* ఈ సారి 29 సెంటర్ల పెంపు
* రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి వెల్లడి
* జేఎన్‌టీయూ హైదరాబాద్ ప్రాంగణంలో కొత్తగా బీటెక్ బయోటెక్నాలజీ కోర్సు: వీసీ కట్టా
ఈనాడు, హైదరాబాద్: ఎంసెట్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక సిట్టింగ్ పరిశీలకుడిని నియమిస్తున్నామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి వెల్లడించారు. గతంలో రెండు నుంచి అయిదు కేంద్రాలకు ఒక ఫ్లయింగ్ పరిశీలకుడు ఉండేవారని.. ఈ సారి సిట్టింగ్ స్క్వాడ్ తరహాలో పనిచేసేలా ప్రతి సెంటర్‌కూ ఓ పరిశీలకుడు ఉంటారని పేర్కొన్నారు. మే 10వ తేదీ నుంచి ఎంసెట్ ప్రారంభం కానుండటం, ఆ తర్వాత నెలంతా ప్రవేశ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో జేఎన్‌టీయూహెచ్ ఉపకులపతి ఆచార్య కట్టా నర్సింహారెడ్డి, ఎంసెట్, ఇతర సెట్‌ల కన్వీనర్లతో కలిసి మంగళవారం మండలి కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సారి ఎంసెట్ రెండు విభాగాలకు కలిపి 54 వేల వరకు దరఖాస్తులు పెరిగాయని.. ఇంజినీరింగ్‌కు 29 పరీక్షా కేంద్రాలు పెంచామన్నారు. వెబ్‌సైట్లో హాల్‌టికెట్లు పెట్టిన రెండు రోజుల్లోనే 2.02 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని చెప్పారు. ఆన్‌లైన్ పరీక్షలైనందున అన్ని చోట్లా కంప్యూటర్లు సక్రమంగా పనిచేస్తున్నాయని సాంకేతిక ఆడిట్ కూడా చేయించామని చెప్పారు. పరీక్ష సందర్భంగా సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఈ విధానాన్ని కొత్తగా అమలు చేస్తున్నామన్నారు. గత ఏడాది ఎడ్‌సెట్‌ను ఒకే రోజు మూడు విడతలుగా జరిపామని.. ఈ సారి లాసెట్‌నూ అలాగే నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు ప్రవేశాలు పొందిన రెండు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతి లేదు కదా.. అన్న ప్రశ్నకు లింబాద్రి బదులిస్తూ.. బిల్లు ప్రాసెస్‌లో ఉందని చెప్పారు.
* మరో నాలుగైదు రోజుల్లో తనిఖీలు పూర్తి
ఈ సందర్భంగా ఎంసెట్ ఛైర్మన్, జేఎన్‌టీయూహెచ్ వీసీ కట్టా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ ప్రాంగణంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 60 సీట్లతో సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో బీటెక్ బయో టెక్నాలజీ బ్రాంచీని ప్రవేశ పెడుతున్నామన్నారు. ఏడాదికి రూ.లక్ష ఫీజు ఉంటుందని పేర్కొన్నారు. అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు మరో నాలుగైదు రోజుల్లో కళాశాలల తనిఖీలు పూర్తవుతాయన్నారు. సమావేశంలో ఎంసెట్ కన్వీనర్ డీన్ కుమార్, కో కన్వీనర్ విజయకుమార్‌రెడ్డి, పీజీఈసెట్, ఈసెట్, లాసెట్ కన్వీనర్లు శ్రీరాం వెంకటేశ్, రవీందర్‌రెడ్డి, విజయలక్ష్మి, ఎడ్‌సెట్ కో కన్వీనర్ శంకర్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.
* ప్రవేశ పరీక్షలకు ఇప్పటివరకు అందిన దరఖాస్తులు..
సెట్ పేరు | పరీక్ష తేదీ | దరఖాస్తుల సంఖ్య |
ఎంసెట్ | మే 10-14 వరకు | 3,20,587 |
ఎడ్‌సెట్ | మే 18 | 29,390 |
ఈసెట్ | మే 20 | 21,586 |
లాసెట్ | 25వ తేదీ | 41,439 |
ఐసెట్ | 26, 27 తేదీలు | 43,242 |
పీజీఈసెట్ | మే 29- జూన్ 1 వరకు | 13,636 |
(ఎంసెట్ అగ్రికల్చర్ మే 10, 11, ఇంజినీరింగ్, 12, 13, 14 తేదీల్లో..)
********************************************************
మరింత సమాచారం... మీ కోసం!
‣ స్టాటిస్టిక్స్‌తో ఉన్నత ఉద్యోగం
‣ సమ్మర్ జాబ్‌తో లాభాలెన్నో..
‣ మ్యూజిక్‌లో బెస్ట్ కోర్సులివిగో..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.