• facebook
  • whatsapp
  • telegram

Engineering Seats: తెలంగాణలో 85,149 ఇంజినీరింగ్‌ సీట్లకు అనుమతి

హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ కొత్త కోర్సులపై ఉత్కంఠకు తెరపడింది. శనివారం నుంచి ఎంసెట్‌ వెబ్‌ఆప్షన్లు ప్రారంభం కానుండటం.. మరోవైపు ప్రభుత్వం నుంచి కోర్సులకు అనుమతి రాకపోవడంతో కళాశాల యాజమాన్యాలు, విద్యార్థుల్లో అయోమయం ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా తెలంగాణలో ఈ విద్యాసంవత్సరానికి 85,149 ఇంజినీరింగ్‌ సీట్లకు విశ్వవిద్యాలయాలు అనుమతిచ్చాయి. ఇంజినీరింగ్‌, ఫార్మా కళాశాలల యూనివర్సిటీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రంలో 161 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 85,149 సీట్లకు అనుమతి లభించింది. వాటిలో కన్వీనర్‌ కోటాలో 60,697 ఇంజినీరింగ్‌ సీట్లు భర్తీ కానున్నాయి. రేపు మరో 56 కాలేజీల్లో సుమారు 2వేల సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. 
రాష్ట్రంలో 91కళాశాలల్లో 7,640 బి-ఫార్మసీ సీట్లకు అనుమతి లభించింది. వాటిలో కన్వీనర్‌ కోటాలో ఎంపీసీ అభ్యర్థులకు 2,691, బైపీసీ అభ్యర్థులకు మరో 2,691 సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. రాష్ట్రంలో 44 కళాశాలల్లో 1,295 ఫార్మ్‌-డి సీట్లకు యూనివర్సిటీలు అనుమతిచ్చాయి. కన్వీనర్‌ కోటాలో ఎంపీసీ అభ్యర్థులకు 454, బైపీసీ అభ్యర్థులకు మరో 454 ఫార్మ్‌-డి సీట్లు అందుబాటులో ఉంటాయి. రేపట్నుంచి సెప్టెంబ‌రు 16 వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది. అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన రేపటితో ముగియనుంది. ఇవాళ్టి వరకు 59,901 మంది ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిందని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు.

Posted Date : 11-09-2021