• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ బ‌డ్జెట్ 2023-24

సంక్షేమం, వ్యవసాయం అగ్ర ప్రాధాన్యాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023 - 24 బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. సుమారు ఇరవై శాతం నిధులను సబ్బండ వర్గాల సంక్షేమానికి కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు నిధులు పెంచింది. వ్యవసాయానికి సింహభాగం నిధులు దక్కాయి. రైతుబంధు, రుణమాఫీ, వ్యవసాయ విద్యుత్‌కు నిధుల కేటాయింపులో పెద్దపీట వేసింది. పేదల గృహ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్‌లో నిధులను కేటాయించడంతో పాటు బడ్జెట్‌ వెలుపల నిధులతో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేయనుంది. రానున్న ఆర్థిక సంవత్సరానికి రూ.2,90,396 కోట్ల భారీ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది చివర్లో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఈ బడ్జెట్‌ ప్రాధాన్యం సంతరించుకుంది. కొత్త పథకాల జోలికి పోకున్నా ప్రస్తుతం అమలవుతున్న అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ నిధులను కేటాయించింది. 2018 ఎన్నికల హామీల అమలు లక్ష్యంగా రూ.90 వేల లోపు రుణాలను మాఫీ చేసేందుకు వీలుగా నిధులను కేటాయించింది. దీంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల వాటాను పెంచింది. 

సాగు నీటి శాఖకు రూ.26,885 కోట్లు
తెలంగాణ ఆవిర్భావం తర్వాత సాగునీటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆ రంగానికి పెద్దపీట వేసింది. 2023 - 24వ ఆర్థిక సంవత్సరానికి ఏకంగా రూ.26,885 కోట్లు కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన బడ్జెట్‌ కేటాయింపుల కంటే ఇది సుమారు రూ.6 వేల కోట్లు అదనం. అయితే ఇందులో అధిక మొత్తం ఇప్పటికే తీసుకున్న రుణాలకు తిరిగి చెల్లించే అసలు, వడ్డీకే పోనుంది. దీంతోపాటు ఇతర నిర్వహణ వ్యయం పోనూ భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు, చిన్న నీటి వనరుల పనుల కోసం సుమారు రూ.పదివేల కోట్లు మాత్రమే ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుందని అంచనా. దీన్నిబట్టి చూస్తే బ్యాంకులు, వివిధ ఆర్థిక సంస్థల నుంచి తీసుకునే రుణాలపైనే పలు ప్రాజెక్టుల నిర్మాణ పనుల పురోగతి ఆధారపడి ఉండనుంది. మొత్తం నిధుల్లో కాళేశ్వరానికే సింహభాగం కేటాయించారు. రూ.26,885 కోట్లలో రూ.15,200 కోట్లు (సుమారు 60%) దానికే ఖర్చు చేయనున్నట్లు సర్కారు పేర్కొంది. అయితే, అందులో రూ.12,500 కోట్లు ఇప్పటి వరకు కాళేశ్వరం కార్పొరేషన్‌ ద్వారా తీసుకున్న రుణానికి వడ్డీతో పాటు అసలు తిరిగి చెల్లించడానికి వెచ్చించనున్నారు. వాస్తవంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా రోజూ ఎత్తిపోసే రెండు టీఎంసీల నీటిని ఆయకట్టుకు సరఫరా చేసేలా పనులు పూర్తిచేయడానికి మరో రూ.పది వేల కోట్ల వరకు అవసరం. ఈ ప్రాజెక్టులో భాగంగా సింగూరు వద్ద చేపట్టిన బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలున్నాయి. ఈ రెండింటికీ నాబార్డు ద్వారా రుణం కోసం ప్రయత్నించినా ఇంకా కొలిక్కి రాలేదు. అదనపు టీఎంసీ పనికి మంజూరైన రుణం విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుత కేటాయింపులో నిర్వహణ వ్యయం పోనూ ఈ పనుల కోసం మిగిలింది రూ.2,650 కోట్లు మాత్రమే. అందుకే కేటాయింపుల్లో ఈ మొత్తాన్నే చూపారు. 

నీటి పారుదల అభివృద్ధి కార్పొరేషన్‌ రుణాలకు రూ.3,200 కోట్లు
సీతారామ ఎత్తిపోతల, దేవాదుల, కంతనపల్లి, శ్రీరామసాగర్‌ వరద కాలువ ప్రాజెక్టుల కోసం తెలంగాణ నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్‌ ద్వారా సర్కారు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకుంది. ఇందులో దేవాదుల, వరద కాలువల తాలూకూ రుణానికి అసలు తిరిగి చెల్లించడం ప్రారంభించడంతో పాటు, మిగిలిన ప్రాజెక్టుల రుణాలకు వడ్డీ చెల్లించాల్సి ఉంది. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.3,200 కోట్లు కేటాయించారు.

చెరువుల పునరుద్ధరణకు పెద్దపీట
ఇక మధ్య తరహా ప్రాజెక్టుల పూర్తికి ఈ బడ్జెట్‌లో రూ.335 కోట్లు కేటాయించారు. దీంతో పెండింగ్‌లో ఉన్న పలు ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం ఉంది. అలాగే చెరువుల పునరుద్ధరణ, బాగుకు కూడా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చి రూ.1,300 కోట్లు కేటాయించింది. నిర్వహణకు రూ.380 కోట్లు ఇచ్చింది.

