• facebook
  • whatsapp
  • telegram

పాడిపశువులకు హాస్టళ్లు

రైతుకు చేయూతగా వినూత్న ప్రయోగం

విద్యార్థులకు, పని చేసే మహిళలకు వసతి గృహాలు ఉండటం మనకు తెలుసు. కానీ పశువులకు హాస్టళ్లు ఉండటం వినూత్నమైన అంశం. ఇలాంటి హాస్టల్‌ను ఈ నెల పదో తేదీన తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేటజిల్లా పొన్నాల గ్రామంలో ప్రారంభించారు. ఈ తరహా వసతి గృహాల ఏర్పాటు వెనక హేతుబద్ధత ఏమిటి, ఇవి విజయవంతంగా నడవాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలు ఆసక్తికరం. భారతదేశానికి వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు వెన్నెముక లాంటివి. 2018-19 లెక్కల ప్రకారం దేశ జనాభా 135 కోట్లని అంచనా. అందులో 65శాతానికి పైగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వారిలో సుమారు 70శాతం వ్యవసాయ, అనుబంధ వృత్తుల మీదే ఆధారపడి ఉన్నారు. ఒక అంచనా ప్రకారం 26.30కోట్ల కుటుంబాలకు ఆధారం వ్యవసాయమే. వారిలో 11.90 కోట్ల మందికి సొంత భూములున్నాయి. 14.40 కోట్లమంది భూమి లేని నిరుపేదలు. భూములున్నవారిలోనూ 82శాతం సన్న, చిన్నకారు రైతులే. క్లుప్తంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఉన్న 9.76 కోట్లమంది చిన్న రైతులకు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది. దీర్ఘకాలంగా తీవ్రమైన ఆటుపోట్లు ఎదుర్కొంటున్న వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి రంగాలను ప్రగతి దిశగా పరుగులెత్తించేందుకు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని దేశ ప్రధాని పిలుపిచ్చారు. పశుసంవర్ధక శాఖా ఆ పరిధిలోనే ఉంది.

సరికొత్త పరిష్కారం 

దేశ సుస్థిర, సమగ్రాభివృద్ధిలో పశుసంపదా కీలకమైన పాత్ర పోషిస్తుంది. భారత్‌లో అభివృద్ధి ప్రణాళికలు అమలైనప్పటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దారిద్య్ర నిర్మూలనలో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలు, ఎస్‌సీ, ఎస్‌టీ కార్పొరేషన్ల ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాయి. అందులో పాలిచ్చే పశువుల పంపిణీ ఒకటి. జాతీయ నమూనా సర్వే సంస్థ లెక్కల ప్రకారం వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నవారిలో అయిదోవంతు కంటే ఎక్కువ మంది (23శాతం) అతి చిన్న కమతాలను కలిగి ఉన్నారు. వారికున్న భూమి సగటున 0.01 హెక్టార్లు మాత్రమే. వారి ప్రధాన ఆదాయం పశువుల నుంచే వస్తోంది. పెరుగుతున్న జనాభా, మారుతున్న జీవన శైలి, విస్తరిస్తున్న పట్టణీకరణ, తగ్గిపోతున్న మైదానాలు పశువుల మనుగడకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. పశువులకు వైరల్‌ వ్యాధుల బెడదా పెరుగుతోంది. పశుసంపద ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నింటికీ ఇప్పుడో పరిష్కారం అవసరం. అందుకే కొత్త నిర్వహణ పద్ధతుల అన్వేషణ తప్పనిసరైంది. 

