• facebook
  • whatsapp
  • telegram

సిద్ధమవుతున్న అమృత వర్సిటీ  

* వచ్చే ఏడాది నుంచి తరగతులు

* 70% నిర్మాణాలు పూర్తి చేసుకున్న అమరావతి క్యాంపస్‌

 

 

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో మాతా అమృతానందమయి మఠం ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న అమృత విశ్వ విద్యాపీఠం (అమృత యూనివర్సిటీ) నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. నవులూరు సమీపంలో 150 ఎకరాల్లో వర్సిటీ ఏర్పాటవుతోంది. తొలి దశలో 50-60 ఎకరాల్లో క్యాంపస్‌ను అభివృద్ధి చేస్తున్నారు. భవన నిర్మాణాలు 60-70 శాతం పూర్తయ్యాయి. మరో నాలుగైదు నెలల్లో నిర్మాణాలను పూర్తి చేసి 2022-23 విద్యా సంవత్సరం నుంచి తరగతులను ప్రారంభించనున్నారు. 

 

14 లక్షల చ.అడుగుల నిర్మాణాలు...

తొలి దశ ప్రాజెక్టులో 14 లక్షల చ.అడుగుల నిర్మిత ప్రాంతం కలిగిన 5 భవనాల్ని నిర్మిస్తున్నారు. వాటిలో అకడమిక్‌ బ్లాక్, సీనియర్‌ అధ్యాపకుల నివాస సముదాయం, హాస్టల్‌ భవనాలు, వంట-భోజనశాల ఉన్నాయి. అకడమిక్‌ బ్లాక్‌ నిర్మాణం 60 శాతంపైగా పూర్తయింది. 5వేల మంది చదువుకునేందుకు వీలుగా తరగతి గదులు ఉంటాయి. 11 అంతస్తులుగా నిర్మిస్తున్న హాస్టళ్ల భవనాలు 70%పైగా పూర్తయ్యాయి. సీనియర్‌ అధ్యాపకులు, సిబ్బంది వసతికి ఉద్దేశించిన 14 అంతస్తుల భవనం పనులు 80% పూర్తయ్యాయి. దీనిపైనే హెలిప్యాడ్‌ నిర్మించనున్నారు. 

 

600 మంది విద్యార్థులతో ప్రారంభం..

తొలి సంవత్సరం 600 మంది విద్యార్థులను చేర్చుకోనున్నారు. ఇంజినీరింగ్‌లో 300, బీఎస్సీ, ఎమ్మెస్సీ కోర్సుల్లో 300 మందికి ప్రవేశాలను కల్పిస్తారు. దేశంలోని మిగతా అమృత విద్యా సంస్థలతోపాటే ఈ క్యాంపస్‌లో అడ్మిషన్లకూ ఏప్రిల్‌లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. అందులోని ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. జేఈఈ ర్యాంకులతోనూ అడ్మిషన్‌ ఇస్తారు. ఇంజినీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, సైబర్‌ సెక్యూరిటీ, రొబోటిక్స్, ఈసీఈ వంటి కోర్సులు ఉంటాయని, ఐదేళ్ల ఎమ్మెస్సీ ఇంటిగ్రేటెడ్‌ కోర్సునూ ప్రారంభించే యోచనలో ఉన్నామని అమృత విశ్వవిద్యాపీఠం (అమరావతి క్యాంపస్‌) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ స్వామి సదాశివానందపురి తెలిపారు. 

Posted Date : 05-08-2021