• facebook
  • whatsapp
  • telegram

పునశ్చరణకు ‘మూలాల్లోకి వెళ్దాం’

* సర్కారు బడుల్లో నెల రోజులపాటు అమలు

 

 

ఈనాడు, వరంగల్‌: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో దిగువ తరగతుల పాఠ్యాంశాలను పునశ్చరణ చేయించి, వారి సామర్థ్యాలను పెంచేందుకు ‘మూలాల్లోకి వెళ్దాం’ (అటైనింగ్‌ బేసిక్‌ కాంపిటెన్సీ- ఏబీసీ) కార్యక్రమాన్ని విద్యాశాఖ ఈ ఏడాది అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 3 నుంచి 9వ తరగతి వరకు ఉండే విద్యార్థులకు తెలుగు, గణితం, ఆంగ్లం సబ్జెక్టులపై ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు తీసుకుంటారు. మొదట విద్యార్థులకు ప్రాథమిక పరీక్ష నిర్వహించి పరిజ్ఞానాన్ని అంచనా వేస్తారు. దాని ప్రకారం వారిని గ్రేడ్లుగా విభజించి నెల రోజుల పాటు పునశ్చరణ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. చదవడం, రాయడం, అంకగణితం (రీడింగ్, రైటింగ్, అర్ధమెటిక్‌) అంటూ ఈ కార్యక్రమాన్ని 2018 వరకు 3ఆర్‌ పేరిట అమలు చేసేవారు. దాన్ని 2019 నుంచి ‘మూలాల్లోకి వెళ్దాం’ అని మార్చారు. కరోనా కారణంగా బడులు మూతపడడంతో గత ఏడాది అమలు చేయలేకపోయారు. ఇప్పుడు దీన్ని పునరుద్ధరించడంతో కొవిడ్‌ వల్ల చదువులకు దూరమైన విద్యార్థులకు ఉపయుక్తం కానుంది. ఉదాహరణకు హనుమకొండ జిల్లాలో డీఈవో నారాయణరెడ్డి చొరవతో ప్రేరణ అనే స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ పంపిన సాఫ్ట్‌ కాపీ పాఠాలను పుస్తకాలుగా ముద్రించింది. వీటిని నగరంలోని పలు పాఠశాలల్లో అందజేశారు. ఈ పాఠ్యాంశాల్లో కొన్ని జిగ్‌సా పజిళ్ల రూపంలో విద్యార్థి మెదడుకు పదును పెట్టేలా ఉన్నాయి. ఈ పాఠాలతో విద్యార్థుల గ్రాహక, పఠన నైపుణ్యాలు పెరుగుతున్నాయని హనుమకొండలోని న్యూశాయంపేట పాఠశాల ప్రధానోపాధ్యాయుడు స్వామి తెలిపారు. 

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ ఇంటర్‌తో ఐటీ ఉద్యోగం!

‣ అనువుగా..  ఆన్‌లైన్‌ అభ్యాసం! 

Posted Date : 28-09-2021