• facebook
  • whatsapp
  • telegram

డిగ్రీలో కామ‌ర్స్‌కు అత్య‌ధిక ఆద‌ర‌ణ‌

65,897 మందికి బీకాం సీట్ల కేటాయింపు

‣ దోస్త్‌లో 1,67,130 మందికి దక్కిన సీట్లు

 

 

ఈనాడు, హైదరాబాద్‌: డిగ్రీలో కామర్స్‌ కోర్సుకు అధిక ఆదరణ లభిస్తోంది. డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌-తెలంగాణ(దోస్త్‌) సీట్ల కేటాయింపును పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. మొత్తం సీట్లు పొందిన వారిలో దాదాపు 40 శాతం మంది కామర్స్‌ కోర్సులోనే చేరనున్నారు. గత ఏడాది మొదటి విడతలో బీకాం(కామర్స్‌)లో 53,327 మంది సీట్లు పొందగా ఈసారి ఆ సంఖ్య 65,897కి పెరగడం విశేషం. దోస్త్‌ మొదటి విడత సీట్లను బుధవారం కేటాయించారు. మొత్తం 950 ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో 4,08,345 సీట్లున్నాయి. అనంతరం రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి, కన్వీనర్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌మిత్తల్‌, సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజేంద్ర నిమ్జే తదితరులు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా పాపిరెడ్డి మాట్లాడుతూ మొత్తం 1,81,638 మంది వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోగా అందులో 1,67,130 మందికి సీట్లు దక్కాయన్నారు. తగిన ఆప్షన్లు ఇచ్చుకోనందున 14,508 మంది సీట్లు పొందలేకపోయారని చెప్పారు. కన్వీనర్‌ లింబాద్రి మాట్లాడుతూ ఈసారి 27 కళాశాలల్లో ఒక్కరూ చేరటం లేదన్నారు.

‣ సీట్లు పొందిన వారు చేయాల్సింది ఇదీ...

‘‘సీట్లు పొందిన విద్యార్థులు దోస్త్‌ అభ్యర్థి లాగిన్‌లోకి వెళ్లి తగిన ఫీజు చెల్లించి ఆగ‌స్టు 9వ తేదీలోపు ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసి సీటును రిజర్వు చేసుకోవాలి’’అని కన్వీనర్‌ లింబాద్రి తెలిపారు.

‣ అమ్మాయిలే టాపర్లు

ఇంటర్‌ మార్కుల ఆధారంగా అధికారులు దోస్త్‌ ర్యాంకులు కేటాయించారు. ఆయా విభాగాల్లో చేరిన మొదటి 5 ర్యాంకర్లలో అమ్మాయిలే అధికంగా ఉన్నారు. బీఎస్‌సీ లైఫ్‌ సైన్స్‌లో అయిదుగురూ అమ్మాయిలే కావడం గమనార్హం. మిట్టపల్లి అక్షయ ఇంటర్‌లో అత్యధికంగా 99.40 శాతం మార్కులు(ర్యాంకు 1) సాధించి నిజాం కళాశాలలో బీఎస్‌సీ ఫిజికల్‌ సైన్స్‌లో చేరగా...సమాన మార్కులు పొందిన(ర్యాంకు 2) సర్వి స్వాతి హన్మకొండ సుబేదారి వర్సిటీ కళాశాలలో బీఎస్‌సీ లైఫ్‌ సైన్స్‌లో ప్రవేశం పొందింది.

Posted Date : 05-08-2021