డిసెంబరు 23 నుంచి దరఖాస్తుల స్వీకరణ
వివిధ శాఖల్లో 6,859 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ
మున్సిపాలిటీల్లో 1,862 వార్డు అధికారుల పోస్టులు..
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగులు ఎదురుచూస్తున్న గ్రూప్ ఉద్యోగాల్లో మరో ప్రకటన వెలువడింది. 9,168 పోస్టులతో కూడిన గ్రూప్-4 ఉద్యోగ ప్రకటనను టీఎస్పీఎస్సీ జారీ చేసింది. వీటిలో జూనియర్ అసిస్టెంట్(6,859), జూనియర్ అకౌంటెంట్(429), జూనియర్ ఆడిటర్(18), వార్డు అధికారుల(1,862) పోస్టులున్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ అనుమతిచ్చిన వారం రోజుల వ్యవధిలోనే ప్రకటన వెలువడింది. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో డిసెంబరు 1న నిర్వహించిన బోర్డు సమావేశంలో గ్రూప్ ఉద్యోగాలపై సమీక్షించారు. అత్యధిక పోస్టులున్న గ్రూప్-4 ఉద్యోగాలకు ప్రకటన జారీ చేసేందుకు కమిషన్ ఆమోదం తెలిపింది. వెంటనే ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది.
పురపాలక శాఖ పరిధిలో అత్యధికం..
గ్రూప్-4 ఉద్యోగాల్లో అత్యధికంగా పురపాలకశాఖ పరిధిలో 2,701 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 1,862 వార్డు అధికారుల పోస్టులున్నాయి. రెవెన్యూశాఖ పరిధిలో 2,077 పోస్టులు ఉండగా.. ఇందులో సీసీఎల్ఏ పరిధిలో 1,294 ఉన్నాయి. సాధారణ, సంక్షేమ గురుకులాల్లో 991 పోస్టులు భర్తీ కానున్నాయి. జిల్లాలవారీగా రోస్టర్‌తో కూడిన పూర్తిస్థాయి ప్రకటన ఈ నెల 23న టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందుపరచాలని నిర్ణయించింది.
దరఖాస్తులకు మూడు వారాల గడువు..
గ్రూప్-4 ఉద్యోగాలకు డిసెంబరు 23 నుంచి వచ్చే ఏడాది జనవరి 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కమిషన్ తెలిపింది. దరఖాస్తులు సమర్పించేందుకు మూడు వారాల గడువు ఇచ్చింది. అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సమకూర్చుకునేందుకు వీలుగా 23 రోజుల ముందుగా ప్రకటన జారీ చేసినట్లు కమిషన్ వెల్లడించింది. ఆబ్జెక్టివ్ విధానంలో జరిగే పరీక్షను ఏప్రిల్ లేదా మేలో నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రెవెన్యూ డివిజన్‌స్థాయిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4 వేలకు పైగా కేంద్రాల్ని గుర్తించాల్సి ఉంది. ఇతర పరీక్షలేమీ లేని సమయంలో గ్రూప్-4 పరీక్ష తేదీని ఖరారు చేయాలని భావిస్తోంది. ఏప్రిల్ నెలాఖరు వరకు పదో తరగతి, ఇంటర్ పరీక్షలు జరిగే అవకాశమున్న నేపథ్యంలో మే నెలలో రాతపరీక్ష నిర్వహించే వీలున్నట్లు సమాచారం.
స్టడీమెటీరియల్
‣ పేపర్ - II సెక్రటేరియల్ ఎబిలిటీస్
మరింత సమాచారం ... మీ కోసం!
‣ డిజిటల్ అక్షరాస్యత... మీకుందా?
‣ క్లిష్ట సమయాల్లోనూ ఉద్యోగ సాధన ఎలా?