• facebook
  • whatsapp
  • telegram

5జీ రాకకు వేళాయె...

సన్నాహాల్లో కేంద్ర ప్రభుత్వం

దేశంలో అయిదో తరం (5జీ) మొబైల్‌ నెట్‌వర్క్‌ రాకకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాదే 5జీని అందుబాటులోకి తెస్తామని ఫిబ్రవరి బడ్జెట్‌ సమావేశాల్లో కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. 5జీ ఏర్పాటుకు అవసరమైన స్పెక్ట్రమ్‌ వేలాన్ని ప్రారంభించేందుకు జులై 26ను ముహూర్తంగా నిర్ణయించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కానుకగా ఆగస్టు 15న ప్రధాని మోదీ 5జీని ప్రవేశపెట్టనున్నారని సమాచారం. ఆ వెంటనే 5జీని దేశమంతా అందుబాటులోకి తేవడం సాధ్యంకాదు. ఎయిర్‌టెల్‌, జియో లాంటి టెలికాం దిగ్గజాలు సాధ్యమైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో కొత్తతరం మొబైల్‌ నెట్‌వర్క్‌ను తీసుకొచ్చి పోటీలో ముందుండేందుకు సన్నద్ధమవుతున్నాయి.

టెల్కోలు సిద్ధమేనా?

భారత్‌లో 5జీని అందుబాటులోకి తేవడానికి అవసరమైన మల్టిపుల్‌ ఇన్‌పుట్‌ మల్టిపుల్‌ అవుట్‌పుట్‌ (మిమో) సాంకేతికతను సమకూర్చుకున్నట్లు ఎయిర్‌టెల్‌ 2017లోనే ప్రకటించింది. బెంగళూరు, కోల్‌కతా సహా దేశంలోని పలు ప్రాంతాల్లో మిమో టెక్నాలజీని కంపెనీ ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. ఏడాదిన్నర కాలంగా పూర్తిగా 5జీ ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు ఎయిర్‌టెల్‌ సీటీవో రణ్‌దీప్‌ సెఖాన్‌ ఈ ఏడాది మార్చిలో ప్రకటించారు. దేశీయ టెలికాం దిగ్గజాల్లో ఒకటిగా ఎదిగిన జియో సైతం 5జీ పోటీకి సై అంటోంది. ప్రయోగ పరీక్షలన్నీ చేసి స్పెక్ట్రమ్‌ కోసం ఎదురుచూస్తోంది. దేశంలోని వెయ్యి నగరాల్లో 5జీని ప్రవేశపెట్టేందుకు జియో సిద్ధంగా ఉందని జియో ఇన్ఫోకామ్‌ ప్రెసిడెంట్‌ కిరణ్‌ థామస్‌ జనవరిలో వెల్లడించారు. వైద్య రంగంతో పాటు ఇండస్ట్రియల్‌ ఆటొమేషన్‌లో 5జీ వినియోగానికి ప్రయోగాలు చేస్తున్నట్లూ జియో తెలిపింది. నిర్వహణ పరంగా నష్టాలను చవిచూస్తున్నా, ఏజీఆర్‌ బకాయిలపై వెసులుబాటు దక్కడంతో వొడాఫోన్‌ ఐడియా సైతం 5జీ పోటీలోకి వచ్చింది. ప్రయోగాల కోసం హువావై, ఎరిక్సన్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వొడాఫోన్‌ ఐడియా ఎండీ, సీఈఓ రవీందర్‌ టక్కర్‌ గత డిసెంబరులో ప్రకటించారు. తమ నెట్‌వర్క్‌ను 5జీ కోసం సిద్ధం చేశామని, స్పెక్ట్రమ్‌ వేలం పూర్తవగానే సేవలను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. 5జీకి ఏర్పాట్లు సిద్ధమవుతున్న తరుణంలో వినియోగదారులు   దాని టారిఫ్‌ గురించీ ఆలోచించడం మొదలైంది. దేశవ్యాప్తంగా    95శాతానికి పైగా 4జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చింది. 4జీ వచ్చి కంపెనీలన్నీ కుదురుకున్నాక ఏడాదిన్నర కాలంలో రెండుసార్లు ధరలను పెంచాయి. సగటున ఒక వినియోగదారుడిపై వచ్చే ఆదాయం (ఏఆర్‌పీయూ) తగ్గడమే దానికి కారణమని టెల్కోలు చెబుతున్నాయి. రెండు సిమ్‌ల స్మార్ట్‌ఫోన్లు వాడుతున్న వినియోగదారుల్లో అత్యధిక శాతం ఒక సిమ్‌కార్డుకే రీఛార్జి చేయిస్తున్నారని, అందువల్లే ఏఆర్‌పీయూ తగ్గిందని టెలికాం వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రెండుసార్లు ధరలు పెంచినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మొబైల్‌ నెట్‌వర్క్‌ టారిఫ్‌ భారత్‌లోనే తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో 5జీ ధరలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. 4జీతో సమానంగా ధరలు ఉండవచ్చునని కొందరు అంటుంటే, 20-25శాతం ధరలు పెరిగే అవకాశం ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. వేగంలోనూ, అనుసంధానతలోనూ 4జీతో పోలిస్తే ముందుండే 5జీతో దేశంలో టెలికం రంగంతోపాటు విద్య, వైద్యం, పారిశ్రామిక విభాగాల్లో పెనుమార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

