• facebook
  • whatsapp
  • telegram

NEET: నీట్‌లో భ‌య‌పెట్టిన భౌతిక‌శాస్త్రం  

క్లిష్టంగా ఫిజిక్స్‌ ప్రశ్నలు

గతేడాది కంటే కఠినంగా ప్రశ్నపత్రం

ఈనాడు డిజిటల్, అమరావతి: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్‌) ప్రశ్నపత్రంలో భౌతికశాస్త్రం విభాగం కఠినంగా వచ్చింది. ఎక్కువ ప్రశ్నలు విశ్లేషణ, సమస్యలతో కూడినవి కావడంతో ఎక్కువ సమయం పట్టింది. ఎక్కువ నిడివి ఉన్న ప్రశ్నలు విద్యార్థుల సహనానికి పరీక్ష పెట్టాయి. రసాయన శాస్త్రం ప్రశ్నలు కొంత క్లిష్టంగా ఉన్నాయి. ఈ రెండు విభాగాలతో పోలిస్తే జీవశాస్త్రం ప్రశ్నలు సులువుగా ఉండటంతో కొంత ఊరట దక్కింది. నిడివి ఎక్కువ ఉన్న ప్రశ్నలను అర్థం చేసుకోవడానికే ఎక్కువ సమయం పట్టింది. మొత్తంగా గతేడాదితో పోలిస్తే ప్రశ్నపత్రం ఈ సారి కొంత క్లిష్టంగా ఉన్నట్లు విద్యారంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. వైద్యవిద్యలో ప్రవేశాల కోసం ఆదివారం దేశవ్యాప్తంగా ‘నీట్‌-2021’ జరిగింది. రాష్ట్రంలో పది పట్టణాల్లో 151 కేంద్రాల్లో ఆఫ్‌లైన్‌ విధానంలో పరీక్ష జరిగింది.

తొలిసారి ఛాయిస్‌ విధానం

నీట్‌ ప్రశ్నపత్రంలో తొలిసారిగా ఛాయిస్‌ విధానం అమలు చేశారు. 200 ప్రశ్నలు ఇవ్వగా.. అందులో 180 కి సమాధానమివ్వాలి. ప్రతి సబ్జెక్టులో 5 ప్రశ్నలు ఛాయిస్‌ కింద ఇచ్చారు. మొత్తం 720 మార్కులకు పరీక్ష జరిగింది. రుణాత్మక (నెగెటివ్‌) మార్కుల విధానం ఉంది. ప్రశ్నల సంఖ్య పెంచడంతో విద్యార్థులకు సమయం సరిపోలేదని నిపుణులు తెలిపారు. 

ఎక్కువ సమస్యాత్మక ప్రశ్నలు

నీట్‌ ప్రశ్నపత్ర సరళిపై విద్యారంగ నిపుణులు వి.నరేంద్రబాబు, జీవీ రావు, మద్దినేని మురళీకృష్ణ ‘ఈనాడు’తో మాట్లాడుతూ.. భౌతికశాస్త్రం ప్రశ్నలు ఎక్కువ సంక్లిష్టంగా వచ్చాయని తెలిపారు. ‘ఫిజిక్స్‌లో 50 ప్రశ్నలివ్వగా.. 42 సమస్యలతో కూడినవి ఉన్నాయి. అందులోనూ 60% ప్రశ్నలు కష్టంగా ఉన్నాయి. 6 ప్రశ్నలు థియరీ విధానంలో ఇచ్చారు. దాదాపుగా ప్రశ్నలన్నీ ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల నుంచే వచ్చాయి. ముందుగా జీవశాస్త్రం ప్రశ్నలకు సమాధానాలిస్తే సమయం మిగులుతుంది. ఫిజిక్స్‌తో ప్రారంభిస్తే దానికే ఎక్కువ సమయం పడుతుంది’ అని వివరించారు. 

కొంచెం తీపి.. కొంచెం చేదు

రసాయన శాస్త్రం ప్రశ్నలు సులువుగా ఉన్నా సమాధానాలివ్వడానికి ఇబ్బందిపడ్డారని నిపుణులు చెప్పారు. ‘వృక్షశాస్త్రంలో ఎక్కువ నిడివితో కూడిన ప్రశ్నలు సులువుగా ఉన్నా త్వరగా సమాధానాలివ్వలేరు. జీవశాస్త్రం విభాగంలో జతపరచడం (మ్యాచింగ్‌)పై ఇచ్చిన ప్రశ్నలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది. సమయపాలనపై పట్టున్న వారికే ఈసారి ఎక్కువ అవకాశం. ప్రశ్నపత్రం క్లిష్టంగా ఉండటంతో కటాఫ్‌ మార్కులు తగ్గిపోయే అవకాశాలున్నాయి’ అని అన్నారు. 

ఆభరణాలు తొలగించాకే అనుమతి

నిబంధనలపై అవగాహన లేక కొందరు విద్యార్థులు పొడుగు చేతుల చొక్కాలు, విద్యార్థినులు ఆభరణాలు ధరించి పరీక్షా కేంద్రానికి వచ్చారు. వాటిని తొలగించాకే లోపలికి అనుమతించారు. నిబంధనలు, తనిఖీల నేపథ్యంలో విద్యార్థులు కొందరు ట్రాక్‌లు, టీ షర్టులతో పరీక్షకు వచ్చారు.

దేశవ్యాప్తంగా 95% హాజరు 

నీట్‌ ప్రవేశ పరీక్షను దేశవ్యాప్తంగా 202 నగరాల్లోని 3800 కేంద్రాల్లో నిర్వహించారు. 95% మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారని అధికార వర్గాలు తెలిపాయి. గతసారితో పోలిస్తే ఇది పది శాతం ఎక్కువ.

ఫ్యాష‌న్ ప్రపంచంలోకి పిలుస్తోంది...నిఫ్ట్‌

వివిధ లోహాలు... అవి లభించే ముడి పదార్థాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-09-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.