గుజరాత్‌లో పశు సంరక్షణకు అనుసరిస్తున్న విధానాలను పరిశీలించిన అనంతరం తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటిసారిగా చిన్న రైతులు, భూమి లేనివారు, గ్రామీణ బలహీన వర్గాల ప్రజలకోసం సంయుక్త పశువుల వసతి సదుపాయాన్ని కల్పించింది. పశువుల హాస్టల్‌గా వ్యవహరించే ఈ క్షేత్రం- వారి పశువులకు అవసరమైన గ్రాసం, ఇతర మౌలిక సదుపాయాలు అందిస్తుంది. ఇటీవల పొన్నాల గ్రామంలో ప్రారంభించిన పశువుల హాస్టల్‌ అయిదెకరాల్లో విస్తరించి ఉంది. అక్కడ సుమారు 160 పశువులు ఉంటాయి. అందులో 40శాతం ఆ గ్రామవాసులవే. మరో 20 ఎకరాల్లో పశుగ్రాసాన్ని పెంచే సన్నాహాలు జరుగుతున్నాయి. ఒప్పందసేద్యం ప్రాతిపదికన పశుగ్రాసం పెంచాలనే ప్రతిపాదనలున్నాయి. పెంచిన పచ్చిగడ్డిని పాడి రైతుకు కిలో రూపాయికే విక్రయిస్తారు. పశువుల హాస్టల్‌కు అనుబంధంగా ఉండే పశుగ్రాస కేంద్రం, పాల సేకరణ కేంద్రం, పశు ఆరోగ్య కేంద్రాలు పశువులకు అవసరమైన అన్ని సౌకర్యాలనూ అందిస్తాయి. పశువుల హాస్టల్‌కు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సీఎస్‌ఆర్‌ పాక్షికంగా నిధులు అందజేస్తున్నాయి. హాస్టల్‌ నిర్వహణను లబ్ధిదారులే చేపట్టారు.  

బహుళ ప్రయోజనాలు!

పశువుల వసతి గృహం వల్ల బహుళ ప్రయోజనాలున్నాయి. మొదట రైతుకు పశు పెంపకానికి సంబంధించి- గ్రాసం సేకరణ వంటి ఇబ్బందులు ఉండవు. రెండోది- ప్రతి ఇంట్లో పశువులను పెంచడంవల్ల ఉత్పన్నమయ్యే అపరిశుభ్ర వాతావరణం నుంచి గ్రామాన్ని కాపాడవచ్చు. ఊళ్లోని రైతులందరి పశువులకూ సమగ్ర, సాధారణ సదుపాయాలు అందడం మూడో ప్రయోజనం. నాలుగోది... జీవాల పెంపకానికి అవసరమైన భూమి కొరత వంటి సమస్యలు రైతులకు ఉండవు. ఈ హాస్టళ్లకు ప్రాచుర్యం కల్పించడానికి ఏం చేయాలంటే... ప్రతి గ్రామానికీ లేదా గ్రామాలతో కూడిన క్లస్టర్‌కు ఒక పశువుల వసతి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. ఇందుకు తొలుత ఏర్పాటైన పశువుల హాస్టల్‌ విజయవంతం కావాలి. హాస్టల్‌ను నడిపేందుకు రెండు నమూనాలను పరిశీలించవచ్చు. మొదటిది సహకార నమూనా. రెండోది వ్యవస్థాపక నమూనా. ఆర్థిక, సామాజిక స్థితిగతులతో సంబంధం లేకుండా రైతులంతా తమ పశువులకోసం ఈ హాస్టల్‌ సదుపాయాన్ని వినియోగించుకునేలా చూడాలి. ఏమాత్రం సొమ్ము చెల్లించలేని నిరుపేదలైన రైతులుంటే వారి తరఫున ప్రభుత్వమే నేరుగా హాస్టల్‌కు డబ్బు చెల్లిస్తుంది. ఇతర రైతులు- వ్యయాలకు అనుగుణంగా నిర్దేశించిన మొత్తాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఏదేమైనా ఒక ఆసక్తికర ప్రయోగం మొదలైంది. అందరూ సాధ్యమైనంత మేర ఈ ప్రయోగాన్ని విస్తరించడంలో తోడ్పాటు అందించాలి. పశువుల వసతి కేంద్రం భావన విజయవంతమయ్యేలా చూడాలి. తదుపరి చర్యల్లో భాగంగా హాస్టల్‌లోని పశువులకు బీమా సదుపాయం వర్తించేలా చర్యలు తీసుకోవాలి.

- డాక్టర్‌ శైలేంద్ర జోషి 
(విశ్రాంత ఐఏఎస్‌ అధికారి) 

 

Posted Date: 16-01-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాష్ట్రీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం