* సంవత్సరాంతం నాటికి ‘మూడంకెల్లో’ విమానాల ఆర్డరు
* ఆకాశ ఎయిర్ సీఈఓ వినయ్ దుబే
దిల్లీ: వచ్చే ఏడాది మార్చి చివరినాటికి సుమారు 1,000 మందిని నియమించుకునే యోచనలో ఉన్నామని ఆకాశ ఎయిర్ వెల్లడించింది. తద్వారా మొత్తం సిబ్బందిని 3,000 మందికి పెంచుకోవాలని అనుకుంటోంది. అలాగే మరిన్ని విమానాల సంఖ్యను, సర్వీసులను కూడా పెంచుకోనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ వినయ్ దుబే తెలిపారు. ఆకాశ ఎయిర్ ఏడు నెలల క్రితమే (2022 ఆగస్టు 7న) కార్యకలాపాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరి కల్లా అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించాలని అనుకుంటోంది. ప్రస్తుతం ఏయే విదేశీ గమ్యస్థానాలకు సర్వీసులు ప్రారంభించాలో ఖరారు చేసే పనిలో ఉన్నట్లు పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దుబే తెలిపారు. ఈ సంవత్సరం చివరినాటికి ‘మూడంకెల్లో’ విమానాలకు ఆర్డర్లు ఇస్తామని అన్నారు. కాగా.. ఇప్పటికే 72 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలకు ఆకాశ ఎయిర్ ఆర్డరు పెట్టింది. ఇందులో 19 విమానాలు ఇప్పటికే సరఫరా అయ్యాయి. 20వ విమానం ఏప్రిల్‌లో డెలివరీ అవుతుంది. ఆ తర్వాత విదేశీ సర్వీసులను నడిపేందుకు కూడా సంస్థ అర్హత సాధిస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 9 విమానాలు చేరుతాయి. దీంతో మొత్తం విమానాల సంఖ్య 28కు పెరుగుతుంది. మొత్తం 72 బోయింగ్ విమానాల డెలివరీ 2027 ప్రారంభం కల్లా పూర్తయ్యే అవకాశం ఉందని దుబే తెలిపారు. ‘ప్రస్తుతం ప్రతి రోజు 110 విమాన సర్వీసులను నడిపిస్తున్నాం. వేసవికాల సీజను ముగిసే నాటికి రోజుకు 150 విమాన సర్వీసులను నడిపిస్తాం. ప్రస్తుతానికి మార్కెట్ వాటాకు సంబంధించి ఎలాంటి లక్ష్యాలు లేవు. ఫలానా స్థానం కోసం కూడా మేం పోటీపడటం లేదు. ప్రయాణికులను, ఉద్యోగులను సంతృప్తిపర్చడమే ప్రస్తుతం మేం పెట్టుకున్న లక్ష్యం. ఆ దిశగానే మేం పనిచేస్తున్నామ’ని దుబే తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ‘పది’ పరీక్షల హాల్ టిక్కెట్లు విడుదల
‣ ఎగ్జామ్‌కి ముందు ఏం చేయకూడదు?
‣ 5 వేలకుపైగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.