• facebook
  • whatsapp
  • telegram

ఏపీ ఇంట‌ర్ సెకండియ‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంటర్‌ రెండో ఏడాది ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేశ్ విడుద‌ల చేశారు. కరోనా కారణంగా ప్ర‌భుత్వం ఈ ఏడాది పరీక్షలను రద్దు చేసిన విష‌యం తెలిసిందే. ఈమేర‌కు ఇంటర్‌ విద్యామండలి పదో తరగతి మార్కులకు 30శాతం, ఇంటర్‌ ప్రథమ సంవత్సరానికి 70శాతం వెయిటేజీతో మార్కులను కేటాయించింది. ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ విద్యార్థుల‌ను ప్ర‌మోట్ చేస్తున్నామ‌ని మంత్రి పేర్కొన్నారు. జులై 31 వ‌ర‌కు ఫ‌లితాలు విడుద‌ల చేయాల‌న్న సుప్రీం ఆదేశాల‌ను పాటిస్తున్నామ‌ని వివ‌రించారు. ఫలితాలను www.eenadupratibha.net, www.pratibha.eenadu.net, http://examresults.ap.nic.in, http://results.bie.ap.gov.in వెబ్‌సైట్లలో పొందవచ్చు.

 

ఫీజు చెల్లించిన వారంతా పాస్‌
‘‘మే 5 నుంచి 23 వరకు నిర్వహించాల్సిన పరీక్షలు కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు సూచనల మేరకు జూన్‌  25 పరీక్షలు రద్దు చేస్తున్నట్టు సీఎం నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిర్ణయించిన తేదీ కంటే వారం రోజుల ముందుగానే ఫలితాలు వెల్లడిస్తున్నాం. మార్కులు ఎలా ఇవ్వాలనే దానిపై కమిటీ ఏర్పాటు చేశాం. కమిటీ నివేదిక ఆధారంగా మొత్తం మార్కులకు పదోతరగతి మార్కుల ఆధారంగా 30శాతం వెయిటేజీ, ఇంటర్‌ ఫస్ట్‌ఇయర్‌లో సాధించిన మార్కుల ఆధారంగా 70 శాతం వెయిటేజ్‌తో ఫలితాలు విడుదుల చేస్తున్నాం. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఫెయిల్‌ అయిన విద్యార్థులు పరీక్ష  ఫీజు చెల్లించి ఉంటే వారికి కూడా మినిమం 35 మార్కులు ఇచ్చాం. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 5,08,672 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 2,53,138 మంది, బాలికలు 2,55,534 మంది ఉన్నారు. వీరంతా ఉత్తీర్ణులయ్యారు’’ అని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వెల్లడించారు. ఈ ఫలితాలపై సంతృప్తి చెందని వారికి పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 

Posted Date : 23-07-2021