• facebook
  • whatsapp
  • telegram

MBBS Seats: బి కేటగిరీలోనూ 85% సీట్లు స్థానికులకే

* వైద్య విద్య ప్రవేశాలపై సర్కారు కీలక నిర్ణయం

* నిబంధనలు సవరిస్తూ ఉత్తర్వులు

* రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులోకి మరో 1,068 ఎంబీబీఎస్‌ సీట్లు

 


ఈనాడు, హైదరాబాద్‌: జిల్లాకు ఒక కళాశాలను ప్రారంభించి వైద్య విద్యను పటిష్ఠం చేస్తున్న క్రమంలో ప్రైవేటు కాలేజీల్లోనూ ఇక్కడి విద్యార్థులకే ఎక్కువ అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాల్లో యాజమాన్య(బి) కేటగిరీలోనూ 85 శాతం సీట్లు స్థానికులకే దక్కేలా కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర విద్యార్థులకు అదనంగా 1,068 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఈ మేరకు ప్రవేశ నిబంధనలను సవరిస్తూ వైద్య ఆరోగ్య శాఖ సెప్టెంబ‌రు 29న‌ ఉత్తర్వులు జారీచేసింది.

 

ఎందుకీ నిర్ణయం?

ప్రైవేటు వైద్య కళాశాలల్లోని మొత్తం వైద్య సీట్లలో 50 శాతం కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేస్తుండగా.. మిగతా 50 శాతంలో 35 శాతాన్ని యాజమాన్య కోటా కింద, 15 శాతాన్ని ప్రవాస భారతీయ కోటాగా నింపుతున్నారు. రుసుమును రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించినా.. వీటిని అఖిల భారత స్థాయిలో భర్తీ చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల విద్యార్థులూ పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో యాజమాన్య కోటాలో తెలంగాణ విద్యార్థుల కోసం ఎలాంటి రిజర్వేషన్‌ లేదు. దీంతో ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఇక్కడి కళాశాలల్లో ఎంబీబీఎస్‌ సీట్లు సొంతం చేసుకుంటున్నారు. తద్వారా తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఇటీవల ప్రభుత్వానికి పెద్దఎత్తున ఫిర్యాదులందాయి. ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ చూపించిన ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు.. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు నివేదిక అందజేశారు. మహారాష్ట్ర, గుజరాత్‌, కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌ తదితర రాష్ట్రాల్లో ఓపెన్‌ కోటా విధానమే లేదు. అన్ని సీట్లూ ఆయా రాష్ట్రాల విద్యార్థులకే దక్కేలా నిబంధనల్లో మార్పులు చేసుకున్నారు. దీంతో ఓ వైపు తెలంగాణలో బి కేటగిరీలో రిజర్వేషన్‌ అమలు కాక.. మరోవైపు ఇతర రాష్ట్రాల్లోనూ యాజమాన్య కోటాలో సీట్లు పొందలేక తెలంగాణ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని నివేదికలో స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి విద్యార్థులకు లాభం చేకూర్చేలా నిర్ణయం తీసుకుంది.

 

ఓపెన్‌ కోటాలోనూ అవకాశం..

రాష్ట్రంలో 20 ప్రైవేటు, 4 మైనారిటీ వైద్య కళాశాలలుండగా.. వీటిలో మొత్తం 3750 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు కళాశాలల్లో 3200 సీట్లుండగా.. ఇందులో బి కేటగిరీ కింద 35 శాతం(1120) సీట్లున్నాయి. తాజా సవరణ మేరకు బి కేటగిరీలో ఉన్న 35% సీట్లలో 85% అంటే.. 952 సీట్లు ప్రత్యేకంగా రాష్ట్ర విద్యార్థుల కోసం కేటాయిస్తారు. మిగతా 15% (168) సీట్లు మాత్రమే ఓపెన్‌ కోటాలో ఇతర రాష్ట్ర విద్యార్థులు పోటీ పడతారు. ఓపెన్‌ కోటా కాబట్టి ఇందులో తెలంగాణ విద్యార్థులకూ అవకాశం ఉంటుంది. ఇదే విధంగా మైనారిటీ కళాశాలల్లో బి కేటగిరీ కింద ఉన్న 25% (137) సీట్లలో.. తాజా సవరణతో 85% (116) ఇక్కడి విద్యార్థులకే దక్కనున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై తెలంగాణ ఎంబీబీఎస్‌ బి కేటగిరీ సీట్ల స్థానిక రిజర్వేషన్‌ సాధన సమితి హర్షం వ్యక్తం చేసింది. 2017 నుంచి ఈ అంశంపై చేస్తున్న పోరాటం ఫలించిందని.. తమ వినతులను మన్నించి ఉత్తర్వులు జారీచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రి హరీశ్‌రావుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సాధన సమితి అధ్యక్షుడు దాసరి రవిప్రసాద్‌, ముఖ్యసలహాదారు ఎ.చంద్రశేఖర్‌, ప్రధాన కార్యదర్శి సతీశ్‌ ఓ ప్రకటనలో తెలిపారు.
 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఇండియాతో సత్సంబంధాల అభిలాషి!

‣ ఉజ్జ్వల భారత్‌ సాకారమే లక్ష్యంగా...

‣ జీవవైవిధ్యానికి గొడ్డలి పెట్టు

‣ అందరికీ అందని బ్యాంకింగ్‌ సేవలు

‣ గాలి అందుబాటులోనూ అసమానతలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.