• facebook
  • whatsapp
  • telegram

Amazon:భార‌త్‌లో అమెజాన్ గ్లోబల్ కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్ 

ల‌క్ష‌మందికి అవ‌కాశం

 అమెజాన్ సంస్థ భార‌తదేశంలో గ్లోబల్ కంప్యూటర్ సైన్స్ (సీఎస్‌) ఎడ్యుకేషన్ ప్రోగ్రాం - అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ (ఏఎఫ్ఈ)ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రోగ్రాం స‌మాజంలోని వెనుక‌బ‌డిన వ‌ర్గాల విద్యార్థులకు నాణ్య‌మైన కంప్యూటర్ సైన్స్ విద్యను ద‌రిచేర్చి.. ఉద్యోగావ‌కాశాల‌ను పొంద‌డానికి తోడ్ప‌డుతుంది.
ఈ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన మొద‌టి సంవత్సరంలో భార‌త్‌లోని ఏడు రాష్ట్రాల్లోని 900 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల నుంచి లక్ష మందికి పైగా విద్యార్థులకు సీఎస్ విద్య‌ను అందించాల‌ని అమెజాన్ లక్ష్యంగా పెట్టుకుంది.
అమెజాన్ కర్ణాటక, దిల్లీ, హరియాణా, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన సీఎస్ విద్యను అందించడానికి బహుళ విద్య-కేంద్రీకృత లాభాపేక్షలేని సంస్థలతో భాగస్వామ్యం చేసుకుంటుంది.
కంప్యూటర్ సైన్స్ ప్ర‌స్తుతం ఉపాధిరంగంలో కీల‌క‌పాత్ర పోషిస్తోంది.. ముంద‌స్తుగా నేర్చుకునే ఈ విద్య భార‌త‌దేశ యువ‌త‌కు ఉత్త‌మ భవిష్యత్తును నిర్మించుకోవ‌డంలో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భార‌త అమెజాన్ హెడ్‌, గ్లోబల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ వ‌ర్చువ‌ల్ ఈవెంట్ లో పేర్కొన్నారు. అమెజాన్ ఏఎఫ్ఈ యు.ఎస్., యు.కె., కెనడా, ఫ్రాన్స్ దేశాల్లో ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది యువతకు సీఎస్ విద్య‌ను అందించింది.
అమెజాన్ ఏఎఫ్ఈ భారతదేశంలో ప్రధానంగా 6-12 తరగతుల విద్యార్థులపై దృష్టి పెట్ట‌నుంది. కంప్యూటర్ సైన్స్‌ను మరింత ఆకర్షణీయంగా బోధించడానికి ఉపాధ్యాయులు, అధ్యాపకులకు శిక్షణ ఇస్తుంది.
అమెజాన్ భారతీయ విద్యార్థులకు నాణ్య‌మైన సీఎస్ ను అందించ‌డానికి తన గ్లోబల్ నాలెడ్జ్ పార్టనర్ కోడ్.ఆర్గ్ అనే అంత‌ర్జాతీయ లాభాపేక్ష‌లేని కంప్యూటర్ సైన్స్ సంస్థ‌తో ప‌నిచేస్తుంది. వీరు ప్రాంతీయ భాష‌లో విద్య‌ర్థులు, అధ్యాప‌కుల‌కు అర్థ‌మ‌య్యేలా ప్రాథ‌మిక కోడింగ్‌తో పాటు ఏఐ, మిష‌న్ ల‌ర్నింగ్‌, వాయిస్ టెక్నాల‌జీ వంటి కోర్సుల‌ను కూడా నేర్పిస్తారు.
ప్రోగ్రాంలో ఏముంటాయి?
* ప్రోగ్రాంలో భాగంగా 'క్లాస్ చాట్స్' ఉంటాయి. దీని ద్వారా విద్యార్థులు టెక్ ఇండస్ట్రీ కెరీర్‌లను అర్థం చేసుకోవడానికి అమెజానియ‌న్స్‌ను కలుస్తారు. 
* అలాగే అమెజాన్ సైబర్ రోబోటిక్స్ ఛాలెంజ్ గురించి తెలుసుకుంటారు. దీని ద్వారా వారు అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల ఉత్పత్తులను డెలివరీ చేయడానికి రోబోటిక్స్‌ను ఏ విధంగా ఉప‌యోగిస్తుందో తెలుసుకుంటారు.
విద్య‌ర్థుల‌కు ఏఎఫ్ఈ ప్రోత్సాహం..
అమెజాన్ ఇండియా ఈ కార్యక్రమాన్ని భార‌త్ మొత్తం విస్తృతం చేసి సీఎస్ సంబంధిత విద్య‌ను అంద‌రికీ చేరువ చేయ‌నుంది. అలాగే ఏఎఫ్ఈ విద్య‌ర్థుల‌కు స్కాలర్‌షిప్‌లు, ఇంటర్న్‌షిప్‌లు, సమస్యా పరిష్కార హ్యాకథాన్ ఈవెంట్‌లు, టార్గెటెడ్ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌ల ద్వారా ప్రోత్సాహం అందిస్తుంది.

Posted Date : 28-09-2021