• facebook
  • whatsapp
  • telegram

గెలుపు కోసం సామాజిక ఎత్తుగడలు

రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ పటిష్ఠంగా ఉన్నట్లు పైకి కనిపిస్తున్నా- తన ఓట్లను సంఘటితం చేసుకోవడంలో వెనకబాటు, అగ్ర నేతల మధ్య విభేదాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మరోవైపు అవినీతి ఆరోపణలు భాజపాను వెంటాడుతున్నాయి. తనకు దన్నుగా నిలిచే ఒక్కలిగల ఓట్లను కొల్లగొట్టేందుకు భాజపా, కాంగ్రెస్‌లు ఎత్తులు వేస్తుండటం జనతాదళ్‌(ఎస్‌)ను కలవరపెడుతోంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే పదో తేదీన జరగనున్నాయి. 2018 ఎలెక్షన్లలో మాదిరిగా ఈసారి భాజపాకు బి.ఎస్‌.యడియూరప్ప లాంటి బలమైన నాయకుడు లేడు. 2021లో బసవరాజ్‌ బొమ్మై ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించినా, ఓటర్లను ప్రభావితం చేసేలాగ శక్తిమంతమైన నేతగా ఆయన ఎదగలేకపోయారు. అయితే, బలమైన లింగాయత్‌ సామాజికవర్గానికి చెందిన బొమ్మై ఎన్నికల ప్రచారానికి సారథ్యం వహించనున్నారు. మరో ప్రభావవంతమైన ఒక్కలిగ వర్గానికి చెందిన కేంద్ర మంత్రి శోభా కరంద్లాజేకు ఓట్లను సంఘటితం చేసే బాధ్యతలు అప్పగించారు. ఈ వ్యూహంతో రెండు ప్రధాన సామాజికవర్గాలను మచ్చిక చేసుకోవచ్చని భాజపా భావిస్తోంది. కాంగ్రెస్‌ అధిష్ఠానం ఇప్పటిదాకా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరి పేరునూ ప్రకటించలేదు. కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌, శాసనసభలో ప్రతిపక్ష నేత సిద్దరామయ్య తమను తాము ముఖ్యమంత్రి అభ్యర్థులుగా చాటుకుంటున్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఎన్నడూ స్పష్టమైన మెజారిటీని సాధించలేదు. వచ్చే ఎన్నికల్లో దాన్ని అందుకొనేందుకు కమల దళం సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇటీవల కర్ణాటకలో పర్యటించిన మోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డా తదితర భాజపా అగ్రనేతలు తమ ప్రభుత్వంపై ఉన్న అవినీతి మరకను తొలగించుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించారు. కర్ణాటకలో అన్ని పనుల్లో భాజపాకు 40శాతం కమిషన్లు ఇవ్వాలని అక్కడి కాంట్రాక్టర్ల సంఘం ధ్వజమెత్తింది. ఈ అవినీతినే ప్రధాన ఎన్నికల అస్త్రంగా కాంగ్రెస్‌ మలచుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో మోదీ ప్రజాకర్షక శక్తితో వచ్చే ఎన్నికల్లో గట్టెక్కే ఉద్దేశంతో కాంగ్రెస్‌ వర్సెస్‌ బొమ్మై అని కాకుండా కాంగ్రెస్‌ వర్సెస్‌ మోదీ నినాదాలను భాజపా హోరెత్తిస్తోంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా సామాజిక వర్గాలకు దగ్గరయ్యేందుకు రిజర్వేషన్ల కోటాలో భాజపా మార్పులు చేసింది. ఎస్‌సీ కోటాను 15 నుంచి 17శాతానికి, ఎస్‌టీ కోటాను మూడు నుంచి ఏడు శాతానికి పెంచింది. నాలుగు శాతం ముస్లిం కోటాను తొలగించి, లింగాయత్‌ కోటాను అయిదు నుంచి ఏడు శాతానికి, ఒక్కలిగ కోటాను నాలుగు నుంచి ఆరు శాతానికి తీసుకెళ్ళింది. హిజాబ్‌, టిప్పు సుల్తాన్‌ తదితర వివాదాల వల్ల కర్ణాటకలో మతపరమైన మంటలు తరచూ రగులుతూనే ఉన్నాయి. భాజపా తన ఓటుబ్యాంకును సంఘటితం చేసుకోవడానికి అవి సహకరించే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల్లో ప్రముఖ కన్నడ నటుడు సుదీప్‌ భాజపా తరఫున ప్రచారం చేస్తానని ప్రకటించడం ఆ పార్టీ విజయావకాశాలను పెంచవచ్చు.

అంతర్గత కుమ్ములాటలు కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రధాన సమస్యగా మారాయి. ఒక్కలిగ ఓటర్లకు దగ్గరయ్యేందుకు అదే వర్గానికి చెందిన కేపీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌ను హస్తం పార్టీ ప్రోత్సహిస్తోంది. ఓబీసీ ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు కురుబ సామాజికవర్గానికి చెందిన సిద్దరామయ్యనూ ప్రముఖంగా చూపుతోంది. ఓటమి ఎరగని యోధుడిగా పేరు పొందిన కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు, దళిత నేత మల్లికార్జున ఖర్గే ద్వారానూ ఎన్నికల్లో లబ్ధి పొందాలని హస్తం పార్టీ భావిస్తోంది. కలబురిగి నుంచి ఖర్గే ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. చాలా రాష్ట్రాల్లో మాదిరిగా కాకుండా కర్ణాటకలో శివకుమార్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ బొమ్మై ప్రభుత్వ అవినీతిపై తిరుగులేని పోరాటం సాగిస్తోంది. మరోవైపు తనకు కంచుకోట లాంటి ఒక్కలిగల ఓట్లను కొల్లగొట్టేందుకు భాజపా, కాంగ్రెస్‌లు తీవ్రంగా ప్రయత్నిస్తుండటం జనతాదళ్‌(ఎస్‌)కు పెను సమస్యగా మారింది. ఒక్కలిగలు తనకు ఓటువేస్తే ఆ సామాజికవర్గం నుంచి తానే ముఖ్యమంత్రి అవుతానని డి.కె.శివకుమార్‌ చెబుతున్నారు. భాజపా సైతం ఒక్కలిగల మనసు గెలవాలనే నినాదంతో ముందుకు సాగుతోంది. ఎన్నికల్లో ఇరు ప్రధాన పక్షాల మధ్య తీవ్ర పోటీ హంగ్‌ అసెంబ్లీకి దారితీసే అవకాశమూ ఉంది.

- ఎస్‌.నీరజ్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆధునిక యుగానికి కొత్త డిజిటల్‌ చట్టం

‣ అఫ్గాన్‌ - భారత్‌ చెలిమికి బలిమి

‣ పెచ్చరిల్లుతున్న కార్చిచ్చుల ముప్పు

‣ విపత్తుల సునామీ

Posted Date: 18-04-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం