• facebook
  • whatsapp
  • telegram

OU: ఒప్పంద అధ్యాపకులను బోధనకు అనుమతించాలి

* ఓయూకు మానవ హక్కుల సంఘం ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఒప్పంద అధ్యాపకులను సెప్టెంబర్‌ 20వ తేదీ నుంచి బోధనకు అనుమతించాలని రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఆదేశాలు జారీ చేసింది. హాజరు పట్టికలో సంతకాలు చేసేందుకు వీలు కల్పించాలని స్పష్టం చేసింది. ఇటీవల ఓయూ పరిధిలోని నిజాం, సైఫాబాద్‌ సైన్స్, సికింద్రాబాద్‌ పీజీ, కోఠి మహిళా కళాశాలల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులను ప్రిన్సిపాళ్లకు మౌఖిక ఆదేశాల మేరకు బదిలీ చేశారు. ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాల్లేకుండా బదిలీ చేయడంపై వివాదం రేగింది. ఒప్పంద అధ్యాపకులు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొ.లింబాద్రికి ఫిర్యాదు చేశారు. వారు వర్సిటీ ఉపకులపతిని వివరణ కోరారు. అనంతరం ప్రిన్సిపాళ్లు లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేశారు. ప్రిన్సిపాళ్లకు అంతర కళాశాలల బదిలీలు చేసే అధికారం లేదని, రిజిస్ట్రార్‌కే ఉంటుందని ఒప్పంద అధ్యాపకులు విధుల్లో చేరేందుకు నిరాకరించారు. అనంతరం బదిలీ అయిన కళాశాలలో హాజరు పట్టికలో సంతకాలు చేయకుండా అడ్డుకోవడంతోపాటు పరీక్షల ఇన్విజిలేటర్‌ విధులు కేటాయించకపోవడం, తరగతులకు అనుమతించకుండా ప్రిన్సిపాళ్లు అడ్డుకుంటున్నారని పలువురు ఒప్పంద అధ్యాపకులు ఇటీవల మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించి ఒప్పంద అధ్యాపకులను కళాశాలల్లోకి అనుమతించాలని ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబరు 20కు వాయిదావేసింది.
 

Posted Date : 19-09-2021