• facebook
  • whatsapp
  • telegram

Tenth exams: 5 నిమిషాలు దాటితే అనుమతించం

మే 23 నుంచి పది పరీక్షలు
విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు

 

ఈనాడు - హైదరాబాద్‌: తెలంగాణలో మే 23 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మే 23 నుంచి జూన్‌ 1 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్ష సమయానికి గంట ముందే విద్యార్థులు వారి కేంద్రాలకు చేరుకోవాలి. 9.35 తరువాత అంటే 5 నిమిషాలు దాటితే లోపలకు అనుమతించబోమని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2,861 కేంద్రాల్లో 5,09,275 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. హైదరాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 75,083 మంది హాజరుకానున్నారు. విద్యార్థులందరూ కరోనా నిబంధనల మేరకు మాస్క్‌ ధరించాలి. హాల్‌టికెట్లు వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్షలకు హాజరుకావచ్చు. కరోనా కారణంగా ఎన్‌సీఈఆర్‌టీ సూచనల మేరకు పరీక్ష పేపర్ల సంఖ్యను 11 నుంచి 6కు తగ్గించినట్లు విద్యాశాఖ పేర్కొంది. ప్రశ్నపత్రంలో ఛాయిస్‌ ఎక్కువగా ఇవ్వనున్నామని, విద్యార్థులు చదివిన పాఠశాలలకు దగ్గర్లో పరీక్ష కేంద్రాలు కేటాయించామని వెల్లడించింది. జనరల్‌ సైన్స్‌లో భాగంగా భౌతిక, జీవశాస్త్రానికి సంబంధించిన ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలు వేరుగా ఇస్తామంది. ప్రభుత్వ పరీక్షల విభాగం నుంచి నాలుగు ప్రత్యేక ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, రాష్ట్రవ్యాప్తంగా 144 స్క్వాడ్‌లను ఏర్పాటు చేసింది. వేసవి కారణంగా పరీక్ష కేంద్రాల్లో ఏఎన్‌ఎం, ఆశా ఉద్యోగి అవసరమైన మందులతో సిద్ధంగా ఉంటారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలవుతుందని, పరీక్ష పూర్తయ్యేవరకు జిరాక్సు కేంద్రాలు మూసివేస్తామని పాఠశాల విద్యాశాఖ వివరించింది.

ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి: మంత్రి సబిత

విద్యార్థులు ఆందోళన చెందకుండా.. ఆత్మవిశ్వాసంతో.. ప్రశాంతంగా పరీక్షలు రాయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఆయాకేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామని వివరించారు. విద్యార్థుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నామని, విద్యుత్తు సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పారు. పరీక్షల నిర్వహణలో సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కారం కోసం సంచాలకుల కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు.

పిల్లలను ఆందోళనకు గురిచేయొద్దు

పరీక్ష కేంద్రం ఎక్కడుందో తల్లిదండ్రులు ముందుగానే చూసుకోవాలి.

వదంతులను నమ్మి పిల్లల్లో భయాందోళన కలిగించకూడదు. రాత్రి పొద్దుపోయే వరకు చదవాలని ఒత్తిడి చేయవద్దు.

పిల్లలకు సరైన ఆహారం అందించాలి. పరీక్ష కేంద్రానికి వెళ్లేముందు హాల్‌టికెట్‌, ప్యాడ్‌, పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు, స్కేలు తప్పనిసరిగా తీసుకెళ్లేలా చూడాలి.

పరీక్ష కేంద్రంలో పక్కవారితో మాట్లాడటం, మాల్‌ప్రాక్టీసుకు పాల్పడవద్దని చెప్పాలి.

విద్యార్థులకు సూచనలు...

పరీక్ష కేంద్రంలో కేటాయించిన స్థానంలో కూర్చోవాలి. జవాబుపత్రానికి జతపర్చిన ఓఎంఆర్‌ తనదేనా? కాదా? సరిచూసుకోవాలి.

ప్రశ్నపత్రం ఇచ్చిన వెంటనే ప్రతిపేజీపైనా హాల్‌టికెట్‌ నంబరు రాయాలి.

ప్రశ్నపత్రంలో బాగా తెలిసిన జవాబులతో సమాధానాలు రాయడం ప్రారంభించాలి. చేతిరాత స్పష్టంగా ఉండాలి.

పరీక్ష కేంద్రంలో భౌతికదూరం పాటించాలి. ట్రాన్స్‌పరెంట్‌ నీటిసీసా, శానిటైజర్‌ తీసుకెళ్లవచ్చు.

విద్యార్థులు, సిబ్బంది సెల్‌ఫోన్లు, స్మార్ట్‌ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లకూడదు.

జవాబుపత్రం, అడిషనల్‌, బిట్‌, మ్యాప్‌, గ్రాఫ్‌షీట్లలో ఎక్కడా హాల్‌టికెట్‌ నంబరు రాయకూడదు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

నిట్‌-మిజోరంలో ఫ్యాక‌ల్టీ పోస్టులు

సులువుగా పర్యావరణాన్ని చదివేద్దాం!

బెల్‌లో 15 ట్రెయినీ ఇంజినీర్లు

ఎకానమీలో ఏవీ ముఖ్యం?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 22-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.