ఇతర రాష్ట్రాల్లో చదివితే మరింత జ్ఞానం
భారత వ్యవసాయ పరిశోధన సంస్థ సీట్లలో ఏపీవి 17, తెలంగాణవి 15 మాత్రమే
ఈనాడు, హైదరాబాద్: తెలుగునాట వ్యవసాయ విద్యనభ్యసించేవారు ఇతర రాష్ట్రాల్లో కూడా డిగ్రీ, పీహెచ్డీ చదివితే.. అక్కడి వ్యవసాయ స్థితిగతుల గురించి తెలుసుకోగలుగుతారని, తద్వారా ఇక్కడి అన్నదాతలకు అదనపు ప్రయోజనం కలుగుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వ్యవసాయంలో కనీసం యూజీ లేదా పీజీ డిగ్రీ లేదా పీహెచ్డీ ఇతర రాష్ట్రాల వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో గానీ లేక భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్)కు చెందిన జాతీయ విద్యాసంస్థల్లో చదివినవారిలో వ్యవసాయ రంగంపై అధునాతన పరిజ్ఞానానికి సంబంధించిన అంశాలపై ఎక్కువ అవగాహన ఉంటోంది.బీటెక్ లేదా ఎంటెక్ వంటి ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరదలుచుకునే తెలుగు విద్యార్థులు ముంబయి, ఖరగ్పూర్, దిల్లీ వంటి ఐఐటీల్లో చేరడానికి వెళుతున్నారు. అదే వ్యవసాయ డిగ్రీ లేదా పీజీ డిగ్రీలో చేరేవారిలో ప్రతిభావంతులు తెలుగు రాష్ట్రాల వ్యవసాయ కాలేజీల్లోనే చేరుతున్నారే తప్ప ఇతర రాష్ట్రాల కళాశాలలకు, జాతీయ సంస్థలకు వెళ్లడానికి ఇష్టపడటం లేదని ఓ సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త ‘ఈనాడు’కు చెప్పారు. దేశవ్యాప్తంగా 74 వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, 109 ఐసీఏఆర్ జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలున్నా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లి వాటిలో చేరుతున్నవారి సంఖ్య పెరగడం లేదు. దీంతో ఇతర రాష్ట్రాల విద్యార్థులకు లబ్ధి చేకూరుతోంది. ఐసీఏఆర్కు చెందిన జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థల్లో పలు వ్యవసాయ కోర్సులున్నాయి. ఉదాహరణకు దిల్లీలో ఐసీఏఆర్కు చెందిన ‘భారత వ్యవసాయ పరిశోధన సంస్థ’(ఐఏఆర్ఐ) ఉంది. అందులో 2021-22లో వ్యవసాయ పీజీ ఎంఎస్సీ కోర్సులో మొత్తం 183 మంది విద్యార్థులు చేరగా అత్యధికంగా పశ్చిమబెంగాల్ విద్యార్థులు 28, కర్ణాటక నుంచి 23, ఏపీ 17, తమిళనాడు, తెలంగాణ 15, ఒడిశా నుంచి 12 మంది ఉన్నారని ఐసీఏఆర్ వెల్లడించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.