సొంతింటికి బడ్జెట్‌లో రూ.12 వేల కోట్ల కేటాయింపు
సొంతిల్లు లేని పేదలకు కలల లోగిలిని సాకారం చేసేందుకు ఆర్థిక తోడ్పాటును అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సొంత జాగా ఉంటే అందులో ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది. ఇందుకుగాను బడ్జెట్‌లో భారీగా రూ.12 వేల కోట్లు కేటాయించింది. అర్హులైన పేదలకు ఒక్కో ఇంటికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రతిపాదించింది. 2023 - 24 ఆర్థిక సంవత్సరంలో నాలుగు లక్షల ఇళ్ల యూనిట్లలో నియోజకవర్గానికి మూడు వేల మంది చొప్పున రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 3.57 లక్షల మందికి చేయూత లభిస్తుంది. మిగతా 43 వేల యూనిట్లు ముఖ్యమంత్రి కోటా పరిధిలో ఉంటాయి.
2020 మార్చి 8న ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లోనే సొంత స్థలం ఉన్న లక్ష మందికి ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అప్పడు ఒక్కో ఇంటికి రూ.5 లక్షలుగా పేర్కొంది. 2021లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ సాయాన్ని రూ.3 లక్షలుగా కుదించింది. 
కార్మిక శాఖకు రూ.542 కోట్లు 
కార్మిక శాఖకు ప్రభుత్వం రూ.542.18 కోట్లు కేటాయించింది. ఇందులో నిర్వహణ వ్యయం కింద రూ.410.37 కోట్లు చూపించింది. ఈఎస్‌ఐలో మందుల కొనుగోళ్లకు రూ.83.73 కోట్లు, వైద్య ఖర్చుల తిరిగి చెల్లింపుల కింద రూ.10 కోట్లు పేర్కొంది. ప్రగతి పద్దు కింద కేటాయించిన నిధుల్లో ఉపాధి కల్పన సేవలు రూ.1.35 కోట్లు, మల్లేపల్లి ఐటీఐకి రూ.50 లక్షలు, ఐటీఐల అభివృద్ధికి రూ.4 కోట్లు, ఐటీఐ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కింద రూ.కోటి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మిషన్‌ కింద రూ.2 కోట్లు చూపించింది. పారిశ్రామిక అవసరాలకు తగినట్లుగా ఐటీఐలను అభివృద్ధి చేసేందుకు, మౌలిక సదుపాయాల కల్పనకు స్వల్పంగానే నిధులు కేటాయించింది.
ఐటీకి రూ.365 కోట్లు
రాష్ట్రంలో రూ.365.54 కోట్లను ఐటీ రంగానికి ప్రభుత్వం కేటాయించింది. ఐటీ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.150 కోట్లు, వీహబ్‌కు రూ.7.95 కోట్లు, టీ-హబ్‌కు రూ.2 కోట్లు ఇచ్చింది. స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌కు నిధులు రూ.5 కోట్ల నుంచి రూ.8.88 కోట్లకు పెరిగాయి. తెలంగాణ నైపుణ్యాభివృద్ధి కేంద్రం (టాస్క్‌)కు రూ.16 కోట్ల నుంచి రూ.17.89 కోట్లకు నిధుల్ని పెంచింది. సాఫ్ట్‌నెట్‌కు రూ.22.86 కోట్లు, టీ-ఎలక్ట్రానిక్స్‌కు రూ.8 కోట్లు, టీ-వర్క్స్‌కు రూ.5 కోట్లు, టీ-ఫైబర్‌గ్రిడ్‌కు రూ.7 కోట్లు, టీ-ఫండ్‌కు రూ.4 కోట్లు కేటాయించింది. 
ఉపాధి హామీకి నిధుల పెంపు 
పల్లెలకు మళ్లీ కాసుల పంట పండింది. బడ్జెట్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.31,426 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కొత్త పథకాలు లేకున్నా ఉన్న వాటికే నిధులను పెంచింది. ‘పల్లె ప్రగతి’ పథకానికి రూ.3,360 కోట్లు కేటాయించగా, గ్రామీణ రహదారుల మరమ్మతులకు కూడా నిధులను భారీగా పెంచారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులను తగ్గించగా రాష్ట్ర బడ్జెట్‌లో మాత్రం పెంచారు. పల్లె ప్రగతి పనులకు బిల్లుల మంజూరులో జాప్యాన్ని నివారించేందుకు ఈ (2023 - 24) ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వ వాటాతో పాటు, ఆర్థిక సంఘం నిధులను నేరుగా స్థానిక సంస్థల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు వెసులుబాటు కల్పించారు. ఆసరా పింఛన్లకు కేటాయించిన రూ.12 వేల కోట్లు, మిషన్‌ భగీరథకు ఇచ్చిన రూ.600 కోట్లను కలిపితే మొత్తంగా ఈ శాఖకు కేటాయింపు రూ.44,026 కోట్లకు పెరిగింది. 
మిషన్‌ భగీరథ పథకానికి నిరుటితో పోలిస్తే రూ.80 కోట్లు పెంచి బడ్జెట్‌లో రూ.600 కోట్లు కేటాయించారు. జిల్లా పరిషత్‌లకు రూ.256 కోట్లు, మండల పరిషత్‌లకు రూ.187 కోట్లు, గ్రామ పంచాయతీలకు రూ.366 కోట్ల గ్రాంట్లతో పాటు గౌరవ వేతనాలు, కేంద్ర పథకాలకు వాటాగా మొత్తం రూ.2,830 కోట్లను కేటాయించింది. గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణానికి రూ.300 కోట్లు కేటాయించారు.
ఉపాధి హామీ పథకానికి ప్రభుత్వం రూ.1,648 కోట్లను ఇచ్చింది. గత బడ్జెట్‌లో రూ.1,460 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.188 కోట్ల నిధులు పెరిగాయి. ప్రధాన మంత్రి కృషి సించాయ్‌ యోజన, రూర్బన్‌ పథకం, గ్రామీణ జీవనోపాధి మిషన్, గ్రామాల్లో నైపుణ్యశిక్షణ కోసం దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజనకు రూ.408 కోట్ల నిధులు కేటాయించింది. స్వచ్ఛభారత్‌ గ్రామీణ మిషన్‌కు 97.51 కోట్లు ఇచ్చింది. 
ఆసరా పింఛన్లకు గత బడ్జెట్‌లో రూ.11,726.19 కోట్లను ఇవ్వగా ఈసారి ఆ మొత్తాన్ని రూ.12 వేల కోట్లకు పెంచింది. రూ.271.81 కోట్ల మేరకు అదనంగా నిధులు సమకూరనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఆసరాలో 57 ఏళ్ల వారికి పింఛను ఇస్తోంది. దీనిని లెక్కలోకి తీసుకొని కొత్త వారి కోసం అధికంగా నిధులను ఇచ్చారు. 
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలోని స్వయం సహాయక బృందాలకు వడ్డీలేని రుణాల పథకానికి రూ.1500 కోట్లు కేటాయించారు. రుణాల రేటు రికవరీతో పాటు ఎస్‌హెచ్‌జీల ఉత్పత్తులు, వివిధ వ్యాపారాలకు మంచి డిమాండ్‌ ఉంటోంది. గ్రామాల్లో ప్రస్తుతం 4.3 లక్షల స్వయం సహాయక బృందాల్లో 46.68 లక్షల మంది సభ్యులున్నారు. 

వ్యవసాయానికి రూ.26 వేల కోట్లకుపైగా కేటాయింపులు
రాష్ట్ర బడ్జెట్‌లో రైతులపై వరాల వర్షం కురిసింది. సాగు విస్తీర్ణం, దిగుబడుల పెంపు కోసం సాయం చేసే పథకాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిచ్చింది. రైతుబంధు, రుణమాఫీ, రైతుబీమా పథకాలకు భారీగా నిధులు కేటాయించింది. ఈ మూడు పథకాల్లోనూ రైతు కుటుంబాల వారికి నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమవుతాయి. మొత్తం రైతులందరికీ లబ్ధి చేకూర్చేందుకు రైతుబంధు పథకానికి రికార్డు స్థాయిలో రూ.15,075 కోట్లు కేటాయించారు. 2022 - 23 బడ్జెట్‌లో కంటే దాదాపు రూ.వెయ్యి కోట్లు పెంచారు. గతేడాది వానాకాలంలో ఈ పథకం కింద 65 లక్షల మంది రైతులకు ఎకరానికి రూ.5 వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాలో జమచేయగా వచ్చే వానాకాలంలో 70 లక్షల మందికి పైగా రైతులుంటారని నిధులు పెంచినట్లు తెలుస్తోంది. ఏటా వానాకాలం, యాసంగి (రబీ) సీజన్లలో ఎకరానికి రూ.5 వేల చొప్పున మొత్తం కలిపి రూ.10 వేలను ఇవ్వడానికి ఈ నిధులు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అన్ని శాఖల పథకాలను విడివిడిగా గమనిస్తే దళిత బంధు తరవాత అత్యధిక  నిధులు కేటాయించిన రెండో పథకంగా రైతుబంధు నిలిచింది. ఈ పథకం వల్ల వ్యవసాయ భూమి ఉన్న ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతున్నందున దీనికి నిధుల కేటాయింపులో అధిక ప్రాధాన్యమిచ్చారు.

రుణ మాఫీకి రూ.6,385 కోట్లు
గత శాసనసభ ఎన్నికల సందర్భంగా 2018 డిసెంబరు 11 నాటికి బ్యాంకులో రూ.లక్ష వరకూ పంటరుణం బాకీ ఉంటే మాఫీ చేస్తామని అప్పట్లో తెరాస (ప్రస్తుత భారాస) హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తరవాత ఇప్పటికే రెండు దఫాలుగా రూ.37 వేల వరకూ బాకీ ఉన్న రైతుల రుణాల మాఫీకి ప్రభుత్వం బ్యాంకులకు నిధులు చెల్లించింది. తాజా బడ్జెట్‌లో రూ.6,385 కోట్లు కేటాయించింది. ఈ సొమ్మునంతా ప్రభుత్వం బ్యాంకులకు విడుదల చేస్తే రూ.90 వేల వరకూ బకాయి ఉన్న రైతులందరి పంటరుణాలు మాఫీ అవుతాయని ప్రభుత్వ అంచనా. రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకూ బాకీ ఉన్నవారి రుణాల మాఫీకి అవసరమైన నిధుల గురించి బడ్జెట్‌లో ప్రస్తావించలేదు.
భూమి ఉన్న రైతుల్లో 18 నుంచి 59 ఏళ్ల వయసు గల రైతులందరికీ రూ.5 లక్షల జీవిత బీమా కల్పించడానికి ఏటా రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఐసీకి ప్రీమియం చెల్లిస్తోంది. రైతు బీమా పేరుతో అమలు చేస్తున్న ఈ పథకానికి బడ్జెట్‌లో రూ.1,589 కోట్లు కేటాయించింది. ఏదైనా కారణంతో రైతు మరణిస్తే నామినీకి రూ.5 లక్షలను ఎల్‌ఐసీ అందజేస్తుంది. 
యంత్రాలకు రూ.500 కోట్లు..
కూలీల కొరతను అధిగమించేందుకు వ్యవసాయ యంత్రాలను రాయితీపై ఇవ్వడానికి రూ.500 కోట్లను కేటాయించారు. 
శ్రీ కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయానికి క్రితం బడ్జెట్‌లో రూ.92.50 కోట్లు నిర్దేశించగా ఈసారీ అంతే కేటాయించారు. 
పంటలను మద్దతు ధరకు కొనేందుకు ఉద్దేశించిన మార్కెట్‌ జోక్యం పథకానికి గత బడ్జెట్‌లో రూ.100 కోట్లు ఇవ్వగా ఇప్పుడూ అంతే ఉంది. 
ఉద్యాన శాఖలో బిందు సేద్యం పథకానికి ‘కేంద్ర ప్రాయోజిత పథకం’ కింద రాష్ట్ర వాటాగా రూ.114.50 కోట్లను నిర్దేశించారు. 
రాష్ట్రంలో వంట నూనెల కొరతను దృష్టిలో పెట్టుకుని పామాయిల్‌ ఉత్పత్తి లక్ష్యంగా ఆయిల్‌పాం తోటల సాగుకు రాయితీల పద్దు కింద ప్రత్యేకంగా రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో మరే పంట సాగుకు విడిగా ఇంత భారీగా రాయితీ నిధులు కేటాయించలేదు.
సహకార శాఖకు గత బడ్జెట్‌లో రూ.129 కోట్లు పెట్టగా ఈసారి రూ.141.19 కోట్లు ఉంది. వీటిలో ఈ శాఖ ఉద్యోగుల జీతభత్యాలు, శిక్షణ కార్యక్రమాలకే ఎక్కువగా ఖర్చు చేయనున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఈ శాఖ పద్దులో ప్రత్యేకంగా నిధులేమీ ప్రత్యేకించలేదు. 
పశుసంవర్ధక శాఖకు గత బడ్జెట్‌లో రూ.1,495.13 కోట్లు నిర్దేశించగా ఈసారి రూ.1,560.32 కోట్లు కేటాయించారు. మత్స్యరంగం అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.100 కోట్లు పెట్టారు. 
గొర్రెల పంపిణీ పథకం అమలుకు రాష్ట్ర గొర్రెలు, మేకలు అభివృద్ధి సమాఖ్య గతంలో జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుంచి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించేందుకు రూ.757.89 కోట్లు కేటాయించారు.

మొత్తం బడ్జెట్‌లో వైద్య శాఖకు కేటాయింపులు 4.87 శాతం
వైద్య ఆరోగ్య శాఖకు నిధుల భాగ్యం ఇనుమడించింది. గతేడాది (2022 - 23) బడ్జెట్‌ కేటాయింపులతో పోల్చితే.. ఈ ఏడాది (2023 - 24) దాదాపు రూ.923.67 కోట్లను ప్రభుత్వం అధికంగా కేటాయించింది. ప్రగతి పద్దు (జీతభత్యాలు మినహా అభివృద్ధి పనులకు కేటాయించిన మొత్తం) మాత్రమే పరిశీలిస్తే.. గతేడాది కంటే రూ.823.93 కోట్ల నిధులను అధికంగా పెంచడం విశేషం. మొత్తం బడ్జెట్‌ కేటాయింపులు పరిశీలిస్తే గతేడాది వైద్యశాఖకు 4.3 శాతం నిధులు కేటాయించగా ఈ ఏడాది 4.87 శాతానికి పెరగడం ఆహ్వానించదగిన పరిణామమేనని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వ వైద్యంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాష్ట్రంలో కొత్తగా నెలకొల్పనున్న వైద్య కళాశాలల కోసం రూ.1,000 కోట్లను కేటాయించింది.హైదరాబాద్‌ నలువైపులా గచ్చిబౌలి, ఎల్బీనగర్, ఆల్వాల్, ఎర్రగడ్డల్లో రూ.2,679 కోట్లతో నిర్మించనున్న 4 సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల ద్వారా కొత్తగా 4,200 పడకలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలకు అవసరమైన నిధులను బ్యాంకుల నుంచి అప్పు రూపంలో తీసుకోనున్నారు. దీనికి అవసరమైన మ్యాచింగ్‌ గ్రాంట్‌ నిధుల కోసం రూ.500 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించేందుకు రూ.70 కోట్లు, పారిశుద్ధ్య భద్రత నిర్వహణ కోసం రూ.108 కోట్లను ఇచ్చారు. కొవిడ్‌ తదనంతర పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఔషధాలు, శస్త్రచికిత్స పరికరాలు, ప్రయోగశాలల్లో వినియోగించే రసాయనాలకు నిధులను భారీగా కేటాయించింది. గత ఏడాది డిసెంబరులో కొత్తగా ప్రారంభించిన ‘కేసీఆర్‌ పౌష్టికాహార కిట్‌’ పథకాన్ని ప్రస్తుతం ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కుమురంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్‌కర్నూల్, వికారాబాద్‌ జిల్లాల్లో అమలు చేస్తుండగా ఈ ఏడాది అన్ని జిల్లాల్లోనూ విస్తరించనున్నారు. ఈ పథకానికి బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించారు. దీనివల్ల రాష్ట్రంలోని నాలుగు లక్షల మంది గర్భిణులకు ప్రయోజనం చేకూరనుంది. ఆరోగ్యశ్రీ పథకానికి రూ.1,101.00 కోట్లు కేటాయించారు.

వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించిన నిధుల్లో ప్రభుత్వం గత నాలుగేళ్లుగా సగటున 75 శాతం విడుదల చేస్తోంది. కేటాయింపుల్లో సుమారు 25 శాతం వరకూ నిధులు విడుదల చేయకపోవడంతో ఆ మేరకు ప్రతికూల ప్రభావం పడింది.  
ఉద్యోగుల ఆరోగ్యానికి ప్రత్యేక ట్రస్టు
ఉద్యోగులు, పింఛనుదారులు, పాత్రికేయుల ఆరోగ్య పథకాన్ని ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ప్రత్యేక ట్రస్టు లేకపోవడం వల్ల పర్యవేక్షణ లోపిస్తోందనీ, నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందనీ, తామూ 1 శాతం వరకూ వాటా చెల్లిస్తామని చాన్నాళ్లుగా ఉద్యోగస్తులు ప్రభుత్వానికి విన్నవిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్‌లో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ట్రస్టు నెలకొల్పాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగులు కూడా భాగస్తులవుతారు. దీనికి సంబంధించిన విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈ బడ్జెట్‌లో ఉద్యోగుల ఆరోగ్య పథకానికి రూ.211.86 కోట్లు, పెన్షనర్ల ఆరోగ్య పథకానికి రూ.150.00 కోట్లు, పాత్రికేయుల ఆరోగ్య పథకానికి రూ.45.83 కోట్లను కేటాయించింది.

మెట్రో ప్రాజెక్టులకు రూ.2500 కోట్లు 
మెట్రోరైలు ప్రాజెక్టులకు రాష్ట్ర బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. గత బడ్జెట్‌ కంటే అధికంగా నిధులను ప్రతిపాదించారు. 2023 - 24 ఆర్థిక సంవత్సరానికి మూడు ప్రాజెక్టులకూ కలిపి రూ.2500 కోట్లు కేటాయించినట్లు బడ్జెట్‌ పద్దుల్లో చూపించారు. హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ ఏర్పడినప్పటి నుంచి ఇవే అత్యధిక కేటాయింపులు. నష్టాల్లో ఉన్న హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌)కు రూ.1500 కోట్లు, పాతబస్తీలో మెట్రో పనులు ప్రారంభించేందుకు రూ.500 కోట్లు, విమానాశ్రయ మెట్రో (హెచ్‌ఏఎంఎల్‌)కు రూ.500 కోట్లను ఇవ్వాలని నిర్ణయించారు. గత బడ్జెట్‌లో ఈ మూడు ప్రాజెక్ట్‌లకు రూ.2377.35 కోట్లను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.  
విమానాశ్రయ మెట్రో..
రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు 31 కి.మీ. మెట్రో మార్గానికి 2 నెలల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. దీనికి ఈ బడ్జెట్‌లో రూ.500 కోట్ల కేటాయింపుతో టెండర్లు పిలిచి పనులు మొదలెట్టే అవకాశం ఉంది. 
పాతబస్తీ మెట్రో..
మెట్రో తొలి దశలో అలైన్‌మెంట్‌ వివాదాలతో ఆగిన ఎంజీబీఎస్‌ - ఫలక్‌నుమా వరకు 5.5 కి.మీ. మెట్రోకు ఈ బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించారు. పనులు పూర్తి చేయడానికి రూ.2 వేల కోట్ల దాకా అవుతుందని అంచనా. గత బడ్జెట్‌లోనూ రూ.500 కోట్లు కేటాయించినా నిధులు మంజూరు కాలేదు. 
హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థకు.. 
మెట్రో తొలిదశ 69.2 కి.మీ. ప్రాజెక్ట్‌ను తమ సొంత నిధులతో ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో సంస్థ నిర్మించి నిర్వహిస్తోంది. దీనికి ఈ బడ్జెట్‌లో రూ.1,500 కోట్లను ప్రతిపాదించారు. 

దళిత బంధు పథకానికి రూ.17,700 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకానికి బడ్జెట్‌లో భారీగా రూ.17,700 కోట్లు కేటాయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాదాపు 1.77 లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో 1,500 మందికి రూ.10 లక్షల చొప్పున యూనిట్లు మంజూరు చేయనుంది. ప్రస్తుత (2022 - 23) ఆర్థిక సంవత్సరంలో తొలుత నియోజకవర్గానికి 1,500 మంది లబ్ధిదారులకు మంజూరు లక్ష్యంగా ప్రభుత్వం రూ.17,700 కోట్లు కేటాయించింది. అనంతరం ఈ లక్ష్యాన్ని నియోజకవర్గానికి 500 మందికి తగ్గిస్తూ బడ్జెట్‌ అంచనాలను రూ.11 వేల కోట్లకు పరిమితం చేసింది. ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల సిఫారసులు అక్కర్లేదని హైకోర్టు ఇటీవల స్పష్టం చేసిన నేపథ్యంలో దీనిపై స్పష్టత ఇవ్వాలని, విధివిధానాలను జారీ చేయాలని ప్రభుత్వానికి ఎస్సీ సంక్షేమశాఖ లేఖ రాసింది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. దీంతో ఈ ఏడాది ఎంపిక నిలిచిపోయింది. ఈ ఏడాది కేటాయించిన రూ.17,700 కోట్లలో రూ.2 వేల కోట్లను విడుదల చేసినప్పటికీ.. రూపాయి కూడా ఖర్చు చేసే పరిస్థితి లేకుండా పోయింది.

సంక్షేమ శాఖలన్నింటికీ కలిపి రూ.33,416 కోట్లు
రాష్ట్రంలో బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యమిచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు 2023 - 24 బడ్జెట్‌లో నిధుల కేటాయింపులను పెంచింది. ఉపకార వేతనాలు, స్వయం ఉపాధి పథకాలు, కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్‌ పథకాలకు ప్రాధాన్యమిచ్చింది. దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించింది. సంక్షేమ వర్గాల బడ్జెట్‌లో ఈ ఒక్క పథకానికే చేసిన కేటాయింపులు దాదాపు సగం ఉండటం గమనార్హం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖలకు కలిపి రూ.33,416.79 కోట్లను సర్కారు కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది దాదాపు రూ.1,950 కోట్లు అధికం.

పెరిగిన కల్యాణలక్ష్మి కేటాయింపులు
కల్యాణలక్ష్మి పథకానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,750 కోట్లు కేటాయించగా వచ్చే ఏడాదికి రూ.3,210 కోట్లకు ప్రభుత్వం పెంచింది. పేదింటి ఆడపిల్లల వివాహానికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ కింద ప్రభుత్వం రూ.1,00,116 చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. ఇప్పటివరకు 12 లక్షల మందికి మంజూరైంది. 2023 - 24 సంవత్సరానికి ఎస్సీ సంక్షేమశాఖకు రూ.500 కోట్లు, ఎస్టీ సంక్షేమ శాఖకు రూ.260 కోట్లు, బీసీ సంక్షేమ శాఖకు రూ.2,000 కోట్లు, మైనార్టీ సంక్షేమ శాఖకు రూ.450 కోట్లు కేటాయించింది.

స్వయం ఉపాధికి రూ.1,533 కోట్లు
సంక్షేమ వర్గాల స్వయం ఉపాధి పథకాలకు బడ్జెట్‌లో రూ.1,533.45 కోట్లు కేటాయించింది. ఎస్సీ కార్పొరేషన్‌ పరిధిలో దళిత బంధు మినహా ఇతర పథకాలకు రూ.140 కోట్లు మాత్రమే ఇచ్చింది. గిరిజన ఆర్థిక సహకార సొసైటీ (ట్రైకార్‌) కింద వివిధ పథకాలకు ప్రస్తుత బడ్జెట్‌ కంటే రూ.60 కోట్లు పెంచి రూ.523.45 కోట్లు కేటాయించింది. ఇందులో స్వయం ఉపాధి పథకాలకు రూ.323.45 కోట్లు, భూమి అభివృద్ధి పథకం (గిరివికాసం)కు రూ.150 కోట్లు, సీఎం ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల పథకానికి రూ.50 కోట్లు ఇచ్చింది.
‣ ఎంబీసీ, బీసీ కార్పొరేషన్‌లకు రూ.300 కోట్ల చొప్పున నిధులిచ్చింది. వీటిలో బీసీ ఫెడరేషన్లకు కలిపి రూ.51.30 కోట్లు కేటాయించింది. గీత కార్మికుల సంక్షేమానికి రూ.30 కోట్లు ఇచ్చింది. 
‣ స్వయం ఉపాధి రుణాలకు క్రిస్టియన్‌ మైనార్టీ కార్పొరేషన్‌కు రూ.2.57 కోట్ల నుంచి రూ.120 కోట్లకు, మైనార్టీ ఆర్థిక సహకార సంస్థకు రూ.28.31 కోట్ల నుంచి రూ.150 కోట్లకు కేటాయింపులను పెంచింది. 
గురుకులాలకు రూ.2,289 కోట్లు
సంక్షేమ గురుకుల సొసైటీలకు కేటాయింపులు పెద్దగా పెరగలేదు. అత్యధికంగా 329 గురుకుల విద్యాలయాలున్న బీసీ సొసైటీకి రూ.397.50 కోట్లు ఇవ్వగా ఎస్సీ గురుకులాలకు రూ.1,145.86 కోట్లు, గిరిజన గురుకులాలకు రూ.522.8 కోట్లు, మైనార్టీ గురుకులాలకు రూ.222.92 కోట్లు ఇచ్చారు.
విదేశీ విద్య పథకానికి రూ.273 కోట్లు
విదేశీ విద్య పథకానికి అన్ని సంక్షేమ శాఖల్లోనూ నిధుల కేటాయింపులు పెరిగాయి. మైనార్టీ విద్యార్థుల నిధులను రూ.100 కోట్ల నుంచి రూ.118 కోట్లకు, బీసీల కోసం మహాత్మా జ్యోతిబా ఫులే విదేశీ విద్య పథకానికి రూ.60 కోట్ల నుంచి రూ.70.80 కోట్లకు పెంచింది. ఎస్సీలకు అంబేడ్కర్‌ విదేశీ విద్య పథకం కింద రూ.20 కోట్లు పెంచి రూ.65 కోట్లు కేటాయించింది. ఎస్టీలకు రూ.20 కోట్లు ఇవ్వనుంది.
బోధన రుసుములు, ఉపకారానికి రూ.2,850 కోట్లు 
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులకు బోధన రుసుములు, ఉపకార వేతనాలకు నిధులు పెరిగాయి. పోస్టుమెట్రిక్‌ ఉపకార వేతనాలకు దాదాపు రూ.400 కోట్లు పెరిగాయి. సంక్షేమ శాఖలన్నింటికీ కలిపి మొత్తం రూ.2,850.37 కోట్లు కేటాయించారు.  
తాజా బడ్జెట్‌లో బీసీ సంక్షేమ శాఖకు ఉపకార వేతనాల బడ్జెట్‌ను రూ.250 కోట్లు పెంచుతూ రూ.1,568.65 కోట్లు కేటాయించింది. ఎస్సీ సంక్షేమ శాఖకు రూ.605.26 కోట్లు, ఎస్టీ సంక్షేమ శాఖకు రూ.369.66 కోట్లు, మైనార్టీ సంక్షేమ శాఖకు రూ.306.8 కోట్లు ఇచ్చింది. 

విద్యుత్తుకు బడ్జెట్‌లో రూ.12,715 కోట్ల కేటాయింపు
విద్యుత్‌ రంగానికి సర్కారు ఈ దఫా కేటాయింపులు పెంచింది. ఇంధన శాఖ పద్దు కింద వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023 - 24) బడ్జెట్‌లో రూ.12,715.20 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌లో సవరణ కేటాయింపులు రూ.12,198 కోట్లు కాగా, ఈసారి అదనంగా రూ.516.50 కోట్లు ఇచ్చింది. మొత్తం కేటాయింపుల్లో రూ.11,500 కోట్లు వచ్చే ఆర్థిక సంవత్సరంలో సాగుకు ఉచితంగా, ఇతర వర్గాలకు తక్కువ ఛార్జీలకు సరఫరా చేస్తున్న కరెంటుగానూ రాయితీలకు, ఎత్తిపోతల పథకాలు, మిషన్‌ భగీరథ పథకానికి వినియోగిస్తున్న విద్యుత్తుగానూ ఛార్జీల పద్దు కింద ఖర్చు చేయనున్నట్టు పేర్కొంది. డిస్కంలకు గతంలో వాటిల్లిన నష్టాలను భరించేందుకు రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపింది. మొత్తంగా గత బడ్జెట్‌తో పోలిస్తే రాయితీలకు రూ.వెయ్యి కోట్లు అదనంగా కేటాయింపులు చేసింది.


ప్రగతి చక్రాలకు ఊతంరాష్ట్ర బడ్జెట్‌లో ఆర్టీసీకి 2022 - 23 బడ్జెట్‌లో మాదిరిగానే కేటాయింపులు జరిగాయి. భారీ నష్టాల నుంచి రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. బడ్జెట్‌లో భారీ నిధుల కేటాయింపు ఉంటుందని ఆర్టీసీ ఉద్యోగులు భావించినప్పటికీ 2023 - 24 ఆర్థిక సంవత్సరానికి రూ.1,500 కోట్లే కేటాయించింది. ఇందులో రూ.850 కోట్లు విద్యార్థులు, వివిధ వర్గాలకు ఇస్తున్న బస్‌పాస్‌ల రాయితీల మొత్తమే. ఇది ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఇవ్వాల్సిన మొత్తమే కావడం గమనార్హం. ఇక రుణాలకు సంబంధించి ప్రభుత్వం ఆర్టీసీకి రూ.650 కోట్లు కేటాయించింది. 
పట్నం పరిఢవిల్లేలా..
పురపాలికలు, నగరపాలక సంస్థల్లో మౌలిక సదుపాయాలకు ప్రత్యేక టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా రూ.300 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. 2023 - 24 ఆర్థిక సంవత్సరంలో రూ.11,082 కోట్లను పురపాలనకు కేటాయించింది. ఇందులో రూ.7,176 కోట్లను ప్రగతిపద్దు కింద, రూ.3,906 కోట్లు నిర్వహణ పద్దు కింద కేటాయించారు. వరంగల్, కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీలకు రూ.200 కోట్ల చొప్పున కేటాయించగా అమృత్‌ కింద పట్టణాల అభివృద్ధికి రూ.150 కోట్లను ప్రతిపాదించారు. మిషన్‌ భగీరథ అర్బన్‌కు రూ.1,000 కోట్ల కేటాయింపులు దక్కాయి. పట్టణాల్లో సమీకృత శాకాహార, మాంసాహార మార్కెట్‌లకు రూ.400 కోట్లు, వైకుంఠధామాల నిర్మాణానికి రూ.100 కోట్లు ప్రతిపాదించారు. పట్టణాల్లో స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు రూ.300 కోట్లు ఇవ్వనున్నారు. 

ప్రచారం హోరెత్తాలి..
తెలంగాణ సమాచార, పౌరసంబంధాల శాఖకు భారీగా నిధులు పెరిగాయి. 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో రూ. 174.71 కోట్లు కేటాయించగా ఈ ఏడాది దానిని రూ. 1,026.71 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఈ ఏడాది కేటాయింపుల్లో పత్రికల్లో ప్రచారానికి రూ.337 కోట్లు, అవుట్‌డోర్‌ ప్రచారానికి రూ.337 కోట్లు, ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రచారానికి రూ.326 కోట్లు నిర్దేశించింది. ఈ మూడు విభాగాల్లోనే కేటాయింపులు రూ.1,000 కోట్లు అయ్యాయి. గతంలో ఈ మూడు విభాగాలకు కలిపి కేటాయింపులు రూ.148 కోట్లను మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. ఈసారి రూ.852 కోట్లు పెరిగాయి. కొత్త బడ్జెట్‌లో జర్నలిస్టుల సంక్షేమ నిధికి రూ.10 కోట్లు, చలనచిత్ర ప్రోత్సాహకాలకు రూ.4 కోట్లు, తెలంగాణ ప్రెస్‌ అకాడమీకి రూ.48 లక్షలు, నాటక సమాజానికి సాయంగా రూ.30 లక్షలను కేటాయించింది.  
ప్రజా పంపిణీకి ఉదారంగా..
రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో పౌరసరఫరాల శాఖకు రూ.3,117 కోట్ల నిధులు కేటాయించారు. గత ఏడాది కంటే ఈసారి అదనంగా రూ.1,259 కోట్ల నిధులు కేటాయించారు. అత్యధికంగా రూపాయికి కిలో సబ్సిడీ బియ్యానికి రూ.1,879 కోట్ల నిధులు ఇవ్వనున్నారు. రాష్ట్రంలో 91.64 లక్షల ఆహార భధ్రత కార్డులు ఉన్నాయి.

పరిశ్రమలకు వెన్నుదన్ను..
తెలంగాణ పారిశ్రామికవేత్తలకు ఇకపై నిర్ణీత సమయానికి ప్రోత్సాహకాలు, రాయితీలు అందనున్నాయి. పరిశ్రమల శాఖ బడ్జెట్‌ 2022 - 23 కంటే ఈసారి మరో 15 శాతం పెరిగింది. నిరుడు ఇందుకు కేటాయింపులు రూ.3,496 కోట్లు ఉండగా ఈసారి రూ.4,037 కోట్లకు చేరాయి. కేటాయించిన మొత్తంలో రూ.3,520 కోట్ల నిధుల (85 శాతం)ను రాయితీలు, ప్రోత్సాహకాలకు ఇచ్చింది. తెలంగాణ నిర్మిస్తున్న ఔషధనగరి, నిమ్జ్, కాకతీయ మెగా జౌళిపార్కు, ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తి సమూహాలతో పాటు వచ్చే అయిదేళ్లలో 70 కొత్త పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 7,150 ఎకరాల్లో కొత్తగా 21 ఆహార శుద్ధి ప్రత్యేక మండళ్లను ఏర్పాటు చేయనుంది. వీటిలో మౌలిక వసతుల కోసం రూ.400 కోట్ల మేర నిధులను కేటాయించింది. సూక్ష్మ పరిశ్రమల కోసం రూ.14 కోట్లు, రామగుండంలోని ఎరువుల కర్మాగారంలో ఈక్విటీకి రూ.10 కోట్లు, నిమ్స్‌లో భూసేకరణకు రూ.30 కోట్లు కేటాయించింది. తోలు పరిశ్రమల అభివృద్ధి సంస్థకు రూ.5 కోట్లు ఇచ్చింది.

చేనేతకు చేయూత
చేనేత, జౌళి శాఖకు ప్రభుత్వం కొత్త బడ్జెట్‌లో నిధులను స్వల్పంగా పెంచింది. 2022 - 23 బడ్జెట్‌లో చేనేతకు రూ.460 కోట్ల మేర కేటాయింపులు జరపగా ఇపుడు రూ.468 కోట్లను కేటాయించింది. ఇందులో బతుకమ్మ చీరల పథకానికి రూ.400 కోట్లు, నేతన్నల బీమా పథకానికి రూ.50 కోట్లను కేటాయించింది. రాష్ట్రంలో నేతన్నలకు బీమాను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఎవరైనా కార్మికులు మరణిస్తే వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందుతుంది.
సీఎం ప్రత్యేక అభివృద్ధి నిధికి రూ.10,348 కోట్లు
బడ్జెట్‌లో ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్‌డీఎఫ్‌)కి భారీగా కేటాయింపులు చేశారు. గత ఏడాది ఈ పద్దు రూ.2 వేల కోట్లు కాగా ఈసారి రూ.10,348 కోట్లకు పెంచారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (సీడీపీ) కింద తాజా బడ్జెట్‌లో రూ.800 కోట్లు కేటాయించారు. సీడీపీ కింద ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఏటా రూ.5 కోట్లు వంతున ప్రభుత్వం మంజూరు చేస్తోంది. సీఎం ఎస్‌డీఎఫ్‌ నుంచి నిధుల మంజూరుకు ముఖ్యమంత్రికి విచక్షణాధికారం ఉంటుంది. ఆయన పలు సందర్భాల్లో జిల్లాలు, నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలకు వెళ్లినప్పుడు ప్రత్యేక నిధులను ప్రకటిస్తున్నారు. ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం విస్తృతంగా జిల్లాల్లో పర్యటించి.. సభలు, సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆయా నియోజకవర్గాలపై వరాల జల్లు కురిపించే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా ఎస్‌డీఎఫ్‌ నిధుల కేటాయింపు జరిగినట్లు తెలుస్తోంది. సీఎం ఈ నిధులను ప్రకటిస్తే ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పనులు జరుగుతాయి. జిల్లాలకు నిధులు కేటాయిస్తే కలెక్టర్ల ఆధ్వర్యంలో వాటిని వినియోగిస్తారు.

విద్యా రంగానికి రూ.19,093 కోట్లు కేటాయింపు
రాష్ట్రంలో విద్యా శాఖకు కేటాయింపులు ఈసారి రూ.3 వేల కోట్లు పెరిగాయి. గత ఏడాది బడ్జెట్‌లో రూ.16,063 కోట్లు కేటాయించగా తాజా బడ్జెట్‌లో అది రూ.19,093 కోట్లకు చేరింది. గతేడాదితో పోలిస్తే కేటాయించిన మొత్తం 19 శాతం పెరిగినా మొత్తం బడ్జెట్‌లో విద్యాశాఖ వాటా మాత్రం తగ్గుతూ వస్తోంది. 2014 - 15లో బడ్జెట్‌లో విద్యాశాఖకు 10.80 శాతం కేటాయించగా 2019 - 20 నాటికి 6.77 శాతానికి తగ్గింది. తాజా బడ్జెట్‌లో అది 6.57 శాతానికి పడిపోయింది. తాజాగా పెరిగిన రూ.3,050 కోట్లలో రూ.500 కోట్లు వర్సిటీల్లో మౌలిక వసతుల కల్పనకు కేటాయించారు. ఈసారి కేంద్ర ప్రభుత్వం కొత్తగా పీఎంశ్రీ అనే పథకం కింద మండలానికి రెండు చొప్పున ప్రభుత్వ బడులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయనుంది. అందుకే ఈసారి సమగ్ర శిక్షాభియాన్‌కు కేంద్ర, రాష్ట్ర వాటా కింద మొత్తం రూ.1,100 కోట్లు చూపారు. అందులో రాష్ట్ర వాటా 40 శాతం భరించాల్సి ఉంటుంది. ఇది గత బడ్జెట్‌తో పోల్చుకుంటే దాదాపు రూ.301 కోట్లు అధికం. మధ్యాహ్న భోజనం కార్మికుల గౌరవ వేతనం రూ.1,000 నుంచి రూ.3 వేలకు పెంచడంతో మరో రూ.108 కోట్లు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇస్తున్న నేపథ్యంలో వారి వేతనాలు పెరగనున్నాయి. బడ్జెట్‌లో 85 శాతం సిబ్బంది వేతనాలకే ఖర్చవుతున్నాయి.

విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లు
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించింది. నాలుగేళ్ల తర్వాత మరోసారి సిబ్బంది వేతనాలకు బ్లాక్‌గ్రాంట్‌తో పాటు హాస్టళ్లు, ఇతర సౌకర్యాలను మెరుగు పరిచేందుకు నిధులు ఇవ్వనుంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా 2017 - 18లో ఎనిమిది విశ్వవిద్యాలయాలకు రూ.420 కోట్లు, 2018 - 19లో రూ.210 కోట్లు కేటాయించింది. అందులో విడుదల చేసింది మాత్రం సగానికి మించలేదు. ఈసారి వర్సిటీల్లో మౌలిక వసతులను పెంచాల్సిన అవసరాన్ని పలువురు ఉపకులపతులు విద్య, ఆర్థిక శాఖ మంత్రులు, అధికారులకు వివరించారు. ఈక్రమంలోనే ప్రభుత్వం నిధులు కేటాయించింది. గతంలో మాదిరిగా వర్సిటీల వారీగా అభివృద్ధి నిధుల కేటాయింపును బడ్జెట్‌లో పేర్కొనలేదు. జేఎన్‌టీయూహెచ్‌ తమకు ఒక్కరికే రూ.500 కోట్లు కావాలని నిధులు కావాలని ప్రతిపాదించింది. ఓయూ, కాకతీయ కూడా రూ.200 కోట్ల చొప్పున కోరాయి. చివరకు అన్ని వర్సిటీలకు రూ.500 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. గత బడ్జెట్‌లోనే కోఠి మహిళా కళాశాలను వర్సిటీగా ఉన్నతీకరిస్తామని, అందుకు రూ.100 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పిన సర్కారు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. తాజా బడ్జెట్‌లో మళ్లీ రూ.100 కోట్లు కేటాయిన్నట్లు ప్రకటించింది.
ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధికి రూ.51,983 కోట్లు
ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమానికి ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్‌డీఎఫ్‌) కింద రూ.51,983.09 కోట్లు కేటాయించారు. ఇందులో ఎస్సీల ఎస్‌డీఎఫ్‌కు గాను రూ.36,750.48 కోట్లు, ఎస్టీల ఎస్‌డీఎఫ్‌ కింద రూ.15,232.61 కోట్ల మేర ఇచ్చారు. ఈ నిధి నుంచి అత్యధికంగా నియోజకవర్గాల అభివృద్ధి, ఆరోగ్యశ్రీ, రెండు పడక గదుల ఇళ్లు, పెట్టుబడి రాయితీ పథకం, సబ్సిడీ బియ్యం, రైతులకు ఉచిత విద్యుత్‌ తదితర పథకాల కింద ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టు మెట్రో కనెక్టివిటీ కోసం ఎస్సీ ఎస్‌డీఎఫ్‌ నుంచి రూ.77.25 కోట్లు, ఎస్టీ ఎస్‌డీఎఫ్‌ నుంచి రూ.45.40 కోట్లు కేటాయించింది. నాన్‌ డివిజబుల్‌ కేటగిరీ కింద రవాణా, నీటి పారుదల రంగాలకు కలిపి రూ.1,466.30 కోట్లుగా పేర్కొంది.

బడ్జెట్‌లో రహదారులు - భవనాలకు రూ.6,859 కోట్లు
రహదారుల మరమ్మతులకు ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇచ్చింది. గతంలో మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరసల, ఇతర లింకు రోడ్ల నిర్మాణాలు చేపట్టగా చాలాచోట్ల గుంతలు పడ్డాయి. దీంతో ఈసారి వాటి నిర్వహణపై సర్కారు దృష్టిపెట్టింది. 2023 - 24 బడ్జెట్‌లో రహదారులు, భవనాల శాఖకు రోడ్ల కోసం రూ.6,859 కోట్లు కేటాయించింది. దీనిలో మరమ్మతులు, నిర్వహణకు రూ.2,500 కోట్లు, కొత్త నిర్మాణాలకు రూ.2,075 కోట్లు చూపించారు. ఇందులోనూ మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు కొన్నిచోట్ల నిర్మించాల్సిన రహదారులకు రూ.200 కోట్లు ఉన్నాయి. రైల్వే అండర్, ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణానికి రూ.400 కోట్లు కేటాయించారు. 

వామపక్ష తీవ్రవాద ప్రాంతాలకు రూ.498 కోట్లు
వామపక్ష తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాలను బాహ్య ప్రపంచంతో అనుసంధానించేందుకు ఈ ఏడాది రూ.498 కోట్లు కేటాయించారు. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్‌ తదితర జిల్లాల్లో నక్సలిజం ఉనికి లేకుండా చేసేందుకు అక్కడి ప్రజలు, గిరిజనులకు రవాణా సౌకర్యాలు కల్పించాలనేది ఎల్‌డబ్ల్యూఈడబ్ల్యూ పనుల ప్రధాన ఉద్దేశం. 

సచివాలయ నిర్మాణానికి రూ.400 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో నిర్మిస్తున్న బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయ నిర్మాణానికి రూ.400 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌లోనూ ఇంతే మొత్తం ఇచ్చింది. పనులు చివరి దశకు చేరుకోగా వచ్చే 17న ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 
పర్యాటక, సాంస్కృతిక శాఖలకు రూ.1,117 కోట్లు 
పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖలకు బడ్జెట్‌లో రూ.1,117 కోట్ల నిధులు దక్కాయి. వీటిలో అత్యధికంగా పర్యాటక శాఖకు ప్రభుత్వం కేటాయించింది. కాళేశ్వరం సర్క్యూట్‌ టూరిజం అభివృద్ధికి రూ.750 కోట్లు ఇచ్చింది. గత సంవత్సరం కూడా రూ.750 కోట్లు కేటాయించినా ఖర్చు చేయలేదు. కాళేశ్వరం సర్క్యూట్‌ టూరిజం అభివృద్ధికి ఇటీవల టెండర్లు పిలిచారు. దీంతో రానున్న ఆర్థిక సంవత్సరంలో ఈ జల పర్యాటక ప్రాజెక్టు ముందుకెళ్లే అవకాశం ఉంది. బేగంపేటలో బుద్ధవనం ప్రాజెక్టుకు రూ.61 లక్షలు, నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం ప్రాజెక్టుకు రూ.38.15 లక్షలు కేటాయించారు. పురావస్తుశాఖ జరిపే తవ్వకాలకు రూ.15 లక్షలు మాత్రమే ఇచ్చారు. 

పోలీసు శాఖ ప్రగతి పద్దు రూ.474.85 కోట్లు
ప్రగతి పద్దు కింద పోలీసు శాఖకు బడ్జెట్‌లో రూ.474.85 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌్ (2022 - 23)లో రూ.1,104.85 కోట్లు కేటాయించగా ఈసారి కేటాయింపులు తగ్గాయి. ఇందుకు ప్రధాన కారణం పోలీసు భవనాలు, రిసెప్షన్‌ కేంద్రాలు వంటి మౌలిక వసతుల కల్పన దాదాపు పూర్తికావడంతో వాటికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సిన అవసరం తప్పింది. కొత్త పోలీస్‌స్టేషన్లు, క్వార్టర్ల నిర్మాణానికి నిధులను రూ.323 కోట్ల నుంచి రూ.100 కోట్లకు తగ్గించారు.
నిఘా విభాగానికి పెంపుదల.. శిక్షణకు ప్రాధాన్యం
నిఘా విభాగం బడ్జెట్‌ను రూ.67.95 కోట్ల నుంచి రూ.72.37 కోట్లకు పెంచారు. ప్రస్తుతం 17 వేల పోలీసు ఉద్యోగాల నియామకాలు జరుగుతుండటంతో వారి శిక్షణను దృష్టిలో ఉంచుకొని అవసరమైన నిధులు పెంచారు. ఎస్పీ కార్యాలయాల భవనాల నిర్మాణానికి రూ.20.48 కోట్ల నుంచి రూ.35.84 కోట్లకు, ఎస్సైలకు శిక్షణ ఇచ్చే పోలీసు అకాడమీ బడ్జెట్‌ను రూ.2.48 కోట్ల నుంచి రూ.5.34 కోట్లకు, పోలీసు శిక్షణ కళాశాల బడ్జెట్‌ రూ.10 లక్షల నుంచి రూ.55 లక్షలకు, శిక్షణార్థులకు ఇచ్చే స్టైపెండ్‌ రూ.2.62 కోట్ల నుంచి రూ.3.07 కోట్లకు పెంచారు. 
‘హోం’ నిర్వహణ పద్దు పెంపు
హోం శాఖ పరిధిలోకి వచ్చే పోలీసు, జైళ్లు, అగ్నిమాపకశాఖ వాటన్నింటికీ కలిపి నిర్వహణ పద్దు పెరిగింది. గత బడ్జెట్‌లో రూ.7,846.99 కోట్లు కేటాయించగా ఈసారి రూ.8,727.32 కోట్లకు పెంచారు.
అగ్నిమాపక శాఖకు రెట్టింపు..
గత బడ్జెట్‌లో ఫైర్‌ఇంజిన్లు వంటివాటి కొనుగోలుకు రూ.2 కోట్లు కేటాయించగా ఈసారి ఆ మొత్తం రూ.12.43 కోట్లకు (6 రెట్లు) పెంచారు. మొత్తంగా అగ్నిమాపక శాఖకు ప్రగతి పద్దు కింద గత ఏడాది రూ.16.12 కోట్లు కేటాయించగా ఈసారి ఆ మొత్తాన్ని రూ.32.12 కోట్లకు పెంచారు. ఇటీవల వరుసగా జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని కొత్త పరికరాల కొనుగోలుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.

అటవీ శాఖకు రూ.1,471 కోట్లు
రాష్ట్ర బడ్జెట్‌లో అటవీశాఖకు ప్రభుత్వం రూ.1,471.22 కోట్లు కేటాయించింది. నిర్వహణ పద్దు కింద రూ.1,337 కోట్లు, ప్రగతి పద్దు కింద వివిధ పథకాల ద్వారా రూ.134.22 కోట్లు చూపింది. గత సంవత్సర కేటాయింపులు రూ.1,410.36 కోట్లతో పోలిస్తే ఈసారి నిధులు కొంతమేర పెరిగాయి. వివిధ పథకాల నిధుల్లో- అటవీకరణ పనులకు రూ.5 కోట్లు, జూపార్క్‌లకు రూ.10 కోట్లు, ములుగులో అటవీ కళాశాలకు రూ.100 కోట్లు, అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణకు రూ.4.33 కోట్లు, టైగర్‌ రిజర్వులకు రూ.5.50 కోట్లు, వన్యప్రాణుల ఆవాస ప్రాంతాలకు రూ.1.50 కోట్లు, మిగిలినవి ఇతర పథకాలకు కేటాయించారు. ‘కంపా’ (కాంపన్సేటరీ అఫారెస్టేషన్‌ ఫండ్‌) పథకానికి రూ.810 కోట్లకు ప్రతిపాదనలు పంపగా రూ.807 కోట్లు చూపారు. ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నివేదిక - 2021 ప్రకారం రాష్ట్రంలో పచ్చదనం 7.70 శాతం పెరిగింది. ఇది 5.13 లక్షల ఎకరాలకు సమానం. రాష్ట్రంలో 26 పెద్దపులులు, 341 చిరుతపులులు ఉన్నట్లు బడ్జెట్‌లో ప్రభుత్వం వెల్లడించింది. 
పౌష్టికాహారానికి నిధుల పుష్టి
రాష్ట్రంలో చిన్నారులు, కౌమారదశ బాలికలు, మహిళల్లో రక్తహీనతను అధిగమించేందుకు చేపట్టిన పౌష్టికాహార కార్యక్రమానికి ప్రభుత్వం నిధులు పెంచింది. మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖలకు కలిపి మొత్తం రూ.2,059.75 కోట్లు కేటాయించింది. ఇందులో జాతీయ పౌష్టికాహార మిషన్‌ కింద రూ.543.62 కోట్లు, ఆరోగ్యలక్ష్మి పథకానికి రూ.225.41 కోట్లు కలిపి మొత్తం రూ.769.03 కోట్లు ఇచ్చింది. స్వధార్‌ గృహాలకు రూ.10.34 కోట్లు, చిన్నారుల భద్రత పథకానికి రూ.20.10 కోట్లు, చిన్నారుల అభివృద్ధి కార్యక్రమాలకు రూ.22.46 కోట్లు ఇచ్చింది. మహిళా కార్పొరేషన్‌కు రూ.3.94 కోట్లు, మహిళా కమిషన్‌కు రూ.45 లక్షలు, వేధింపులకు గురైన బాలికలు, మహిళలకిచ్చే ఆర్థిక సాయానికి రూ.1.06 కోట్లు కేటాయించింది. అంగన్‌వాడీ కేంద్రాల శాశ్వత భవనాలకు రూ.33 లక్షలే ఇచ్చింది. మహిళల భద్రతకు రూ.14 కోట్లు, బాలల న్యాయ నిధికి రూ.9 కోట్లు, దివ్యాంగుల పునరావాసానికి రూ.5.51 కోట్లు, వివాహ ప్రోత్సాహకాలకు రూ.4.2 కోట్లు కేటాయించింది. 
మహిళా శిశు సంక్షేమ శాఖకు కేటాయింపులు ఇలా..
నిర్వహణ పద్దు: రూ.1,139.92 కోట్ల
ప్రగతి పద్దు: రూ.919.83 కోట్లు
మొత్తం: రూ.2,059.75 కోట్లు
క్రీడలకు రూ.134.80 కోట్లు 
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ఈ సారి క్రీడా రంగానికి కేటాయింపులు పెరిగాయి. 2023 - 24 ఆర్థిక సంవత్సరానికి గాను సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో క్రీడలకు రూ.134.80 కోట్లు కేటాయించారు. 2022 - 23 (రూ.81.01 కోట్లు)తో పోలిస్తే ఈ సారి రూ.53.79 కోట్లు పెంచారు. బడ్జెట్‌లో తొలిసారిగా తెలంగాణ క్రీడా ప్రాంగణాల కోసం రూ.45 కోట్లు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ క్రీడా ప్రాంగణాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోన్న సంగతి తెలిసిందే. క్రీడా సంఘాల గ్రాంట్లు, క్రీడాకారులకు నగదు ప్రోత్సాహాకాలు, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌)కు నిధులు పెరగగా.. తెలంగాణ ప్రాంతీయ క్రీడా పాఠశాలలు, వరంగల్‌ క్రీడా వసతి గృహానికి తగ్గాయి. స్టేడియాల నిర్మాణాలకు, క్రీడా వసతుల ఆధునికీకరణకు రూ.30 కోట్లు ఇచ్చారు. క్రీడా సంఘాల గ్రాంట్లు, క్రీడాకారుల నగదు ప్రోత్సాహకాలకు రూ.15 కోట్లు, శాట్స్‌కు రూ.20.74 కోట్లు, తెలంగాణ రాష్ట్ర ప్రాంతీయ క్రీడా పాఠశాలలు, వరంగల్‌ క్రీడా వసతి గృహానికి రూ.16.53 కోట్లు, తెలంగాణ రాష్ట్ర ప్రధాన క్రీడా పాఠశాలకు రూ.7.53 కోట్ల చొప్పున కేటాయించారు.

ఆ రెండేళ్లు బడ్జెట్‌ ప్రతిపాదనలకు మించి ఖర్చు
రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి (2023 - 24 బడ్జెట్‌తో కలిపి) ఇప్పటివరకూ 10 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. 2014 - 15 నుంచి 2021 - 22 వరకు 8 బడ్జెట్‌లలో 2016 - 17, 2019 - 20 ఆర్థిక సంవత్సరాల్లో ప్రతిపాదనలను మించి నిధులను ఖర్చు చేశారు. 2021 - 22లో బడ్జెట్‌ ప్రతిపాదనలు, ఖర్చుకు మధ్య తేడా రూ.47,728 కోట్లు ఉంది.

అప్పులు.. రూ.4.86 లక్షల కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది తీసుకునే కొత్త రుణాలతో కలిపి మొత్తం అప్పులు రూ.4,86,302.61 కోట్లకు చేరతాయని బడ్జెట్‌లో వెల్లడించింది. ‘ద్రవ్య బాధ్యత బడ్జెట్‌ నిర్వహణ’ (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న రుణాలను బడ్జెట్‌లో చూపుతుంది. ఇవి (2022 - 23)లో రూ.3,22,993 కోట్లుంటే 2023 - 24లో రూ.35 వేల కోట్లు అదనంగా పెరిగి రూ.3,57,059 కోట్లకు చేరనున్నాయి. ఇవి కాక వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలకు పూచీకత్తు ఇచ్చినవి బడ్జెట్‌ వెలుపల అదనంగా ఉంటాయి. వాటితో కలిపితే మొత్తం రూ.4.86 లక్షల కోట్లకు చేరతాయి. వచ్చే ఏడాదిలో రాష్ట్ర జనాభా 4 కోట్లు ఉంటుందనే అంచనాతో లెక్కిస్తే.. ఒక్కొక్కరిపై తలసరి రుణభారం రూ.1,21,575 ఉంటుందని అనధికార అంచనా. 2020 - 21లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువ (జీఎస్‌డీపీ)లో అప్పులు 25.4 శాతం కాగా వచ్చే ఏడాదికి 23.8 శాతానికి తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కానీ ఈ శాతం తగ్గినట్లు చూపినా ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో తీసుకున్న అప్పుల సొమ్ము మాత్రం 2020 - 24 మధ్య నాలుగేళ్లలో రూ.2,44,019 కోట్ల నుంచి రూ.3,57,059 కోట్లకు పెరుగుతోంది. జీఎస్‌డీపీ విలువ పెరిగినందునే అప్పుల శాతం తగ్గినట్లు కనిపిస్తోంది తప్ప తీసుకున్న అప్పులు మాత్రం నాలుగేళ్ల వ్యవధిలో రూ.2.44 లక్షల కోట్ల నుంచి రూ.3.57 లక్షల కోట్లకు చేరాయి. ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తుతో ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు సంస్థవి రూ.66,854 కోట్లు, మిషన్‌ భగీరథకు రూ.23,364.38 కోట్లు, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థవి రూ.7,435.89 కోట్లు, విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లవి రూ.6,300 కోట్లు, విద్యుత్‌ ఆర్థిక సంస్థవి రూ.2,917 కోట్లు, ఇలా వివిధ సంస్థలవి ఉన్నాయి. వివిధ రకాల అభివృద్ధి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థల ద్వారా రుణాలను తీసుకుంటోంది. వీటిలో కొన్ని సంస్థలు వాటికి వచ్చే ఆదాయంతోనే తిరిగి అప్పులు చెల్లించాలి. ఉదాహరణకు కరెంటు బిల్లుల ద్వారా వచ్చే ఆదాయంతో డిస్కంలు అప్పులను తిరిగి చెల్లిస్తాయి. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022 - 23) రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)ని ప్రసుత్త ధరల్లో రూ.13,27,495 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. గత ఏడాది కంటే 15.6 శాతం వృద్ధి రేటును రాష్ట్రం సాధించింది.

తెలంగాణ బ‌డ్జెట్ 2023-24 పీడీఎఫ్‌

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.