భిన్న వాదనలు

ఆటొమేషన్‌ పరంగా 5జీ మేలిమలుపు కావచ్చని అంచనాలున్నాయి. వినియోగదారుల పరంగా చూస్తే ఈ వ్యవస్థలో బాగా ఆకర్షించేది వేగమే. ఇందులో ఒక జీబీపీఎస్‌ వేగం వస్తుందని అంచనా. దేశంలో 4జీ సరాసరి వేగం సెకనుకు 14 ఎంబీపీఎస్‌లే. వేగం పరంగా భారత్‌ది ప్రపంచంలో 115వ స్థానం. ప్రపంచవ్యాప్త సగటు 30ఎంబీపీఎస్‌ కన్నా ఇండియా వెనకబడి ఉంది. నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌, అమెజాన్‌ వంటి ప్రముఖ ఓటీటీల్లో కార్యక్రమాలను హెచ్‌డీలో వీక్షించడానికి రెండు నుంచి ఆరు ఎంబీపీఎస్‌ వేగం సరిపోతుందని, అలాంటప్పుడు భారత్‌లో 4జీ వేగం చాలునని పలువురు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో క్రికెట్‌ పోటీలు వంటి ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించడానికీ ఎనిమిది ఎంబీపీఎస్‌ వేగం సరిపోతుందని అంచనా. ఈ నేపథ్యంలో 5జీ వేగంపై వినియోగదారుల అంచనాలు, ఆశలు ఎలా ఉన్నాయో, కంపెనీలు దాన్ని ఎంతవరకూ అందుకోగలుగుతాయో వేచి చూడాలి. మరోవైపు 5జీ నెట్‌వర్క్‌ను వినియోగించుకోవడానికి వీలైన స్మార్ట్‌ఫోన్ల ఖరీదు కాస్త ఎక్కువగానే ఉంది. వాటి సరాసరి ఖరీదు రూ.29 వేల దాకా ఉందని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 4జీ ఫోన్ల కంటే అది దాదాపు రెట్టింపు. ప్రస్తుతానికి దేశంలో కోటి దాకా 5జీ ఫోన్లు ఉన్నాయని అంచనా. టారిఫ్‌ ధర, ఫోన్‌ ఖరీదు ఇవన్నీ చూస్తే 5జీ అందుబాటులోకి వచ్చి దాని వేగం, అనుసంధానత 4జీ కంటే మెరుగైందని నిర్ధారణకు వస్తే తప్ప- ఒక్కసారిగా వినియోగదారులు 5జీలోకి మారే అవకాశాలు కనిపించడం లేదు. ఈ పరిణామాలన్నీ మున్ముందు ఎలా మారతాయన్నది ఆసక్తికరం.

- శ్యాంప్రసాద్‌ ముఖర్జీ
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ రాష్ట్రాల అసంతృప్తి గళం

‣ తుపాకీ సంస్కృతికి అడ్డుకట్ట

‣ చేయూత అందిస్తే దేశానికే పెన్నిధులు

‣ సముద్ర సంపదపై సాంకేతిక నేత్రం

Posted Date: 29-06-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం