1200 బడుల్లో ‘మన ఊరు- మన బడి’ పనుల పూర్తి
కొత్త యూనిఫామ్ నమూనాలను పరిశీలించిన మంత్రి సబిత
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేసే ఏకరూప దుస్తులకు అవసరమైన వస్త్రాన్ని వచ్చే ఏప్రిల్‌కల్లా జిల్లా స్థాయిలో సిద్ధంగా ఉంచాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్య డైరెక్టరేట్‌లో నవంబరు 29న ఏకరూప దుస్తులు, మన ఊరు- మన బడి కార్యక్రమంపై మంత్రి సమీక్షించారు. రానున్న విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి 25 లక్షల మంది విద్యార్థులకు రూ.121 కోట్లతో ఏకరూప దుస్తులను రూపొందించాలన్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో మొదటి దశలో 9,123 ప్రభుత్వ పాఠశాలల్లో 1200 చోట్ల పనులు పూర్తయ్యాయని తెలిపారు. వీటిలో సీసీ కెమెరాలు, ఫర్నిచర్, ఉన్నత పాఠశాలల్లో క్రీడా మైదానాలను డిసెంబరు 15 నాటికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మిగతా పాఠశాలల్లో కూడా పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని సూచించారు. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన, ఎస్ఎస్ఏ సహాయ రాష్ట్ర ప్రాజెక్టు అధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కొత్త నమూనాల పరిశీలన: వచ్చే విద్యా సంవత్సరం మరింత నాణ్యమైన దుస్తులను అందించాలన్న ఆలోచనతో పలు కొత్త రకాల యూనిఫామ్ డిజైన్లను మంత్రి పరిశీలించారు. ఇప్పటికే అమల్లో ఉన్న ఏకరూప దుస్తుల మందాన్ని పెంచాలని, రంగును కూడా మెరుగుపరచాలని సూచించినట్లు తెలిసింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.