• facebook
  • whatsapp
  • telegram

NAT: విద్యార్థుల్లో నైపుణ్యాలకు జాతీయ పరీక్ష

నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌

ఫీజు లేదు

ఎనిమిది ఆపై తరగతులకు

 

ఈనాడు, హైదరాబాద్‌: మీ పిల్లల విద్యా సామర్థ్యం ఎంత? ఏయే అంశాలపై వారికి పట్టుంది. వారి విషయ పరిజ్ఞానం ఏమిటి? అనేది తెలుసుకుంటే..భవిష్యత్తులో వాళ్లు ఏ రంగంలో రాణిస్తారో ఇట్టే అంచనా వేయవచ్చు. ఈ లక్ష్యంతోనే జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) ప్రయోగాత్మకంగా ‘‘నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు(న్యాట్‌) - 2021’’కు శ్రీకారం చుట్టింది. ఆన్‌లైన్‌లో జరిగే పరీక్ష రాసేందుకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. ‘‘భవిష్యత్తు అవసరాలకు తగిన నైపుణ్యాలు విద్యార్థులకు ఉన్నాయో తెలుసుకునేందుకే ఈ పరీక్ష. తదనుగుణంగా విద్యావిధానంలో మార్పులు చేయడానికీ ఇది దోహదం చేస్తుందని నమ్ముతున్నాం. ప్రశ్నపత్రం ఆంగ్లంలో ఉంటుంది. పరీక్షలో భాగంగా పలు రకాల నైపుణ్యాలను పరీక్షిస్తాం. గణాంకాలు, అనలిటికల్‌ రీజనింగ్‌, వెర్బల్‌ ఎబిలిటీ తదితర మొత్తం తొమ్మిది విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. 15 - 25 సంవత్సరాల వయసు విద్యార్థులు(8వ తరగతి, ఆపైన) పాల్గొనవచ్చు’ అని ఎన్‌టీఏ వర్గాలు తెలిపాయి. విద్యార్థులు సాధించిన మార్కులపై నివేదిక కూడా ఇస్తామని తెలిపాయి. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌: ‌nat.nta.ac.in ను సంప్రదించాలని సూచించారు.

నాలుగు స్థాయులుగా విభజన

విద్యార్థుల వయసును బట్టి నాలుగు స్థాయిలుగా విభజించి పరీక్షలు నిర్వహిస్తారు. స్థాయి-1(13 - 15), స్థాయి-2 (16 - 18), స్థాయి-3 (19 - 21), స్థాయి-4లో 22 - 25 సంవత్సరాల వారు పాల్గొనవచ్చు.

ఇదీ కాలపట్టిక

* రిజిస్ట్రేషన్‌, దరఖాస్తుల సమర్పణ గడువు: 18వ తేదీ వరకు

* పరీక్ష తేదీ: స్థాయి-1, 2 అక్టోబరు 23న; స్థాయి-3,4 24న

* సమయం: 2 గంటలు(ఉదయం 11 నుంచి 1 గంట వరకు, సాయంత్రం: 4 - 6 గంటల వరకు)

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

 ప్రణాళిక పాటిస్తే10/10

 చదివితే చాలదు.. చక్కగా రాయాలి!

‣ విదేశాల్లో వైద్యవిద్యకు వెళ్లాలా.. వద్దా?

అది... జవాబులో తొలి భాగం!

‣ విప్రోలో 25000 నియామకాలు