీతి ఆరోపణలూ చుట్టుముడుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతా వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో కాషాయ పార్టీ విజయం నల్లేరుపై నడక కాబోదు.

- నీరజ్‌ కుమార్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మయన్మార్‌లో ఎన్నికల ప్రహసనం

‣ మితిమీరిన రుణం దేశానికే అరిష్టం

‣ ఆధునిక యుగానికి కొత్త డిజిటల్‌ చట్టం

‣ అఫ్గాన్‌ - భారత్‌ చెలిమికి బలిమి

‣ పెచ్చరిల్లుతున్న కార్చిచ్చుల ముప్పు

‣ విపత్తుల సునామీ

Posted Date: 07-04-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం