• facebook
  • whatsapp
  • telegram

Maternity leave: తల్లైనా..తక్షణమే కొలువా?

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఒప్పంద, పొరుగు సేవల మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవులు లేక అనేక ఇబ్బందులు పాలవుతున్నారు. ఇటు పొత్తిళ్లలో శిశువును వదిలి ఉండలేక, జీవనాధారమైన ఉద్యోగాన్ని వదులుకోలేక సతమతమవుతున్నారు. కొందరు ఆర్థిక అవసరాలతో కన్నప్రేమను దిగమింగుకుని బిడ్డలను ఇంటి వద్దే వదిలి విధులకు హాజరవుతున్నారు. మరికొందరు తమ బిడ్డలే తమకు ఎక్కువని చంటివారితో ఇంటికే పరిమితమవుతున్నారు. ఇలాంటి వారిని అధికారులు   నిర్దయగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు. 

*  ప్రసూతి సెలవుల్లేని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగినులు

*  కాన్పయిన నెల రోజుల్లోనే విధులకు హాజరౌతున్న వైనం

*  సీఎంకు విన్నవించినా ఫలితం శూన్యం

* ఒక్క కేజీబీవీ మహిళా సిబ్బందికే అవకాశమిచ్చిన ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మూడున్నర లక్షల మంది ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులుండగా అందులో 1.20 లక్షల మంది మహిళలే. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగినులకు 180 రోజులు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను, మూడు నెలల శిశు సంరక్షణ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. అదేస్థాయిలో విధులు నిర్వహిస్తున్న తమకు కూడా దీనిని వర్తింపజేయాలని ఉద్యోగినులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, మంత్రులను అభ్యర్థించారు. టీఎన్జీవో, టీజీవో సంఘాలు పీఆర్‌సీపై చర్చల సందర్భంగా దీని కోసం విన్నవించాయి. ఉద్యోగినులందరికీ ప్రసూతి సెలవులు వస్తాయని అంతా ఆశించారు. అయితే ప్రభుత్వం కేజీబీవీల్లో పనిచేసే వారికే దీనిని వర్తింపజేసింది. వివాహిత ఉద్యోగినులకు మొదటి రెండు కాన్పులకు దీనిని అమలు చేస్తూ గత జులైలో విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈఎస్‌ఐ, పీఎఫ్‌ ప్రయోజనాలున్నప్పటికీ వారిని ఆరు నెలలు విధుల్లో ఉన్నట్లే (ఆన్‌డ్యూటీ)గా భావించి, వేతనాలు ఇవ్వాలని సూచించింది. ఆ తర్వాత తమకూ దానిని అమలు చేస్తారని ఉద్యోగినులు ఆశించారు. కానీ ఇప్పటివరకు అది జరగలేదు. 

వైద్యుల సలహాల మేరకు ప్రసవం తర్వాత మహిళలు ఆరు నెలల వరకు ఇంటి వద్దే ఉండాలి. స్వీయ ఆరోగ్య పరిరక్షణతో పాటు బిడ్డను సంరక్షించుకోవాలి. సెలవులు లేకపోవడంతో పాటు ఉద్యోగినులు ప్రసవించిన నెల రోజులకే కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తోంది. కొంతమంది పసిపిల్లలను తీసుకొని విధులకు హాజరవుతున్నారు. మరికొంత మంది పిల్లల క్షేమం కోసం ఇంటివద్దనే ఉంటుంటే... కార్యాలయాల్లోని ఉన్నతాధికారులు హాజరుకాని ఉద్యోగినులను ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నారు. మహిళల ఇబ్బందులతో సంబంధం లేకుండా కార్యాలయాలకు హాజరు కావాలని చెబుతున్నారు. వైద్యపరమైన సమస్యలున్నా... వారిని కనికరించడం లేదు.  

వాటా నమోదు చేయక...

కార్మిక చట్టం ప్రకారం.. ఈఎస్‌ఐ పరిధిలోని ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగినులకు నాలుగు నెలల పాటు వేతనాల పరిహారం పొందే వీలుంది. ఈఎస్‌ఐ వాటాను కొన్ని కార్యాలయాలు సరిగా నమోదు చేయకపోవడం వల్ల వారికి వేతన పరిహారం రావడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల పొరుగుసేవలు, ఒప్పంద ఉద్యోగులకు 30 శాతం వేతనాలు పెంచింది. దీంతో 30 వేల మందికి పైగా ఈఎస్‌ఐ పరిధి నుంచి పీఎఫ్‌ పరిధిలోకి వచ్చారు. దీంతో వారు కార్మిక వేతన పరిహారం పొందలేని పరిస్థితి ఏర్పడింది. 


* ప్రభుత్వం ఆదుకోవాలి

ప్రభుత్వ ఉద్యోగినులు, కేజీబీవీ ఒప్పంద ఉద్యోగుల మాదిరే మాకూ 180 రోజులు వేతనంతో కూడిన సెలవులు ఇస్తే మా కష్టాలు తీరుతాయి. శిశు సంరక్షణ సెలవుల సౌకర్యమూ కల్పించాలి.

- గౌతమి, ఒప్పంద ఉద్యోగిని 


* పరిహారం పొందడం గగనమే 

పుట్టిన వెంటనే బిడ్డను వదిలి ఉద్యోగం చేయడం బాధగా ఉంది. ఈఎస్‌ఐ ఉన్నా.. మాకు వేతన పరిహారం పొందడడం కష్టంగా ఉంది. మేము పనిచేసే చోటనే వేతనాలు ఇచ్చే సౌకర్యం కల్పించాలి. మా బాధలు ప్రభుత్వమే తీర్చాలి.

  - విజయ, పొరుగుసేవల ఉద్యోగిని 


* ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం

ఎక్కడికి వెళ్లినా మమ్మల్ని ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగినులు ప్రసూతి సెలవుల కోసం అడుగుతున్నారు. బిడ్డ పుట్టిన వెంటనే ఉద్యోగాలు కాపాడుకోవాలని వారు కార్యాలయాలకు వస్తున్నారు. దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. 

- మామిళ్ల రాజేందర్, టీఎన్జీవో అధ్యక్షుడు


 

Posted Date : 19-09-2021